Monday, December 23, 2024

ఆసియా కప్‌లో బెట్టింగ్ జోరు

- Advertisement -
- Advertisement -

Betting is in full swing in the Asia Cup

మూడు కమిషనరేట్లలో బెట్టింగ్
ఆన్‌లైన్‌లోనే డబ్బుల వ్యవహారాలు
పంటర్‌ల సాయంతో బెట్టింగ్
అరెస్టు చేసిన పోలీసులు

మనతెలంగాణ, హైదరాబాద్ : బెట్టింగ్ రాయుళ్లు ఎలాంటి క్రికెట్ మ్యాచ్‌ను కూడా వదలడంలేదు. ఇప్పటి ఐపిఎల్ క్రికెట్ మ్యాచ్‌లో ఎక్కువగా మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో బెట్టింగ్ ఎక్కువగా నిర్వహించేవారు. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఆసియా కప్‌ను కూడా వదలడం లేదు. మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో బూకీలు బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన పలువురు బూకీల వద్ద నుంచి యాప్‌లను కొనుగోలు చేసి దాని ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. వీరికి సాయంగా నగర వ్యాప్తంగా పంటర్లను నియమించుకున్నారు. బెట్టింగ్ ద్వారా కోట్లాది రూపాయలు ఆర్జించే అవకాశం ఉండడంతో చాలామంది బెట్టింగ్ నిర్వహించేందుకు పంటర్లు, ఏజెంట్లతో పాటు అన్ని తయారు చేసుకున్నారు. క్రికెట్ ప్రియులకు ఉన్న ఆసక్తిని బెట్టింగ్ నిర్వాహకులు సొమ్ము చేసుకుంటున్నారు. టివిల్లో మ్యాచ్‌లు చూస్తూ బెట్టింగ్ నిర్వహిస్తారు.

బెట్టింగ్‌లో ముఖ్యంగా యువకులు, విద్యార్థులు ఎక్కువగా పాల్గొంటున్నారు. చాలామంది వద్ద డబ్బులు లేకున్నా అప్పు చేసి బెట్టింగ్ కడుతున్నారు, తర్వాత నిర్వహకులకు ఇవ్వలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి కేసులు చాలా వరకు దాడుల వరకు వెళ్లాయి. మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని చిక్కడపల్లి, బేగంబజార్, కూకట్‌పల్లి, కోఠి తదితర ప్రాంతాల్లో ఎక్కువగా బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. రూ.100కు రూ.200 ఇస్తామని చెబుతుండడతో చాలామంది యువకులు సులభంగా డబ్బులు సంపాదించవచ్చని బెట్టింగ్ కట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఆసియా కప్‌లో బెట్టింగ్ నిర్వహిస్తున్న నలుగురు నిందితులను ఛత్రినాక, టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.1,81,000లను స్వాధీనం చేసుకున్నారు.

బాల్ బాల్‌కు బెట్టింగ్…

టివిల్లో మ్యాచ్‌లను చూస్తు బాల్‌కు ఫోర్, సిక్స్ కొడితే ఇంతా, అవుట్ అయితే ఇంతా అని బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ఐపిఎల్‌లో ఎక్కువగా ఇలాగే బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ఐపిఎల్ ఫైనల్ మ్యాచ్‌కు జరిగే బెట్టింగ్ వేల కోట్ల రూపాయల బెట్టింగ్ జరుగుతుంది. నగర వ్యాప్తంగా పంటర్లను నియమించుకుని బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ఒక్కో నిర్వహకుడి కింద 100 నుంచి 300మంది పంటర్లు ఉంటున్నారు. పంటర్లు తమకు తెలిసిన వారికి ఫోన్లు చేసి బెట్టింగ్ కట్టేందుకు యత్నిస్తున్నారు. అంతేకాకుండా డబ్బులు చేతికి ఇవ్వకుండా బ్యాంక్ ఖాతాలను ఆన్‌లైన్‌లో ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు బెట్టింగ్ ముఠాలపై కన్ను వేసి ఉన్నారు. గతంలో బెట్టింగ్ నిర్వహించిన వారిపై నిఘా పెట్టారు. చాలామంది బెట్టింగ్ నిర్వాహకులు అరెస్టు అయినా కూడా మళ్లీ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు.

సంపన్నులే టార్గెట్…

బెట్టింగ్ ముఠాలు ఎక్కువగా సంపన్నులను టార్గెట్‌గా చేసుకుని బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. వారిని ఫోన్ ద్వారా సంప్రదించి వారి బ్యాంక్ ఖాతాలు ఇచ్చి డబ్బులను ఆన్‌లైన్ ద్వారా తీసుకుంటున్నారు. దీంతో ఎవరికి అనుమానం రాదని వారి నమ్మకం. కాకపోతే బెట్టింగ్‌లోకి మధ్యతరగతి యువకులు కూడా వస్తున్నారు. బెట్టింగ్‌లో సులభంగా డబ్బులు సంపాదించవచ్చనే భ్రమతో వచ్చి అప్పులు చేసి మరీ బెట్టింగ్ కడుతున్నారు. డబ్బులు పోవడంతో ఆర్థికంగా కోలుకోలేకపోతున్నారు. నగరంలోని పబ్బులు, స్టార్ హోటళ్లు ముఖ్యంగా బెట్టింగ్‌కు అడ్డాగా మారుతున్నాయి. క్రికెట్ మ్యాచ్‌లు జరిగే సమయంలో ఆయా హోటళ్లు ఆఫర్లు కూడా ప్రకటిస్తున్నాయి. మందుతోపాటు క్రికెట్ బెట్టింగ్ కూడా అక్కడ నిర్వహిస్తున్నారు. ఇక్కడ పోలీసుల నిఘా కూడా తక్కువగా ఉండడంతో బెట్టింగ్ సులభంగా జరుగుతోంది.

కరోనా నుంచి మొదలు….

కరోనా సమయంలో చాలామంది ఇళ్లకు పరిమితం కావడంతో బెట్టింగ్‌ను అలవాటుగా మార్చుకున్నారు. మొదట్లో బెట్టింగ్ కట్టిన వారికి సులభంగా డబ్బులు రావడంతో దానికి అలవాటు పడ్డారు. మొదట్లో బెట్టింగ్ కట్టిన వారు దాని మూలాలు తెలుసుకుని తామే ఆర్గనైజర్లుగా మారారు. సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేసి నగరంలోని అన్ని ప్రాంతాల్లో పంటర్లను నియమించుకుని బెట్టింగ్ నిర్వహిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News