మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి: వర్షాకాల సీజన్‌లో శిథిలావస్థకు చేరుకున్న పురాతన ఇళ్లు, భవనాలతో జాగ్రత్తలు వహించాలని మున్సిపల్ కమీషనర్ కట్టంగూరు ప్రసన్నరాణి శుక్రవారం ఓ ప్రకటనలో కోరారు. అలాంటి భవనాలు, ఇళ్లను గుర్తించి ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా తగు జాగ్రత్తలు చేపట్టేందుకు రాష్ట్ర పురపాలక శాఖ ప్రత్యేకంగా ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేసినట్లు వివరించారు. అలాంటి ఇళ్ల వలన ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నట్లు అయితే తక్షణమే ఆయా ఇళ్ల యజమానులు గుర్తించి తగిన మరమత్తులు కానీ, వాటిని పూర్తిగా తొలగించడం కాని చేపట్టాలని ప్రజలకు సూచించారు.
ఆయా ఇళ్లల్లో ఎవరైనా నివసిస్తు ఉంటే వారిని ఖాళీ చేయించాలని సూచించారు. ప్రమాదాలు జరిగే భవనాల వల్ల చుట్టుపక్కల వారికి కూడా నష్టం జరిగే అవకాశాలు ఉంటాయనే విషయం ఆయా ఇళ్ల యజమానులు గుర్తించి వారే పూర్తి బాద్యత తీసుకుంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు అలాంటి శిథిలావస్థకు చేరుకున్న ఇళ్ల సమాచారాన్ని మున్సిపల్ కార్యాలయంలో అందించాలని ప్రజలకు కమీషనర్ విజ్ఞప్తి చేశారు.