లక్షణాలు కనిపిస్తే ఐసోలేషన్: వైద్యారోగ్య శాఖ హెచ్చరిక
పలు దేశాల్లో మంకీ పాక్స్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. మంకీ పాక్స్ లక్షణాలు ఉన్న వారిని ఐసోలేషన్‌లో ఉంచనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇటీవల మంకీ పాక్స్ ప్రబలుతున్న దేశాలకు వెళ్లి వచ్చిన వారిని, పొక్కులు లేచి విపరీతమైన దురదతో బాధపడుతున్న వారి ఆరోగ్యాన్ని గమనించాలని అధికారులను ఆదేశించారు. అనుమానితులు జిల్లా వైద్యాధికారులను సంప్రదించాలని సూచించారు.
మన తెలంగాణ/హైదరాబాద్ : పలు దేశాల్లో మంకీ పాక్స్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. మంకీ పాక్స్ లక్షణాలు ఉన్న వారిని ఐసోలేషన్‌లో ఉంచనున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. ఇటీవల మంకీ పాక్స్ ప్రబలుతున్న దేశాలకు వెళ్లి వచ్చిన వారిని పొక్కులు లేచి విపరీతమైన దురదతో బాధపడుతున్న వారి ఆరోగ్యాన్ని గమనించాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారుల ఆదేశించింది. అనుమానితులు జి ల్లా వైద్యాధికారులను సంప్రదించాలని సూచించింది. అనుమానితుల రక్త నమూనాలను పూణెలోని నేషనల్ వైరాలజీ ల్యాబ్‌కు పంపించనున్నారు. ప్రస్తుతం మన దగ్గర ఈ కేసులు నమోదు కాకపోయినా,ముందు జాగ్రత్తల ద్వారా వైరస్ వ్యాప్తిని నివారించడానికి వైద్యారోగ్య శాఖ సమాయత్తమవుతోంది.
మంకీపాక్స్ అంటే..
స్మాల్ పాక్స్ (మశూచి) తరహా ఇన్‌ఫెక్షన్ ఇది. మశూచితో పోల్చి చూస్తే తక్కువ తీవ్రత ఉంటుంది. ఆఫ్రికాలో వన్యప్రాణుల నుంచి మంకీపాక్స్ ఇన్‌ఫెక్షన్ తొలుత వెలుగులోకి వచ్చింది. 1958లో తొలిసారిగా కోతుల్లో దీనిని గుర్తించారు. అందుకే దీనికి మంకీపాక్స్ అని పేరు పెట్టారు. 1970ల్లో మనుషుల్లో మొదటిసారి మంకీపాక్స్ వైరస్ జాడ కనిపించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 20కి పైగా దేశాలలో మంకీపాక్స్ కేసులు బయటపడినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్లూహెచ్‌ఒ) ఇటీవల వెల్లడించింది. అయితే ఈ వ్యాధిపై కొంత అస్పష్టత ఉన్నప్పటికీ మనుపటి ఇన్‌ఫెక్షన్ల వ్యాప్తితో పోలిస్తే ఇది నియంత్రిచగలిగే వ్యాధేనని పేర్కొంది. ఈ వ్యాధికి సంబంధించి ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్నలెన్నో ఉన్నాయని, అయితే సంబంధిత వైరస్‌లో జన్యుపరమైన మార్పులు జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవని తెలిపింది.
లక్షణాలివే..
మంకీపాక్స్ సోకిన వారిలో మొదట జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, వెన్ను నొప్పి, నిస్సత్తువ, గ్లాండ్స్‌లో వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఐదు రోజులకి మశూచి వ్యాధి మాదిరిగా శరీరమంతా బొబ్బలు వస్తాయి. ఇవి తగ్గడానికి కనీసం నా లుగు వారాలు పడుతుంది. తుంపర్ల ద్వారా, మంకీపాక్స్ బాధితులకు అతి సమీపంగా మెలిగినా ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. రోగుల దుస్తులు ముట్టుకున్నా, వారితో కలిసి బెడ్‌పై పడుకున్నా, శారీరకంగా కలిసినా సోకుతుంది. అయితే ఈ వ్యాధికి ప్రత్యేకంగా చికిత్స అంటూ ఏమీ లేదు. యాంటీవైరల్ డ్రగ్స్ వాడతారు. మందులు వాడితే.. నాలుగైదు వారాల్లో తగ్గిపోతుంది. లేదంటే మరో మూడు వారాలు ఎక్కువ పట్టొచ్చు. అతి కొద్ది మందిలోనే ఇది విషమంగా మారుతోంది.