Monday, December 23, 2024

బాలుడి కిడ్నాప్‌ను చేధించిన భద్రాచలం పోలీసులు

- Advertisement -
- Advertisement -

భద్రాచలం: ఈ నెల 6వ తేదీన అదృశ్యమైన 8 ఏళ్ల మైనర్ బాలుడి కిడ్నాప్‌ను చేధించి నిందితులను అరెస్ట్ చేసి, నగదు, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు భద్రాచలం ఏఎస్పీ రోహిత్‌రాజ్ వెల్లడించారు. శనివారం స్థానిక ఏఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భద్రాచలం, అశోక్‌నగర్‌కాలనీకి చెందిన కందుల అన్నపూర్ణ, ఆమె రెండో కుమార్తె అనూష, కొడుకు సాయిరాంలు ప్రైమరీ పాఠశాలలో చదువుతున్న మైనర్ బాలుడిని కిడ్నాప్ చేసి డబ్బు సంపాదించాలనే పథకం పన్నారు. ఈ క్రమంలో వారు రాజమండ్రికి చెందిన బెండ తులసి అనే మహిళ ద్వారా సంతానం లేని డా. స్నేహలత, ఈసాక్ గుణ్ణం దంపతులకు రూ.4.5 లక్షలకు బాలుడిని అమ్మేందుకు డీల్ కుదుర్చుకున్నారు. పథకంలో భాగంగా కందుల అన్నపూర్ణ, అనూష, సాయిరాంలు గత కొంతకాలంగా బాలుడ్ని మచ్చిక చేసుకొని అతడి ఫోటోలను రాజమండ్రికి చెందిన డా. స్నేహలత, ఈసాక్ గుణ్ణం దంపతులకు ఫోన్ ద్వారా పంపారు.

2022 డిశంబరు 27న బాలుడిని రాజమండ్రి తీసుకెళ్లి ఆ దంపతులకు చూపించి తిరిగి అదే రోజు భద్రాచలం తీసుకొచ్చారు. డీల్ కుదిరాక ఈ నెల జనవరి 6వ తేదీన బాలుడ్ని కిడ్నాప్ చేసి రాజమండ్రి తీసుకెళ్లి డా. స్నేహలత, ఈసాక్ గుణ్ణం దంపతులకు అప్పగించి రూ. 4 లక్షల 50 వేలు నగదు తీసుకున్నారు. అందులో కొంత మొత్తాన్ని(రూ. 50 వేలు) బెండ తులసికి ఇచ్చారు. ఈ నెల 14 వ తేదీన సీసీ ఫుటేజీలు, విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు కందుల అన్నపూర్ణ, అనూష, సాయిరాంలను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా వారు నేరం అంగీకరించడంతో మిగిలిన వారిని అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుండి రూ. 3.10 లక్షల నగదు, 6 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ వెల్లడించారు. చైల్డ్‌లైన్, డిసిపి యూనిట్ అధికారుల సమక్షంలో బాలుడిని తల్లికి అప్పగించినట్లు తెలిపారు. నిందితులు ఆరుగురిని కోర్టు పంపినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో భద్రాచలం సీఐ నాగరాజురెడ్డి,సిబ్బంది ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News