Thursday, January 23, 2025

కర్నాటకలో లక్షల్లో బెట్టింగ్‌లు!

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: మరి కొద్ది గంటల్లో కర్నాటక ఎన్నికల ఫలితాలు వెలువడనుండగా ఎవరు విజయం సాధిస్తారనే దానిపై రాష్ట్రవ్యాప్తంగా జోరుగా బెట్టింగ్‌లు కొనసాగుతున్నాయి.ఆయా పార్టీల వీరాభిమానులు తమ అభ్యర్థే గెలుస్తారంటూ లక్షల్లో పందేలు కాస్తున్నారు. కొన్ని చోట్ల అయితే నగదుతో పాటు భూములు లాంటివి కూడా పందెం ఒడ్డుతున్నారు. అంతేకాదు దీనికి సంబంధించి హామీ పత్రాలు కూడా రాసుకుని సంతకాలు పెడుతున్నారు. అలాంటి ఓ సంఘటన మైసూరు జిలాల్లో వెలుగులోకి వచ్చింది. హెచ్‌డి కోటె నియోజకవర్గంలో ఇద్దరు వ్యక్తులు కాంగ్రెస్, జెడి(ఎస్) అభ్యర్థులపై రూ.5 లక్షల చొప్పున పందెం కాయడమే కాదు దీనికి సంబంధించి బాండ్ పేపర్ మీద అగ్రిమెంటు కూడా రాసుకున్నారు. జయరాం నాయక్ అనే వ్యక్తి కాంగ్రెస్ అభ్యర్థిపైన పందెం కాయగా, శివరాజ్ అనే మరో వ్యక్తి జెడి(ఎస్) అభ్యర్థి గెలుస్తాడని పందెం కాశాడు.

ఈ ఇద్దరు కూడా రూ.5లక్షల చొప్పున నగదును ఓ షాపు యజమాని ఖాతాలో డిపాజిట్ చేసినట్లు ఓ టీవీ చానల్ వెల్లడించింది. ఒక వేళ ఈ ఇద్దరిలో ఎవరూ కాకుండా బిజెపి అభ్యర్థి గనుక విజయంసాధిస్తే వాళ్ల డబ్బులు తిరిగి ఇచ్చేస్తామని కూడా అగ్రిమెంట్‌లో పేర్కొనడం గమనార్హం. కెఆర్ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందుతాడని తాను రూ.2 లక్షలు పందెం కాయడానికి సిద్ధంగా ఉన్నానంటూ ఓ వ్యక్తి చేతిలో డబ్బుపట్టుకొని తిరుతున్న ఓ వ్యక్తి ఫోటో ఒకటి కూడా వైరల్ అవుతోంది. మరికొన్ని చోట్ల భూములు, ఇండ్లు లాంటి ఆస్తులను కూడా పందెం ఒడ్డినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ బెట్టింగ్‌ల గురించి ఎవరు కూడా బైటికి మాట్లాడుకోకపోయినప్పటికీ గుసగుసలు మాత్రం బలంగా వినిపిస్తున్నాయి. కొన్ని చోట్ల ఒకటికి రెండు, మూడు రెట్లు కూడా పందెం నడుస్తున్నట్లు చెబుతున్నారు.

అలాంటివాటిలో శ్రీరంగపట్నం నియోజకవర్గం ఒకటి. ఇక్కడ జెడి(ఎస్), కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య పోటీ నువ్వా, నేనా అన్నట్లుగా ఉండడంతో జోరుగా బెట్టింగ్‌లు కాస్తున్నట్లు చెబుతున్నారు. ఈ బెటింగ్‌లు కేవలం అభ్యర్థుల గెలుపు ఓటములపైనే కాదు. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందా? ఎవరు ముఖ్యమంత్రి అవుతారు లాంటి వాటిపై కూడా ఈ బెట్టింగ్‌లు సాగుతున్నట్లు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ బెట్టింగ్‌ల వ్యవహారం కొన్ని వందల కోట్లలో ఉంటుందని కూడా అంటున్నారు. అయితే బెట్టింగ్‌లపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఇప్పటికే హెచ్చరికలు చేయడం జరిగిందని, ఏమైనా సమాచారం లభిస్తే అలాంటి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని మండ్య జిల్లా పోలీసు అధికారి ఎస్ యతీశ్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News