హైదరాబాద్ : భద్రాచలం రెవెన్యూ గ్రామాన్ని మూడు గ్రామ పంచాయతీలుగా విభజించారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానీయా ఉత్తర్వులు జారీ చేశారు. భద్రాచలం, సారపాక, రాజంపేట్ (అసిఫాబాద్) రెవెన్యూ గ్రామాల పరిధిలో కొత్తగా గ్రామ పంచాయతీలను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ప్రకటించింది. భద్రాది కొత్తగూడెం జిల్లా పరిధిలోని భద్రాచలం మండలం, రెవెన్యూ గ్రామ పరిధిలో భద్రాచలం గ్రామ పంచాయతీగా సర్వే నంబరు 1 నుంచి 51 వరకు, 121 నుంచి 126 వరకు, పార్టు 128, పార్టు 132 సర్వేలోని ప్రదేశాలతో 700 ఎకరాల విస్తీర్ణంగా కొత్తగా పంచాయతీని 21 పాలకవర్గం సభ్యులతో ప్రకటించారు.
భద్రాచలం గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 52 నుంచి 90 సర్వేనంబరు గల ప్రదేశంలో 349 ఎకరాల విస్తీర్ణంగా, 17 మంది పాలకవర్గ సభ్యులతో సీతారామ్‌నగర్ గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేశారు. ఇదే రెవెన్యూ పరిధిలో సర్వేనంబరు 91 నుంచి 120 సర్వేనంబరుతో పాటు 133 నుంచి 207 సర్వే నంబర్ పరిధిలోని 997 ఎకరాల విస్తీర్ణంతో,17 మంది పాలకకమిటీ సభ్యులతో శాంతినగర్ గ్రామ పంచాయతీని ఏర్పాటు చేశారు. బుర్గంపాడు మండల పరిధిలోని సారపాక రెవెన్యూ గ్రామాన్ని సారపాక, ఐటిసి గ్రామ పంచాయతీలుగా విభజించారు. కొమ్రంభీమ్ అసిఫాబాద్ జిల్లా పరిధిలోని అసిఫాబాద్ మండలంలోని రాజంపేటను గ్రామ పంచాయతీగా ప్రకటించారు.