న్యూఢిల్లీ: బీహార్‌లోని భాగల్‌పూర్‌లో నిర్మిస్తున్న వంతెన క్షణాల్లో కూలిపోయింది. దాంతో రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రతిపక్ష బిజెపికి మధ్య వాగ్వాదం రాజుకుంది. ఏడు లేన్ల వంతెన ఒక్కసారిగా పేక మేడల్లా కూలిపోయింది. బీహార్ ప్రభుత్వం ఆ వంతెన స్ట్రక్చర్‌లో లొసుగులున్నాయంది. ‘అధ్యయనం చేయడానికి మేము ఐఐటిరూర్కిని సంప్రదించాము. అధ్యయనం చేయాలని కోరాము. ఫైనల్ రిపోర్టు రావలసి ఉంది. అయితే నిపుణులు స్ట్రక్చర్‌ను అధ్యయనం చేసి, లొసుగులు ఉన్నాయని తెలిపారు’ అని బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ విలేకరుల సమావేశంలో తెలిపారు. రూ. 1700 కోట్లతో ఆ వంతెన నిర్మిస్తున్నారని తెలిసింది.
ఆదివారం జరిగిన ఈ దుర్ఘటనపై ప్రభుత్వం దర్యాప్తు ఉత్తర్వులు జారీచేసింది. తప్పు చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామంది. ‘వంతెన వద్ద పనిచేస్తున్న గార్డ్ కనిపించకుండా పోయాడు. రెస్కూ అధికారులు అతడిని ట్రేస్ చేసే పనిలో ఉన్నారు. ఎస్‌డిఆర్‌ఎఫ్, ఎన్‌డిఆర్‌ఎఫ్ బలగాలు కూడా అతడిని వెతికే పనిలో నిమగ్నం అయ్యాయి’అని బీహార్‌లోని పర్‌బత్తా సర్కిల్ ఆఫీసర్ చందన్ కుమార్ తెలిపారు.
ఇదిలావుండగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సమ్రాట్ చౌదరి బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నితీశ్ కుమార్ కాషాయ పార్టీతో తెగతెంపులు తెంచుకున్నారన్న విషయం తెలిసిందే. భాగల్‌పూర్ ఎంపీ, బిజెపి నాయకుడు సయ్యద్ షా నవాజ్ హుస్సైన్ కూడా అవినీతిపై ఆడిపోసుకుంటూ, ఉన్నత స్థాయి దర్యాప్తు జరగాలని ప్రకటన చేశారు.