మన తెలంగాణ/హైదరాబాద్ : మరికొన్ని గంటల్లో 17 లోక్‌సభ ఎన్నికల నియోజకవర్గాల పోలింగ్ ప్రక్రియ ప్రా రంభమవ్వనున్న తరుణంలో తెలంగాణలో బెట్టింగ్ రాయుళ్లు రంగ ప్రవేశం చేశారు. బెట్టింగ్‌ల జోరు ఊపందుకుంది. లోక్‌సభ పోలింగ్ కు ముందే బెట్టింగ్‌ల జోరు ఆసక్తిని పెంచేస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్, బిజెపి, బిఆర్‌ఎస్ మధ్య నువ్వా? నేనా? అన్నట్లుగా రాజకీయం నడుస్తున్న తరుణంలో నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల విజయావకాశాలపై బెట్టింగ్‌రాయుళ్లు పందేలు కాస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వం మారడం, అభ్యర్థుల ఎంపిక, ప్రచార సరళి ఆధారంగా బెట్టింగ్‌లు మారుస్తున్నట్లు సమాచారం.
గతానికి పూర్తిగా భిన్నమైన ఎన్నికల వాతావరణం ఈసారి ఉండటం, మూడు పార్టీలు చావో రేవో అన్నట్లుగా తలపడటం రాజకీయ వాతావరణాన్ని హీటెక్కించింది. దీంతో ఆర్గనైజింగ్‌గా బెట్టింగ్‌లకు పాల్పడేవారు ఆయా పార్టీల నేతలతో తమకు ఉన్న పరిచయాల ఆధారంగా రిపోర్టులు తెప్పించుకోవడంతో పాటు, సొంతంగా తాము వేసుకున్న లెక్కలు, మీడియా కథనాల సమాచారం ఆధారంగా బెట్టింగ్‌ల జోరు పెంచినట్లు సమాచారం. ఈ పందేలు పట్టణాల నుంచి గ్రామీణ స్థాయి వరకు పెద్ద ఎత్తున జరుగుతున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా, కాంగ్రెస్, బిజెపి మధ్యే ప్రధానమైన పోటీ ఉండనుందనే అంచనాకు బెట్టింగ్ రాయుళ్లు వస్తున్నారని అంటున్నారు.
దీంతో ఈ రెండు పార్టీల అభ్యర్థులకు రేషియోలు ఫిక్స్ చేస్తూ భారీ మొత్తంలో బెట్టింగ్‌లకు పాల్పడు తున్నట్లు సమా చారం. మరోవైపు కీలక నేతలు పోటీ చేస్తున్న నియోజకవర్గాలపై రూ. కోట్లలో పందేలు కాస్తున్నట్లు సమాచారం. ప్రధానంగా కరీంనగర్, మల్కాజ్ గిరి, సికింద్రాబాద్, మహబూబ్ నగర్, మెదక్ వంటి స్థానాల్లో పార్టీతో పాటు అభ్యర్థులకు రాబోయే మెజార్టీపై సైతం రూ.లక్షల్లో పందేలు కాస్తున్నారని తెలిసింది. ఆయా పార్టీల్లో చివరి నిమిషంలో పార్టీలు మారిన వారు అభ్యర్థులుగా ఉండటం, నియోజకవర్గాల వారీగా క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు ఆధారంగా పందేలు విలువ పెరుగుతున్నట్లు సమాచారం . బెట్టింగ్ రాయుళ్లపై నజర్ వేస్తున్నారు. ప్రస్తుతం పోలింగ్ కు ముందే బెట్టింగ్ లో జోరందుకోగా పోలింగ్ ముగిశాక పోలింగ్ సరళి అంచనాతో, ఆ తర్వాత వెలువడబోయే ఎగ్జిట్ పోల్స్ ఫలితాల అంచనాలతో ఫలితాలపై బెట్టింగ్‌రాయుళ్లు కాళ్లు దువ్వేఅవకాశం ఉందని అంటున్నారు. ఇదిలా వుండగా, ఈ లోక్‌సభ ఎన్నికల్లో అత్యంత ఆసక్తిని నెలకొల్పిన వరంగల్, హైదరాబాద్ స్థానాల్లో ఈ మారు పోటీ రసవత్తరంగా కొనసాగే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఈ రెండు స్థానాలు నిత్యం వార్తల్లో ప్రముఖంగా నిలుస్తున్నాయి. దీంతో ఈ స్థానాల్లో ఆయా పార్టీల విజయావకాశాల కంటే మెజార్టీ అంశాలనే ప్రాతిపదికగా బెట్టింగ్ రాయుళ్లు పందేలు కాస్తున్నట్లు సమాచారం. ప్రముఖంగా ఎంఐఎంఐఎంకు ఆది నుంచి పట్టు ఉన్న హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి బిజెపి అభ్యర్థిగా మాధవీలతను బరిలోకి దింపడంతో ఈ స్థానంపై అందరి దృష్టి పడింది. మునుపెన్నడూ ఈ స్థానంపై ఏ ఒక్కరూ కన్నేసి చూసిన పాపాన పోలేదు. అయితే ఈ మారు ఇక్కడి పరిస్థితి భిన్నంగా మారిన దృష్టా ఈ నియోజకవర్గం బెట్టింగ్ రాయుళ్లను విపరీతంగా ఆకర్షించిందని అంటున్నారు. ఇక వరంగల్ స్థానం సైతం ఇందుకు విరుద్ధంగా లేదనే చెప్పవచ్చు. చివరిక్షణంలో బిఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరి టికెట్ పొందిన కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య ఇక్కడ పోటీ చేస్తుండటంతో ఈ స్థానంలోనూ బెట్టింగ్ రాయుళ్లు ఆసక్తిని కనబరు స్తున్నట్లు సమాచారం.
ఎపిలోనూ ప్రముఖుల గెలుపోటములపై
వినూత్న, విస్తృత స్థాయిలో బెట్టింగ్‌ల జోరు
ఎపిలో ఎన్నికలు ఈ సారి కాక రేపుతున్నాయి. ఇక్కడ అసెంబ్లీతో పాటు పార్లమెంటు ఎన్నికలు కూడా కొనసాగనుండటంతో మరింత ఆసిక్తిని కలిగిస్తున్నాయి. దీంతో ఎపిలోనూ బెట్టింగ్ రాయుళ్లు దృష్టి సారించారు. కోట్ల రూపాయల మేర బెట్టింగులు కొనసాగిస్తున్నారని సమాచారం. ప్రధానంగా ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి(పులివెందుల), మాజీ సిఎం, టిడిపి అధినేత చంద్రబాబు(కుప్పం), జనసేన అధినేత పవన్ కల్యాణ్ (పిఠాపురం)తో పాటు పలువురు ప్రముఖులు పోటీ చేసే స్థానాలపై బెట్టింగులు జోరుగా సాగుతున్నాయి. మంగళగిరిలో గెలిచేదెవరు..? కడప ఎంపి సీటును దక్కించుకునేదెవరు..? భీమిలిలో పరిస్థితి ఏంటి..? ఇలా కొన్ని స్పెసిఫిక్ స్థానాలపై ఓ రేంజ్‌లో బెట్టింగులు కొనసాగుతున్నాయి. వైనాట్ కుప్పం అంటోంది వైసీపీ. కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామని వైసిపి ప్రతిజ్ఞ చేసింది. దీంతో కుప్పంలో చంద్రబాబు గెలుపుపై జోరుగా బెట్టింగులు సాగుతున్నాయి.
అంతటా ఎవరు గెలుస్తారనే బెట్టింగ్ జరుగుతుంటే, పులివెందులలో మాత్రం ఎపి సిఎం జగన్‌కు వచ్చే మెజారిటీపై జోరుగా బెట్టింగులు నడుస్తున్నట్లు సమాచారం. ఇక, కొన్ని ఏరియాల్లో ఎవరికి ఎన్ని ఓట్లు పోల్ అవుతాయి. మొత్తం ఓట్లలో ఎంత పర్సంటేజ్ పోలింగ్ నమోదవుతుంది అనే విషయాలపైనా పందాలు జరుగుతున్నట్లు సమాచారం. ఎన్నికలకు, ఓట్ల లెక్కింపునకు మధ్య దాదాపు 20 రోజుల గ్యాప్ ఉంది. దీంతో బెట్టింగ్ రాయుళ్లు మధ్యవర్తులను ఆశ్రయిస్తున్నారు. వంద రూపాయల బాండ్ పేపర్లపై సంతకాలు చేసి, గెలిచినవారికి నగదు ఇచ్చేలా అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు. మీడియేటర్‌కు వందకు 2.5 శాతం కమీషన్ ఇచ్చేలా కండిషన్ ఉంటోంది. కొన్నిచోట్ల ఆన్‌లైన్‌లో మనీ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి. మరి కొన్ని చోట్ల క్యాష్ టు క్యాష్ కలిపేసుకుంటున్నారు.. సర్వే ఆధారంగా కూడా రేషియోలు మారుతు న్నాయి. ప్రస్తుత పరిణామాలు, అవకాశాలను బట్టి నిమిష నిమిషానికి బెట్టింగ్ సరళి మారిపోతుంది. మొత్తంగా ఎపిలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వేళ కోట్ల రూపాయలు చేతులు మారుతాయి అనే చర్చకు ఈ పరిణామాలు ఉతమిస్తున్నాయని చెబుతున్నారు.