Sunday, January 19, 2025

మతానికి చోటు లేదన్న భగత్ సింగ్

- Advertisement -
- Advertisement -

చరిత్ర పునరావృతం కాదు. కానీ ఘటనలను పోలిన ఘటనలు జరుగుతూ ఉంటా యి. ఆ విధంగా గత చరిత్రలో జరిగిన కొన్ని సంఘటనలు మరో రూపంలో ఇప్పుడు కూడా జరుగుతున్నాయా అనిపిస్తుంది. 1919లో మొదటి ప్రపంచ యుద్ధం ముగింపు దశలో ఉండగా భారత దేశంలో స్వాతంత్య్రోద్యమం కొత్త ఉత్సాహంతో ఉరకలు వేసింది. దానికి ముఖ్యమైన కారణం ఆ యుద్ధ కాలంలో సామ్రాజ్యవాదం బలహీనపడి నూతన సోషలిస్టు రాజ్యమైన సోవియట్ యూనియన్ అవతరించడం, దాని ప్రభావంతో దేశ దేశాలలో వలస పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్య్రోద్యమాలు పుంజుకున్నాయి. దీనిని అదుపు చేయడానికి బ్రిటిష్ సామ్రాజ్యవాదం త్రిముఖ వ్యూహాన్ని అనుసరిం చింది.

ఒకటి మాంటెగ్ ఛైవ్‌‌సు ఫోర్డ్ సంస్కరణల ద్వారా భారతీయుల స్వాతంత్య్ర అభిలాషను గుర్తించామన్న భావనను కల్పించి సంతప్తిపర్చడం. రెండు నిర్బంధ చర్యలతో ఉద్యమాన్ని అణచివేయడం. మూడు హిందూ- ముస్లిం ఘర్షణలు సష్టించి ప్రజల మధ్య చీలికలు పెట్టడం. భారతీయుల స్వాతంత్య్రోద్యమ అభిలాషను అణచివేయడానికి మార్చి మొదటి వారంలో రౌలట్ చట్టం తీసుకు వచ్చింది. నిరసన తెలిపే హక్కు, ఊరేగింపులు, సభలు జరుపుకునే, సంఘాలు పెట్టుకునే హక్కు ఆఖరికి ప్రభుత్వాన్ని విమర్శించే హక్కును సైతం ఈ చట్టం లాగేసుకుంది. పౌరుల కదలికలపై తీవ్రమైన ఆంక్షలు విధించింది. విమర్శకులకు దేశద్రోహ ముద్ర వేసింది. రాజద్రోహం నేరం కింద జైళ్ళలో కుక్కింది. ఈ చట్టానికి వ్యతిరేకంగా అమృత్‌సర్‌లోని జలియన్ వాలాబాగ్‌లో ప్రజలు ఏప్రిల్ 14న సభ జరుపుకోవడానికి జమ కూడారు. దీన్ని అదునుగా తీసుకుని నాటి పోలీసు అధికారి డయ్యర్ ప్రజలపై విచక్షణారహితంగా కాల్పులు సాగించాడు. ఈ కాల్పుల్లో 1200 మంది అసువులు బాశారు. స్వాతంత్యోద్యమ చరిత్రలో ఇది రక్తాక్షరాలతో లిఖించిన అధ్యాయం. భారత దేశం భగ్గుమంది.

స్వాతంత్య్రోద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. దేశ వ్యాప్తంగా హిందూ, ముస్లింలు భుజం భుజం కలిపి ఖిలాఫత్ ఉద్యమంలో భాగస్వాములయ్యారు. ఖిలాపత్ ఉద్యమం ద్వారా వచ్చిన ఐక్యత స్వాతంత్య్రోద్యమంలో అత్యంత ప్రసిద్ధి గాంచిన సహాయ నిరాకరణోద్యమానికి నాంది పలికింది. 1921 -22లో దేశమంతా స్వాతంత్య్రోద్యమ గాలులు వీచాయి. బ్రిటిష్ వారికి పన్నులు చెల్లించ నిరాకరించడం మొదలుకొని విదేశీ వస్తు బహిష్కరణ వరకు ఇది సాగింది. గాంధీ ఈ ఉద్యమాన్ని శాంతియుత సత్యాగ్రహ రూపంలో సాగించారు. అయితే 1922 ఫిబ్రవరిలో చౌరీచౌరాలో జరిగిన ఘటనను ఆసరా చేసుకుని గాంధీ సహాయ నిరాకరణోద్యమాన్ని ఉపసంహరించారు. యువతరంలో దీనిపై తీవ్ర నిరసన వ్యక్తమైంది. అసంతప్తికి గురైన యువ నాయకత్వం నూతన మార్గం కోసం అన్వేషించారు.

Chandigarh Airport to be renamed after Bhagat Singh: PM Modi

ఈ క్రమంలోనే భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, భటుకేశ్వర దత్ లాంటి జాతీయ విప్లవకారులు పురుడు పోసుకున్నారు. జలియన్‌వాలాబాగ్ ఘటనతో చలించిపోయిన భగత్ సింగ్ తన 12వ ఏటనే ఆ స్థలాన్ని సందర్శించి పోరాట స్ఫూర్తిని పొందాడు. 14వ ఏట స్కూలును బహిష్కరించి బ్రిటిషువారిపై తిరుగుబాటు చేశాడు. 1923లో హిందూస్థాన్ రిపబ్లికన్ ఆర్మీలో సభ్యుడుగా చేరాడు. 1925లో మొదటిసారి అరెస్టు వారంటు వచ్చింది. 1926 నుంచి నౌజవాన్ భారత సభలో చురుకైన పాత్ర పోషించాడు. 1928లో సైమన్ గోబ్యాక్ ఉద్యమంలో లాలా లజపతిరాయ్‌పై లాఠీ ఝళిపించి మరణానికి కారకుడైన శాండర్స్‌ను హత్య చేయడంతో భగత్‌సింగ్ రాజకీయ జీవితం బయట ప్రపంచానికి వెల్లడైంది. తదనంతరం వ్యక్తిగత హత్యలతో స్వాతంత్య్రం సాధించలేమని ప్రజలను కూడగట్టి రాజ్యాధికారాన్ని కూలదోస్తేనే స్వాతంత్య్రం వస్తుందని జీవితానుభవం ద్వారా గ్రహించాడు. ఆ క్రమంలోనే సోషలిస్టు భావాలతో ప్రభావితుడయ్యాడు.

పంజాబ్ కమ్యూనిస్టు నాయకుడు సోహాన్ సింగ్ జోష్‌తో పరిచయమైనాక మరింత పరిపక్వత సాధించాడు. సోషలిజమే జీవితాశయంగా బహిరంగంగా ప్రకటించాడు. అది 1928లో హిందూస్థాన్ సోషలిస్టు రిపబ్లికన్ ఆర్మీగా రూపాంతరం చెందింది. 1931 మార్చి 23న ఉరికంబం ఎక్కబోయే ముందు జైలు గోడల మధ్య లెనిన్ జీవిత చరిత్రను చదువుతూ తానొక గొప్ప విప్లవకారునితో సంభాషిస్తున్నట్లుగా జైలు అధికారులతో భగత్ సింగ్ చెప్పుకున్నాడు. భగత్ సింగ్, సుఖదేవ్, రాజగురు లాంటివారు భారత దేశాన్ని దాస్య శృంఖలాల నుంచి విముక్తి చేయటానికై అమరులైన చారిత్రక దినం నేడు మనం జరుపుకుంటున్నాం. 1928లో బ్రిటిషు ప్రభుత్వం కమ్యూనిస్టులను, కార్మికోద్యమాలను అణచడానికి ప్రజా భద్రతా బిల్లు, పారిశ్రామిక సంబంధాల బిల్లును తీసుకొచ్చింది. ఇవి రెండూ విప్లవ, కార్మికోద్యమాలను నిషేధించేవే. వీటికి వ్యతిరేకంగా ఏప్రిల్ 8న పార్లమెంటులో బాంబులు వేసి సంచలనం సృష్టించాలని, ఈ నిరంకుశ బిల్లులకు వ్యతిరేకంగా చైతన్యం తీసుకురావాలని భగత్ సింగ్ బృందం భావించింది. బటుకేశ్వర్ దత్తుతో కలిసి భగత్‌సింగ్ ఈ బాంబులు వేశారు.

తప్పించుకోకుండా అక్కడే నిలబడి నినాదాలిచ్చారు. జాతీయ విప్లవకారుల భావాలను ప్రభావితం చేయడానికి కమ్యూనిస్టు పార్టీకి చెందిన వాన్ గార్డ్ అనే పత్రికలో జాతీయవాదులకు విజ్ఞప్తి పేరుతో ఒక వ్యాసం ప్రచురించారు. 1929 అక్టోబర్ 19న విద్యార్థి మహాసభకు సందేశం పంపుతూ ఇలా రాశారు. “పిస్టళ్లను, బాంబులను చేపట్టాల్సిందిగా ఈనాడు మనం యువకులను అడగజాలం. పారిశ్రామిక ప్రాంతాల్లోని మురికివాడల్లోనూ, గ్రామసీమల్లోని గుడిసెల్లోనూ నివసించే కోట్లాది ప్రజలను చైతన్యపరచాల్సి ఉంది. ‘’నిజమైన విప్లవ సైనికులు గ్రామాల్లోను, ఫ్యాక్టరీల్లోనూ ఉన్న రైతులు, కార్మికుల్లోనే ఉన్నారు” అంటూ “మార్క్స్, లెనిన్ రచనలను చదవాల్సిందిగా యువతకు సలహా ఇస్తున్నాను” అన్నాడు. వృత్తి విప్లవకారుల అవసరాన్ని ఆయన గుర్తించారు. తనను ఉరి తీయడానికి సంవత్సరం ముందు జైలు మిత్రులతో మాట్లాడుతూ “వాళ్లు నన్ను చంపి వేయవచ్చు. కానీ నా భావాలను వారు అణచివేయలేరు. ఒక శాపం వలే నా భావాలు బ్రిటీషు వారిని వెంటాడుతాయి. దానితో చివరకు వారు ఇక్కడ నుంచి పారిపోవాల్సి వస్తుంది” అని ప్రగాఢమైన విశ్వాసంతో చెప్పాడు.

“బ్రిటీష్ సామ్రాజ్యవాదులకు బతికున్న భగత్ సింగ్ కంటే చనిపోయిన భగత్ సింగ్ మరింత ప్రమాదకారి. నన్ను ఉరి తీసిన తర్వాత నా విప్లవ భావాలు ఈ సుందర భారతాన్ని నలుదిశలా వెదజల్లుతాయి. యువత స్వాతంత్య్రం కోసం, విప్లవం కోసం తపించేట్లు చేస్తాయి. ఇది దృఢ విశ్వాసం” 1947 ఆగస్టు15 భారత దేశ విముక్తితో భగత్ సింగ్ కల అక్షర సత్యమైంది. ఈనాడు స్వాతంత్య్రోద్యమంతో ఏమాత్రం సంబంధం లేని బిజెపి కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. బిజెపిని వెనుక నుంచి నడిపిస్తున్న ఆర్‌ఎస్‌ఎస్ స్వాతంత్య్రోద్యమానికి వెన్నుపోటు పొడిచింది. నాడు బ్రిటిష్ వారి చేతిలో పావుగా ఉన్న హిందూ, ముస్లిం ఘర్షణలను తీవ్రం చేసింది. ఒకవైపు ముస్లింలీగ్ నాయకుడు జిన్నా, మరోవైపు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడు శ్యావ్‌ు ప్రసాద్ ముఖర్జీ ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించి దేశ విభజనకు కారకులయ్యారు. నాడు వారు రగిల్చిన చిచ్చు ఇప్పటికీ రావణాసుర కాష్టంలా మనల్ని వెంటాడుతూనే ఉంది. 70 యేండ్ల తర్వాత మరలా నాటి బ్రిటీష్ వ్యతిరేక పోరాటం తరహాలో మరో స్వాతంత్య్రోద్యమానికి నాంది పలకాల్సిన సమయమిది.

బ్రిటీష్ నిర్బంధకాండ నుంచి భగత్ సింగ్ ఆవిర్భవించినట్లుగానే నేడు బిజెపి మతోన్మాద వ్యతిరేక పోరాటంలో నుంచి చరిత్రను తిరగరాసే కొత్త తరం ఆవిర్భవిస్తుంది. అయితే ఈతరం ఎటువైపు నిలబడాలో నిర్ణయించుకోవాలి. భగత్ సింగ్‌లా పోరాడి దేశ సమైక్యతను కాపాడాలా? సంఘ్ పరివార్ దేశ విచ్ఛిన్నకులుగా మారాలా? భగత్ సింగ్ సాక్షిగా మార్పుకు స్వాగతం పలికే తరానికి ఇది చరిత్ర విసురుతున్న సవాల్. భగత్‌సింగ్ రాజకీయ జీవితం సుమారు ఏడు సంవత్సరాలే. కేవలం ఏడు సంవత్సరాల రాజకీయ జీవిత కాలంలో విప్లవ దార్శనికతనీ, సామ్రాజ్యవాద వ్యతిరేక జాతీయ చైతన్యాన్నీ, విస్పష్టమైన సోషలిస్టు లక్ష్యాన్ని చాటడంతో పాటు వాటిని సాధించటానికి అవసరమైన అంకుఠిత దీక్షా తత్వాన్నీ, త్యాగ నిరతిని ప్రదర్శించిన భగత్ సింగ్‌ను ఈ దేశ పాలకులు నేటికీ సాధ్యమయినంత వరకు విస్మరించే పనిలోనే ఉన్నారు.

తన ప్రతి రాజకీయ దశలోనూ నిజమైన లౌకికవాదిగా జీవించిన భగత్‌సింగ్‌ను లౌకికవాదిగా స్మరించని భారతీయ జనతా పార్టీ పాలకులు సావర్కర్‌ని ఒక వీరునిగా ప్రదర్శిస్తున్నారు. తన జీవిత కాలంలో మూడు సార్లు బ్రిటీషు పాలకులకు, రెండు సార్లు కాంగ్రెస్ వారికి లొంగుబాట్లు యిచ్చి జైలు నుండి బయట పడాలని చూసిన సావర్కర్, త్యాగజీవి భగత్ సింగ్‌కు సాటిగా ఎలా నిలవగలుగుతాడు?

రాజకీయాలలో మతానికి స్థానం లేదన్న భగత్‌సింగ్‌ది, నేడు మత ద్వేష రాజకీయాలతో అధికారం చెలాయించాలని ప్రయత్నించే హిందుత్వ వాదులది పరస్పర విరుద్ధ చరిత్ర. అందుకే కామ్రేడ్ భగత్‌సింగ్, రాజగురు, సుఖదేవ్‌ను బ్రిటీషు ముష్కరులు ఉరితీసిన మార్చి 23ను లౌకిక ప్రజాస్వామ్య దినంగా ప్రకటించాలి. భగవద్గీతను పాఠ్యాంశంగా చేర్చడానికి బదులు భగత్‌సింగ్ రచనలన్నింటినీ, ప్రధాన భారతీయ భాషల్లోకి అనువాదాలు చేయించి ముద్రించాలి. భగత్‌సింగ్ వీలునామాను విద్యార్థులకు పాఠ్యాంశంగా నిర్ణయించాలి. ఉరికంబంపై నిలబడి దిక్కులు పిక్కటిల్లేలా యిచ్చిన నినాదాలు ఇంకా సజీవంగానే ఉన్నాయంటే వారి ఆశయాలు, లక్ష్యాలు ఇంకా సాధించవలసిన కర్తవ్యాలుగానే మిగిలి ఉన్నాయని గుర్తించాలి. వాటి సాధనకు ముందుకు సాగాలి.

నాదెండ్ల శ్రీనివాస్
9676407140

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News