Thursday, January 23, 2025

కిటోజెనిక్ ఫుడ్‌తో చక్కని ఆరోగ్యం

- Advertisement -
- Advertisement -

ఎక్కువ కొవ్వు పదార్ధం, తక్కువ కార్బోహైడ్రేట్లు కలిగిన “కిటోజెనిక్ ” డైట్ వల్ల తెలివితేటలు, జ్ఞాపక శక్తి పెరుగుతాయని అమెరికా లోని కెంటకీ యూనివర్శిటీ పరిశోధకులు వెల్లడించారు. మెదడు లోని రక్తప్రవాహం ( cerabral blood flow ) , మెదడుకు రక్తం, పోషక విలువలు తీసుకెళ్లే వ్యవస్థ (bloodbrain barrier) న్యూరో వాస్కులర్ ఇంటెగ్రిటీ (nurovascular integrity) అంటే నరాల సమగ్రత , ఇవన్నీ మనిషి లోని తెలివితేటలకు, గ్రాహక శక్తిని పెంపొందించడంలో కీలక పాత్ర వహిస్తాయని చెప్పారు. ఈ నేపథ్యంలో కిటోజెనిక్ ఆహారం మెదడు లోని నాళాలను చైతన్యం చేయడమేకాక, నరాల క్షీణతను కూడా తగ్గిస్తుందని చెప్పారు. అసలు కిటోజెనిక్ డైట్ అంటే ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండే ఆహారం. వేపుళ్లు, చిరుతిళ్లు నూనె పదార్ధాలు కావు. గింజలు, మాంసాహారం, చేపలు వంటివి కిటోజెనిక్ డైట్ కిందకు వస్తాయి.

కార్బొహైడ్రేట్లను చాలా తక్కువగా, 50 గ్రాముల మోతాదు కన్నా తక్కువగా, తీసుకోవాలి. నిత్యం తీసుకునే ఆహారంలో కొవ్వు పదార్ధాలతోపాటు ప్రొటీన్లు ఎక్కువగా ఉండేలా తీసుకోవాలి. కిటోజెనిక్ డైట్ ప్రభావంతో మూర్ఛ, పార్కిన్‌సన్ వ్యాధుల రోగుల్లో సత్ఫలితాలు కనిపించాయని పరిశోధకులు చెప్పారు. అయితే ఈ ప్రభావాన్ని మరింతగా, పరిశీలించడానికి ఎలుకలపై ప్రయోగాలు చేశారు. 12 నుంచి 14 వారాల వయసు ఉన్న ఎలుకల రెండు గ్రూపులను ప్రయోగాల్లోకి తీసుకున్నారు. వీటికి రెగ్యులర్‌గా కిటోజెనిక్ డైట్ అందించారు. 16 వారాల తరువాత ఎలుకల్లో ఎలాంటి ప్రభావం ఉందో పరిశీలించగా, ఎలుకల్లో సెరెబ్రల్ బ్లడ్ ఫ్లో పెరగడాన్ని గమనించారు. పేగుల్లో ఆరోగ్యం (gut health) కూడా బాగా మెరుగుపడింది. బ్లడ్ గ్లూకోజ్ స్థాయిలు తక్కువయ్యాయి. శరీరం బరువు తగ్గింది. కిటోజెనిక్ డైట్ జాబితాలో చికెన్, మటన్, చేపలు, రొయ్యలు, కార్బొహైడ్రేట్లు తక్కువగా ఉండే అన్ని ఆకు కూరలు, కూరగాయలు, నట్స్, గింజలు (అవిసెలు, గుమ్మడికాయ విత్తనాలు, పొద్దుతిరుగుడు విత్తనాలు) కొబ్బరి నూనె, వెన్న, నెయ్యి, చీజ్, పాలమీద మీగడ, కోడిగుడ్లు, ఆలివ్ ఆయిల్ ఇవన్నీ ఉంటాయి. వీటిని తినడం మొదలు పెట్టాలి.

ప్రొటీన్లు, కొవ్వులను ఎక్కువగా తీసుకోవాలి. దీంతో మూడు, నాలుగు రోజుల్లో శరీరంలో కిటోసిస్ అనే దశ ప్రారంభమౌతుంది. అంటే కిలోజెనిక్ డైట్‌కు అలవాటు పడినట్టు. ఈ దశలో కిటో ఫ్లూ వస్తుంది. ఈ దశలో ప్రవేశించగానే అలసట, ఒళ్లు నొప్పులు, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. శరీరం లోని నీరంతా బయటకు పోతుంది. డీహైడ్రేషన్ వస్తుంది. నాలుక లోహపు రుచిని కలిగి ఉంటుంది. ఒకటి రెండు రోజులు మాత్రమే ఈ లక్షణాలు ఉంటాయి. ఈ దశ దాటితే శరీరం కొవ్వును ఇంధనంగా వాడుకోవడం ప్రారంభిస్తుంది. ఈ దశ తరువాత శరీరంలో కొవ్వు కరగడం మొదలవుతుంది. వారం రోజుల్లోనే శరీరం బరువులో మార్పు వస్తుంది. 21 రోజుల పాటు కిటోజెనిక్ డైట్‌ను పాటిస్తే త్వరగా అధిక బరువు తగ్గుతారు. అయితే వైద్యుల సలహా మేరకే ఈ డైట్‌ను తీసుకోవాలి. లేదంటే కిడ్నీల సమస్యలు వస్తాయి. ఈ డైట్ వల్ల డయాబెటిస్, థైరాయిడ్ సమస్యలు తగ్గుతాయి. చర్మసమస్యలు ఉండవు. క్యాన్సర్లు చాలావరకు రాకుండా ఉంటాయి.గుండె ఆరోగ్యం బాగుంటుందని వైద్యులు చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News