ఇటీవల కురుస్తున్న వానలకు విజృంభిస్తున్న రోగాలు
ఉచితంగా మందులు, టెస్టులు చేస్తున్న వైద్య సిబ్బంది
గ్రేటర్‌లో 224 దవాఖానల్లో పేదలకు ఉచితంగా చికిత్సలు
రోజుకు 120మందికి వైద్యం అందిస్తున్న దవాఖానలు
బస్తీదవఖానల పనితీరుపై ప్రశంసలు కురిపిస్తున్న నగరవాసులు
హైదరాబాద్: నగరంలో పేదల వైద్యానికి భరోసా ఇచ్చే బస్తీదవాఖానలు సీజనల్ వ్యాధులకు మెరుగైన సేవలందిస్తూ ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తున్నాయి. గత పది రోజుల నుంచి వివిధ బస్తీల ప్రజలు చికిత్సల కోసం పెద్ద ఎత్తున వస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు సీజనల్ వ్యాధులు విజృంభణ చేయడంతో ప్రజలు సకాలంలో చికిత్స చేయించుకునేందుకు బస్తీదవాఖానలకు వెళ్లుతున్నారు. కార్పొరేట్ తరహాలో నాణ్యమైన సేవలు అందిస్తుండటంతో ప్రజలు దవాఖానల సేవలపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రిలో ఒక డాక్టరు,నర్సు,కాంపౌండర్ సేవలందిస్తూ ఉదయం 9గంటల నుంచి సాయంత్ర 7 గంటల వరకు అందుబాటులో ఉండటంతో దగ్గు,జలుబు,జ్వరం లక్షణాలున్న వారంతా బస్తీదవాఖానల్లో గంటల తరబడి ఉంటూ వివిధ రకాలు పరీక్షలు చేయించుకుని ఉచితంగా మందులు తీసుకుంటున్నారు. గ్రేటర్ పరిధిలో 224 బస్తీ దవాఖానలో ప్రజలకు వైద్య సేవలు అందుతున్నాయి.
రోగులకు 200రకాల మందులు, 60 రకాల టెస్టులు నిర్వహిస్తున్నారు. సీజనల్ వ్యాధుల విజృంభణతో రోజుకు 120మందివరకు వస్తున్నట్లు, కొన్ని చోట్ల 150మంది రోగులు వైద్యం కోసం వస్తున్నట్లు ఆసుపత్రి సిబ్బంది పేర్కొంటున్నారు. ఎక్కువ చాంద్రాయణగుట్ట,సంతోష్‌నగర్, బహదూర్‌పురా,కార్వాన్, చార్మినార్,సైదాబాద్, మెహిదిపట్నం, యాకుత్‌పురా, డబీర్‌పురా,మలక్‌పేట వంటి చోట్ల ఏర్పాటు చేసిన బస్తీదవాఖానకు రోగుల రద్దీ ఎక్కువ ఉందని జిల్లా వైద్యాధికారులు పేర్కొంటున్నారు. ఈఏడాది సీజనల్ వ్యాధులను వైద్య సిబ్బంది సులువుగా ఎదుర్కొని పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలని ఆదేశించినట్లు వైద్యశాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. దీనికి తోడు కరోనా సోకే అవకాశం ఉన్నందున్న ర్యాపిడ్ టెస్టులు రోజుకు 30మందికి చేస్తున్నట్లు వెల్లడిస్తున్నారు. మరో రెండు నెలల్లో 15 బస్తీదవాఖానలు అందుబాటులోకి తెచ్చేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులతో వైద్యశాఖ ప్రయత్నాలు చేస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. త్వరలో శస్త్రచికిత్సలు కూడా ఇక్కడే చేసే విధంగా ఆపరేషన్ థియేటర్లు కూడా ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. సీజనల్ వ్యాధులు పట్ల ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరంలేదని, దవాఖానకు వచ్చి ప్రతి రోగికి వైద్యం సేవలందిస్తామని వెల్లడిస్తున్నారు.