Monday, January 20, 2025

పోలవరంతో భద్రాచలానికి ముప్పు: పువ్వాడ

- Advertisement -
- Advertisement -

Crude oil prices have become a burden to tsrtc

 

కొత్తగూడె: భద్రాచలానికి ఇరు వైపులా కరకట్టలను పటిష్టం చేసేందుకు, ముంపు బాధితులను ఆదుకునేందుకు సిఎం కెసిఆర్ ప్రకటించిన చర్యలకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కృతజ్ఞతలు తెలియజేశారు. టిఆర్ఎస్ ఎల్పీ కార్యాయం నుంచి మంత్రి పువ్వాడ మీడియాతో మాట్లాడారు. వెయ్యి కోట్ల రూపాయలతో శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని నిర్ణయించిన సిఎం కెసిఆర్ కు ఉమ్మడి ఖమ్మం జిల్లా తరపున కృతజ్ఞతలు తెలిపారు.  పోలవరం ప్రాజెక్టు నుంచి నీళ్లు వదలడంలో కొంత నిర్లక్ష్యం చేసినందువల్లే భద్రాచలం వద్ద వరద ఉధృతి పెరిగిందని తెలియజేశారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలని మొదటినుంచి తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. కరకట్టలు గతంలో కట్టినా అవి పటిష్టంగా లేవు అని,  సిఎం కెసిఆర్ శాశ్వత పరిష్కారం కోసం నిపుణుల కమిటీ ప్రకటించారన్నారు.

ముంపునకు గురయ్యే కాలనీ వాసులకు శాశ్వత పరిష్కారం దిశగా సిఎం చర్యలు చేపట్టారని, వరదలోనూ కెసిఆర్ పర్యటించి ప్రజలకు భరోసా ఇచ్చారని ప్రశంసించారు. వరదలతో గ్రామాల్లో దెబ్బ తిన్న విద్యుత్ వ్యవస్థను దాదాపుగా పునరుద్ధరించుకోగలిగామని, పారిశుధ్య పరిస్థితిని మెరుగు పరిచేందుకు వివిధ జిల్లాల నుంచి దాదాపు నాలుగు వేల మంది సిబ్బందిని రప్పించామన్నారు. అతి భయంకర వరదల్లోనూ ఒక్క ప్రాణం పోకుండా చర్యలు తీసుకున్నామని, వరదల పరిస్థితిని సిఎం ముందే ఊహించి ఈ నెల 13 నుంచే మమ్మల్ని అక్కడ ఉండాలని ఆదేశించారన్నారు. ప్రతీ గంట కు కెసిఆర్ మాకు నిరంతరంగా ఆదేశాలిచ్చారన్నారు.  తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 25 వేల మందిని పునరావాస శిబిరాలకు తరలించడం ఇదే మొదటి సారి అని, పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసినా మీడియాలో సౌకర్యాలు కల్పించలేదని వార్తలు రావడం దురదృష్టకరమని మండిపడ్డారు.

ప్రజలు అనారోగ్యం పాలు కాకుండా అంటు వ్యాధులు ప్రబలకుండా మంత్రి హరీష్ రావు నిరంతరం వైద్య శాఖ సిబ్బంది కి ఆదేశాలించారని, పోలవరం కోసం మన ఏడు మండలాలు ఆంధ్రాలో కలపాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై గతంలోనే తాము నిరసన తెలిపామన్నారు. కనీసం ఐదు గ్రామలనైనా తిరిగి తెలంగాణలో కలపాలని తాము కోరుతున్నామని విన్నవించారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఇందుకు సంబంధించి బిల్లు ప్రవేశ పెట్టాలని కోరుతున్నామని, గిరిజనులను, గిరిజనేతరులను వరదల నుంచి కంటికి రెప్పలా కాపాడుకున్నామని, ఒకటి రెండు రోజుల్లో కెసిఆర్ ప్రకటించిన వరద సాయం బాధితుల అకౌంట్ల లో జమ అవుతాయని పువ్వాడ స్పష్టం చేశారు.

బియ్యం, పప్పు ఇప్పటికే భాదితులకు అందజేశామని,  వరదల నివారణకు పోలవరం జాతీయ ప్రాజెక్టు ఎత్తు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు ప్రాథమిక డిజైన్ మార్చి మూడు మీటర్ల ఎత్తు పెంచుకున్నారని మండిపడ్డారు. ఎత్తు తగ్గించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. బిజెపి నేతలు కేంద్రం నుంచి సాయం తీసుకరాకుండా వట్టి మాటలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. గుజరాత్ కు వరద సాయం చేసిన కేంద్రం తెలంగాణ కు ఇప్పటి వరకు సాయం ఎందుకు ప్రకటించలేదని పువ్వాడ అడిగారు. హైద్రాబాద్ వరదలు వచ్చినపుడు బిజెపి పట్టించుకోలేదని, ఇప్పుడు కూడా పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను ఓదార్చేందుకు ఒక్క కాంగ్రెస్, బిజెపి నేతలు కనిపించడం లేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్, బిజెపి నేతలు తమ పార్టీ వ్యవహారాల్లో బిజీగా ఉన్నారని, ప్రజలంటే వారికి పట్టింపు లేదన్నారు. పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలం కు ఉన్న ముప్పును నివారించాలని కోరారు. ఎపి నుంచి కూడా ముంపు భాదితులు వచ్చి మా పునరావాస శిబిరాల్లో తలదాచుకున్నారని, ఐదు గ్రామాల్లోని ప్రజలు తమను తెలంగాణ లో కలపాలని కోరుకుంటున్నారన్నారు. ఈ ప్రెస్ మీట్ లో విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య,ఎమ్మెల్యే ఎం. నాగేశ్వర్ రావు,ఎమ్మెల్సీ తాత మధు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News