Sunday, January 12, 2025

ప్రభుత్వాసుపత్రులకూ నాణ్యత గుర్తింపు

- Advertisement -
- Advertisement -

ఉస్మానియా దవాఖానాకు పూర్వవైభవం
15రోజుల్లో శంకుస్థాపన క్యాన్సర్‌కు
సైతం జిల్లాల్లోనూ చికిత్స ఆసుపత్రుల్లో
సమస్యలపై ఫిర్యాదులకు టోల్‌ఫ్రీ నెం.
ఆచరణ సాధ్యంపై ఆలోచించి చర్యలు
మన తెలంగాణ ప్రత్యేక ఇంటర్వూలో
వైద్యారోగ్యశాఖ మంత్రి రాజనరసింహ

మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రభుత్వ వైద్య సేవల్లో నాణ్యత ప్రమాణాలు పెంపొందించి ప్రజలకు ఉచితంగా మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్షంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహా తెలిపారు. ఇందుకోసం ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న ఉత్తమ విధానాలపై అధ్యయనం చేసి, ఆయా రాష్ట్రాలలో అనుసరిస్తున్న విధానాలను మన రాష్ట్రంలో అమలు చేస్తాం. కార్పోరేట్, ప్రైవేట్ ఆసుపత్రులకే పరిమితమైన ఎన్‌ఎబీహెచ్ వంటి జాతీయ స్థాయి నాణ్యతా ప్రమాణాల గుర్తింపు ప్రభుత్వాసుపత్రులకు తీసుకువచ్చే దిశగా కృషి చేస్తున్నామని చెప్పారు.

ఆసుపత్రులు అపరిశుభ్రంగా ఉండటం వల్ల, ప్రతి రోజూ బెడ్ షీట్లు మార్చకపోవడం వల్ల ఇన్ఫెక్షన్లు సోకి ఇతర వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుందని, ఈ నేపథ్యంలో ఆసుపత్రుల్లో సరైన మౌళిక వసతులు, అవసరమైన వైద్యులు, సిబ్బందిని నియమించి ఆసుపత్రులు పరిశుభ్రత పాటించేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వాసుపత్రుల్లో రోగులకు ఏమైనా సమస్యలు వస్తే సులువుగా ఫిర్యాదు చేసేలా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటుపై ఆలోచిస్తామని వెల్లడించారు. టోల్ ఫ్రీ నెంబర్ ఆచరణ సాధ్యమా..? కాదా..? పరిశీలించి, ఏ రకంగా చేయాలో ఆలోచించి చర్యలు తీసుకుంటామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఏడాది పూర్తవుతున్న సందర్భంగా మంత్రి దామోదర రాజనరసింహ ‘మన తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వూ ఇచ్చారు. ఈ ఇంటర్వూ ముఖ్యంశాలు మంత్రి మాటల్లోనే…

రోగుల సంఖ్యకు అనుగుణంగా మార్పులు..

ఆరోగ్యమే మహాభాగ్యం అని, ప్రజల ఆరోగ్య సంరక్షణ ప్రభుత్వం బాధ్యత. రోగం వస్తే ఉచితంగా వైద్యం అందుతుందనే భరోసా ప్రజలకు కలగాలని, ఆ భరోసాను కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యం. అయితే గత పదేళ్లలో ప్రభుత్వాసుపత్రుల్లో అనుకున్న స్థాయిలో పడకలు, ఇతర వసతులు పెరగలేదు. కాబట్టి ప్రస్తుత అవసరాల మేరకు ఆసుపత్రుల్లో పడకలు, ఇతర మౌలిక వసతుల పెంపుపై దృష్టి సారించాం.

ఆసుపత్రుల్లో ప్రస్తుతం నమోదవుతున్న ఔట్ పేషేంట్, ఇన్‌పేషెంట్ రోగుల సంఖ్యను ఎప్పటికప్పుడు పరిశీలించి, పెరిగిన ఓపీ, ఐపీకి అనుగుణంగా వైద్యులు, సిబ్బందిని పెంచడంతోపాటు ఇతర మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా మా ప్రభుత్వం ఆలోచిస్తున్నది. ఇక నుంచి ఈ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుంది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న టెస్టులు చేసే మెషిన్లు సరిగ్గా పనిచేస్తున్నాయా..? లేదా..? ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నాం. వస్తున్న రోగులకు సరిపడా వైద్యులు, సిబ్బంది లేని ఆసుపత్రులలో రోగులు ఇబ్బంది పడుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఈ సమస్యను అధిగమించడం కోసం ఆసుపత్రుల్లో మెడికల్ సర్వీసులు, డయాగ్నస్టిక్ సర్వీసులు, ఫార్మసీ సర్వీసులు, అడ్మినిస్ట్రేటివ్ సర్వీసులు సమర్థవంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో ఎప్పటికప్పుడు ఆడిట్ నిర్వహిస్తున్నాం. ఆడిట్ నివేదిక ఆధారంగా మెషిన్లు రిపేర్ చేయడంతో పాటు మానవ వనరులు నియమిస్తున్నాం. అవసరాల మేరకు వైద్యులు, సిబ్బందిని సర్దుబాటు చేస్తున్నాం. రాబోయే పది సంవత్సరాలలో పరిస్థితులను అంచనా వేసి, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటాం.

15 రోజుల్లో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన

పెరిగిన జనాభాకు అనుగుణంగా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు మరిన్ని ఆసుపత్రులు, వైద్యులు, సిబ్బంది పెరగాల్సిన అవసరం ఉంది. ఇది నిరంతరంగా జరగాలి. కానీ గత కొన్నేళ్లుగా జనాభాకు అనుగుణంగా ఆసుపత్రులు పెరగకపోవడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే రోగులు ఇబ్బంది పడుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఈ సమస్యను పరిష్కరించడంపై మా ప్రభుత్వం దృష్టి సారించింది. అందులో భాగంగా గోషామహల్ లో ఉస్మానియా హాస్పిటల్ కొత్త భవనాన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నంది. మరో 15 రోజుల్లో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తాం. గతంలో ఉన్న జనాభాకు అనుగుణంగా ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం జరిగింది. కానీ ప్రస్తుత జనాభాకు ఇప్పుడు ఉన్న ఆసుపత్రి, వైద్యులు, సిబ్బంది సరిపోవడం లేదు.

అందుకే గోషామహల్‌లో సుమారు 32 ఎకరాల విస్తీర్ణంలో కొత్త ఉస్మానియా దవాఖాన నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రూ.2 వేల కోట్లతో సువిశాలమైన ఆస్పత్రి భవనాలు నిర్మించి, ప్రజలకు అందించబోతున్నాం. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా గోషామహల్‌లో కొత్త ఆసుపత్రిని నిర్మించబోతున్నాం. గతంలో తెలంగాణకే తలమానికంగా ఉన్న ఉస్మానియా ఆసుపత్రికి మళ్లీ పూర్వ వైభవం తీసుకువస్తాం. ఉస్మానియా, గాంధీ, కాకతీయ మెడికల్ కాలేజీ విద్యార్థుల కోసం కొత్త హాస్టల్ బిల్డింగ్స్‌ను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ భవనాల నిర్మాణం కోసం రూ.204.85 కోట్లను కేటాయించించాం. దీంతో పాటు నిర్మాణంలో ఉన్న సనత్‌నగర్, అల్వాల్, ఎల్‌బినగర్ టిమ్స్ ఆసుపత్రులను, నిమ్స్ ఆసుపత్రి కొత్త భవనం అందుబాటులో తీసుకువస్తాం. అలాగే వరంగల్‌లో రెండు వేల పడకల సామర్థంతో నిర్మిస్తున్న ఆసుపత్రిని త్వరలోనే ప్రారంభిస్తాం. ఈ ఆసుపత్రుల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరికొన్ని నెలల్లో ఈ ఆసుపత్రులు అందుబాటులోకి తీసుకువస్తాం.

జిల్లా స్థాయిలో సూపర్‌స్పెషాలిటీ సేవలు

రాష్ట్రంలో మారుమూల ప్రాంతాలలో ఉండే ప్రజలు సూపర్‌స్పెషాలిటీ వైద్యం కోసం హైదరాబాద్ వరకు వచ్చే అవసరం లేకుండా జిల్లా స్థాయిలోనే సూపర్ స్పెషాలిటీ వైద్యం అందుబాటులోకి వచ్చేలా చర్యలు చేపడుతున్నాం. ప్రస్తుతం జిల్లాల్లోనే వైద్య కళాశాలలు ఏర్పాటైన నేపథ్యంలో అక్కడే అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి తీసుకువస్తున్నాం. ఎంఎన్‌జె క్యాన్సర్ సెంటర్‌కు అనుబంధంగా క్యాన్సర్ రీజనల్ సెంటర్లు ఏర్పాటు చేసి, క్యాన్సర్‌కు సైతం జిల్లాల్లోనే చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ముందుగా ఉమ్మడి జిల్లాకు ఒకటి చొప్పున పాలియేటివ్ కేర్ సెంటర్లు కూడా అందుబాటులోకి తీసుకువస్తాం. తర్వాత మరిన్ని సెంటర్లు పెంచేందుకు చర్యలు తీసుకుంటాం.

ఎక్కడా మందుల కొరత లేదు..కొత్త 22 సిఎంసిలను తీసుకువచ్చాం

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్కడా మందుల కొరత లేదు. పేదలకు మెడిసిన్ అందించడంలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రజా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మందుల పంపిణీకి కొత్తగా 22 సెంట్రల్ మెడిసిన్ స్టోర్లను ఏర్పాటు చేశాం. ఇదివరకు 11 జిల్లాల్లో మాత్రమే మెడిసినల్ స్టోర్స్ ఉండగా, రూ.137 కోట్లు ఖర్చు చేసి కొత్త స్టోర్స్ అందుబాటులోకి తీసుకొచ్చాం. ఆసుపత్రులలో మెడిసిన్ లేవంటూ ఎక్కడో ఒక చిన్న సంఘటను పెద్దగా చేసి చూపించారు. ప్రభుత్వ దవాఖాన్ల కోసం కొనుగోలు చేసే మెడిసిన్ ఇండెంట్ నుంచి రోగులకు మందులు చేరే వరకూ పూర్తి సమాచారం ఆన్‌లైన్‌లో నమోదు చేసేలా చర్యలు తీసుకున్నాం. ఎక్కడా మందుల కొరత లేకుండా పకడ్బంధీగా చర్యలు తీసుకుంటున్నాం. పెద్ద వ్యవస్థల్లో చిన్న చిన్న లోపాలను ఎత్తి చూపే ప్రయత్నం చేయొద్దు.

ఆరోగ్య శాఖను ప్రక్షాళన చేస్తున్నాం

రాష్ట్రంలో ఆరోగ్య శాఖ పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తున్నాం. మారుతున్న పరిస్థితులు, పెరిగిన జనాభాకు అనుగుణంగా కొత్త విధానాలు తీసుకురావడంతో పాటు ఇప్పటికే ఉన్న విధానాలలో లోపాలను సవరించుకుంటూ ముందుకుపోతాం. అందులో భాగంగా వైద్య విధాన పరిషత్‌ను డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్‌గా తీసుకువచ్చేలా ఆలోచిస్తున్నాం. త్వరలో దీనిపై ప్రస్తుతం అధ్యయనం చేస్తున్నాం. గతంలో వైద్య విధాన పరిషత్, డైరెక్టర్ పబ్లిక్ హెల్త్ పోస్టులకు ఇంఛార్జ్‌లు ఉండేవారు. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత రెగ్యులర్ పోస్టులు తీసుకువచ్చాం. ముఖ్యంగా ప్రాథమిక వైద్యం, సెకండరీ హెల్త్ కేర్‌పై దృష్టి సారిస్తున్నాం.

10 నిమిషాల్లోనే అంబులెన్స్ వెళ్లేలా చర్యలు

మెడికల్ ఎమర్జన్సీలో ఉన్న పేషెంట్లను గోల్డెన్ హవర్‌లో హాస్పిటల్‌కు చేర్చి, వారి ప్రాణాలు కాపాడాలన్న లక్ష్యంతో 108 అంబులెన్స్‌లను పెంచాం. రాష్ట్రంలో అంబులెన్స్‌ల సంఖ్య 790 నుంచి 1003కి పెంచడం వల్ల, అంబులెన్స్ రెస్పాన్స్ టైమ్‌ను సగటున 18 నిమిషాల నుంచి 14 నిమిషాలకు తగ్గుతుంది. పది నిమిషాల్లోనే అంబులెన్స్‌ను పంపించి బాధితుల ప్రాణాలు కాపాడాలని ప్రజా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది.
2005 సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం 108 అంబులెన్స్ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. అనేక రాష్ట్రాలు ఈ స్కీమ్‌ను ఆదర్శంగా తీసుకుని అమలు చేశాయి. ఇందులో భాగంగా ప్రతి మండలానికి ఒక అంబులెన్స్ అందుబాటులోకి తీసుకొస్తున్నాం.

ప్రతి జిల్లాలో ఎన్‌సిడి క్లినిక్‌లు

జీవన శైలిలో వచ్చిన మార్పులు, ఇతర కారణాలతో బిపి, షుగర్, క్యాన్సర్ వంటి నాన్ కమ్యునికెబుల్ డిసీజెస్ రోగుల సంఖ్య పెరుగుతోంది.రోగులకు సహాయం అందజేసేందుకు ప్రతి జిల్లాలో ఎన్‌సీడీ క్లినిక్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాం. మాతా, శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రాల(ఎంసీహెచ్) తరహాలో పేషెంట్లకు అన్ని రకాల వైద్య సేవలు అందించేలా క్లినిక్‌లను రూపొందించాం. సుమారు 50 లక్షల మంది పేషెంట్లకు ఈ క్లినిక్‌ల ద్వారా వైద్యం అందనున్నది.

74 ట్రామా కేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయం

మెడికల్ ఎమర్జన్సీలోఉన్న పేషెంట్లను గోల్డెన్ అవర్‌లో హాస్పిటల్‌కు చేర్చి, వారి ప్రాణాలు కాపాడాలన్న లక్ష్యంతో 2005 సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం 108 అంబులెన్స్ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చిందని, అనేక రాష్ట్రాలు ఈ స్కీమ్‌ను ఆదర్శంగా తీసుకుని అమలు చేశాయని మంత్రి గుర్తు చేశారు. పది నిమిషాల్లోనే అంబులెన్స్‌ను పంపించి వారి ప్రాణాలు కాపాడాలని ప్రజా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదని పేర్కొన్నారు. కొత్తగా 213 అంబులెన్స్‌లను అందుబాటులోకి తీసుకొచ్చామని, వీటితో కలిపి రాష్ట్రంలో అంబులెన్స్‌ల సంఖ్య 790 నుంచి 1003కి పెరిగిందని అన్నారు. అంబులెన్స్ రెస్పాన్స్ టైం సగటున 18 నిమిషాల నుంచి 13 నిమిషాలకు తగ్గుతుందని చెప్పారు. రోడ్డు ప్రమాదాల్లో, ఇతర ఎమర్జన్సీ సమయంలో బాధితుల ప్రాణాలు కాపాడుకునేలా రాష్ట్ర, జాతీయ రహదారులపై ప్రతి 30 కిలోమీటర్లకు ఒకటి చొప్పున 74 ట్రామా కేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ప్రకటించారు. మాతృత్వం కోసం పరితపిస్తున్న దంపతుల కోసం ప్రజా ప్రభుత్వం గాంధీ హాస్పిటల్‌లో ఐవీఎఫ్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిందని చెప్పారు. పేట్లబుర్జు దవాఖానలో త్వరలోనే ఐవీఎఫ్ సెంటర్‌ను ప్రారంభిస్తున్నామని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News