Wednesday, January 22, 2025

సీజనల్ వ్యాధులపై అప్రమత్తం

- Advertisement -
- Advertisement -

మలేరియా, డెంగ్యూ కేసుల విషయంలో ఆందోళన వద్దు
ఉన్నతస్థాయి సమీక్షలో వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు

మనతెలంగాణ/హైదరాబాద్ : సీజనల్ వ్యాధుల పట్ల పూర్తి అప్రమత్తతో ఉన్నామని రాష్ట్ర వైద్యారోగ్యశాఖమం త్రి టి.హరీశ్ రావు స్పష్టం చేశారు. మలేరియా, డెంగీ కేసుల విషయంలో భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని, అయితే ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. జ్వర లక్షణాలు కనిపిస్తే సమీపంలోని ప్ర భుత్వ ఆసుపత్రి వద్దకు వెళ్లి రక్త పరీక్షలు చేయించుకోవాలన్నారు. వైద్యుల సూచన మేరకు మందులు వాడాలని సూచించారు. డెంగీ, మలేరియా వంటి సీజనల్ వ్యాధుల చికిత్సకు అవసరమైన అన్ని మందులు పల్లె దవాఖానాలు మొదలుకొని అన్ని ఆసుపత్రులలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. గతేడాది జనవరి నుంచి సెప్టెంబరు వరకు 7,988 డెంగీ కేసులు నమోదైతే, ఈ ఏడాది అదే సమయానికి 5,263 కేసులు నమోదైనట్టు మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో సీజనల్ వ్యాధుల పరిస్థితిపై మంగళవారం మంత్రి హరీశ్‌రావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ, సీజనల్ వ్యాధుల పట్ల ప్రభుత్వం పూర్తి అప్రమత్తతో ఉందని తెలిపారు. వర్షాకాలం వస్తే గతంలో మలేరియా, డెంగీ వం టి సీజనల్ వ్యాధులు విపరీతంగా ఉండేవని, సిఎం కెసిఆర్ ముందుచూపుతో అమలు చేసిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, మిషన్ భగీరథ వంటి పథకాల వల్ల రాష్ట్రంలో పరిసరాల పరిశుభ్రత పెరిగి సీజనల్ వ్యాధులు గణనీయం గా తగ్గాయని చెప్పారు. అయితే వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా గడిచిన వారం, పది రోజుల సమయంలో ఫీవర్ కేసులు స్వల్పంగా పెరుగుదల ఉన్నట్లు అరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయని, మనం మరింత అప్రమత్తంగా ఉంటే ఎలాంటి నష్టం జరగకుండా చూసుకోవడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
పిల్లల జ్వరాలపై ప్రత్యేక నిఘా
డెంగీ, మలేరియా కేసుల విషయంలో ఎర్లీ టెస్టింగ్, ఎర్లీ ట్రీటింగ్ ముఖ్యమైందని కాబట్టి, వ్యాధి నిర్ధారించే ఎన్‌ఎస్1 కిట్స్, ఐజీఎం కిట్స్ అందుబాటులో ఉండాలని మంత్రి అధికారులకు తెలిపారు. ప్రస్తుతానికి ఎన్‌ఎస్1 కిట్స్ 1,099, ఐజీఎం కిట్స్ 992 ఉన్నాయని, మలేరియా ఆర్డీటీ కిట్స్ మొత్తంగా 7 లక్షల 6 వేలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. ఎక్కడా కొరత లేకుండా చూడాలని టిఎస్‌ఎంఎస్‌ఐడిసిని మంత్రి ఆదేశించారు. దూర ప్రాంతాల నుండి ఆసుపత్రులకు వచ్చే వారిని స్వల్ప లక్షణాలు ఉన్నా, వారిని చేర్చుకొని చికిత్స అందిచాలని చెప్పారు. తెలంగాణ డయాగ్నొస్టిక్ ద్వారా 24 గంటల్లో పరీక్ష ఫలితాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మెడికల్ కాలేజీల ద్వారా స్పెషాలిటీ వైద్య సేవలు జిల్లా పరిధిలోకి చేరువ అయ్యాయి కాబట్టి, అవసరం ఉంటేనే కేసులు హైదరాబాద్‌కు రిఫరల్ చేయాలని తెలిపారు. అవసరమైతే జ్వరాల కోసం ప్రత్యేక ఒపి కౌంటర్లు ఆసుపత్రుల్లో ఏర్పాటు చేయాలని, పిల్లల జ్వరాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని చెప్పారు. మలేరియా, డెంగీతో ఒక్క పేషెంట్ కూడా మృతి చెందకుండా వైద్యారోగ్య శాఖ జాగ్రత్తలు తీసుకుంటుందని హరీశ్‌రావు తెలిపారు. ప్రజలు కూడా బాధ్యతగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
మభ్యపెట్టే ప్రైవేట్ ఆసుపత్రులపై చర్యలు
కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు డెంగీ చికిత్స పేరుతో ప్రజలను మభ్యపెడుతూ, ప్లేట్‌లెట్స్ ఎక్కించాలంటూ భయపెడుతూ అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు ఆరోగ్య శాఖ దృష్టికి వచ్చిందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఆరోగ్యం క్షీణించాక చివరి నిమిషంలో ప్రభుత్వ ఆసుపత్రులకు రిఫర్ చేసి బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నట్లు తెలిసిందని అన్నారు. వాస్తవాలు గుర్తించి, ఇలాంటి ఆసుపత్రుల పట్ల జిల్లా వైద్యాధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.
వెల్‌నెస్ సెంటర్ల సేవలపై మంత్రి అసంతృప్తి
రాష్ట్రంలో అన్ని వెల్‌నెస్ సెంటర్ల పనితీరు మెరుగు పడాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు. వెల్‌నెస్ సెంటర్ల ద్వారా అందుతున్న సేవల పట్ల మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యోగులు, జర్నలిస్టులకు మంచి వైద్య సేవలు అందించాలనే సదుద్దేశంతో ప్రభుత్వం వెల్‌నెస్ సెంటర్లు ప్రారంభించిందని, వారికి అందించే సేవల్లో లోపం ఉండకుండా చూసుకోవాలని తెలిపారు. పరీక్షల ఫలితాలు 24 గంటల్లో వచ్చేలా చూడాలన్నారు. వైద్యులు తప్పనిసరిగా సమయపాలన పాటించాలని చెప్పారు. అన్ని వెల్‌నెస్ సెంటర్లను సందర్శించి, అందుతున్న వైద్య సేవలను పరిశీలించాలని ఆదేశించారు. జూమ్ ద్వారా జరిగిన ఈ సమీక్షలో హెల్త్ సెక్రటరీ రిజ్వీ, డీహెచ్ శ్రీనివాసరావు, డిఎంఇ రమేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News