మనతెలంగాణ, సిటిబ్యూరోః ఉత్తమ ప్రతిభ కనబర్చి రివార్డులకు ఎంపికైన వారు మరిన్ని సేవలు ప్రజలకు చేయాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర అన్నారు. విధి నిర్వహణలో ఉత్తమ పనితీరును కనబర్చిన సిసిఎస్ సిబ్బందికి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర గచ్చిబౌలిలోని కమిషనరేట్‌లో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో రివార్డులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులు సమర్థవంతంగా పనిచేయడం వల్లే కమిషనరేట్‌లో 80శాతానికి పైగా క్రైం డిటెక్షన్ ఉందని తెలిపారు.
సిసిఎస్ సిబ్బంది కృషి వల్లే ఇది సాధ్యమైందని అన్నారు. ప్రజల భద్రతకు మరింత కష్టపడి పనిచేయాలని, సిసిఎస్, శాంతిభద్రతలు ఇరువురు సమన్వయంతో పనిచేయాలని కోరారు. సిబ్బంది క్రైం డిటెక్షన్‌పై రోజు సమీక్ష నిర్వహించుకోవాలని అన్నారు. సిసిఎస్‌లో అధునాతనమైన స్పెషల్ వింగ్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. డాటా అనాలిసిస్ ద్వారా త్వరగా కేసులను పరిష్కరించవచ్చని అన్నారు. సిబ్బంది సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. బాలానగర్, శంషాబాద్, మాదాపూర్, మేడ్చల్ జోన్లకు చెందిన సిసిఎస్ సిబ్బంది రివార్డులు అందుకున్నారు. కార్యక్రమంలో క్రైం డిసిపి కల్మేశ్వర్, మాదాపూర్ డిసిపి సందీప్, ఎడిసిపి నంద్యాల నర్సింహారెడ్డి, ఎడిసిపి క్రైం నరసింహారెడ్డి, పిపిశ్రీనివాస్‌రెడ్డి, ఎసిపిలు,ఇన్స్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.