Wednesday, January 22, 2025

యువతకు భగత్‌సింగ్ ఉద్బోధ

- Advertisement -
- Advertisement -

దయానంద్, మాలవ్య వంటి సంస్కర్తలు ఉద్యమాలు నడిపినప్పటికీ అస్పృశ్యతను దూరం చేయలేకపోవడానికి మనువాద మనస్తత్వం నుంచి వారు బయట పడకపోవడమే ప్రధాన కారణం అని భగత్ అన్నారు. బ్రాహ్మణవాద ఫ్యూడల్, బూర్జువా భూస్వామ్య శక్తుల నిర్మూలనలోనే దళిత సమస్యకు పరిష్కారముందని ఆయన భావించారు. ఈ వ్యవస్థపై తిరుగుబాటు కోసం యువకులతో కూడిన సామాజిక విప్లవ సంస్థను స్థాపించే ప్రయత్నం చేశారు.

సామాజిక ఉద్యమంతో విప్లవాన్ని పుట్టించండి. రాజకీయార్థిక విప్లవం కోసం నడుం బిగించండి. దేశానికి పునాదులు, నిజమైనశక్తి మీరే అని పిలుపునిచ్చారు. ఒక్క అంబేడ్కర్‌ని మినహాయిస్తే భగత్ సింగ్ అర్థం చేసుకున్నట్లుగా కుల సమస్యను ఏ సంస్కర్త కూడా అర్థం చేసుకోలేదు. అంటరాని కులాల ప్రజలను జంధ్యం ధరించడానికి అనుమతిస్తున్నామా? వేదాలను, శాస్త్రాలను అధ్యయనం చేయడానికి అంగీకరిస్తున్నామా? అంటే లేదనే సమాధానమే వస్తుంది.

వారు నన్ను చంపవచ్చు. కానీ నా ఆలోచనలను చంపలేరు. బ్రిటీష్ పాలకులకు ఎదురు నిలిచిన సర్దార్ భగత్ సింగ్ పలుకులివి. భరతమాత విముక్తి కోసం విజయమో, వీర మరణమో అంటూ యువతను ఉత్తేజపరిచి ఉరికొయ్యను ముద్దాడిన మహో న్నత విప్లవకారుడు భగత్‌సింగ్.మన దైనందిన జీవితంలో ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉన్నాడు భగత్ సింగ్.భగత్ సింగ్ పోరాటం స్వాతంత్య్రోద్యమ స్వరూప స్వభావాలను నిర్దేశించడమే కాకుం డా లౌకిక, జాతీయ వాదాలకు నిర్దిష్టమైన నిర్వచనాలను నిర్దేశించింది. సామ్రాజ్యవాదులను దేశం నుంచి వెళ్లగొట్టడం, బూర్జువా, భూస్వామ్య శక్తుల నుంచి దేశ ప్రజలను విముక్తం చేయడం స్వాతంత్య్రోద్యమ లక్ష్యం అని చెప్పారు.

దాని కోసం విప్లవాన్ని కోరుకున్నారు. భగత్ సింగ్ దృష్టిలో విప్లవం అంటే ప్రజల ద్వారా, ప్రజల కోసం రాజకీయ అధికారాన్ని సాధించడమే. ప్రజలను సంఘటితపరిచి, సిద్ధాంతాలకు సానపట్టడం ద్వారానే అది సాధ్యమవుతుందని భగత్ సింగ్‌కి బాగా తెలుసు.బాంబులు, పిస్తోళ్ళ ద్వారా విప్లవాన్ని తీసుకురాలేమనే విషయం కూడా తెలుసు. ఒక రకంగా చెప్పాలంటే విప్లవం, శ్రామిక రాజ్యం, సమానత్వ సిద్ధాంతాల మీద ఆధార పడిన సామ్యవాద వ్యవస్థను స్థాపించే కార్యక్రమాన్ని భారత దేశ ప్రజలకు పరిచయం చేసిన గొప్ప యువ మేధావి భగత్ సింగ్. అలాగే మతం, మతతత్త్వం, కులం స్థితిగతుల గురించి భగత్ సింగ్ విశ్లేషణలు కూడా నేటి సమాజానికి ఎంతో ఉపయోగకరం.

1928 జూన్‌లో కీర్తి మ్యాగజైన్‌లో అస్పృశ్య సమస్య అనే శీర్షికతో ఆయన రాసిన వ్యాసం చాలా ముఖ్యమైనది. దళితుల దయనీయ స్థితికి దారితీసిన చారిత్రిక, సామాజిక అంశాలను లోతుగా పరిశీలించడంతో పాటు దళిత సమస్యకు పరిష్కారాలను కూడా ఈ వ్యాసంలో చూపారు. దీన్ని రాసినప్పుడు ఆయన వయసు దాదాపు 20 ఏళ్లు. స్వాతంత్య్రంతో పాటు దళిత సమస్యను కూడా పరిష్కరించాలనే ఆలోచన ఆ వయసులో రావడం ఆయన సిద్ధాంత పరిపక్వతను ఆవిష్కరిస్తుంది. దళితుల దయనీయ పరిస్థితులకు హిందూ మతమే కారణం అని భగత్ సింగ్ ఆనాడే చెప్పారు. దయానంద్, మాలవ్య వంటి సంస్కర్తలు ఉద్యమాలు నడిపినప్పటికీ అస్పృశ్యతను దూరం చేయలేకపోవడానికి మనువాద మనస్తత్వం నుంచి వారు బయట పడకపోవడమే ప్రధాన కారణం అని భగత్ అన్నారు.

బ్రాహ్మణవాద ఫ్యూడల్, బూర్జువా భూస్వామ్య శక్తుల నిర్మూలనలోనే దళిత సమస్యకు పరిష్కారముందని ఆయన భావించారు.ఈ వ్యవస్థపై తిరుగుబాటు కోసం యువకులతో కూడిన సామాజిక విప్లవ సంస్థను స్థాపించే ప్రయత్నం చేశారు. సామాజిక ఉద్యమంతో విప్లవాన్ని పుట్టించండి. రాజకీయార్థిక విప్లవం కోసం నడుం బిగించండి. దేశానికి పునాదులు, నిజమైనశక్తి మీరే అని పిలుపునిచ్చారు. ఒక్క అంబేడ్కర్‌ని మినహాయిస్తే, భగత్ సింగ్ అర్థం చేసుకున్నట్లుగా కుల సమస్యను ఏ సంస్కర్త కూడా అర్థం చేసుకోలేదు. అంటరాని కులాల ప్రజలను జంధ్యం ధరించడానికి అనుమతిస్తున్నామా? వేదాలను, శాస్త్రాలను అధ్యయనం చేయడానికి అంగీకరిస్తున్నామా? అంటే లేదనే సమాధానమే వస్తుంది. మరి అటువంటప్పుడు ఇతర దేశాల వాళ్ళు మనల్ని బానిసలుగా చూస్తున్నారని, అవమానిస్తున్నారని విమర్శించే హక్కు మనకు ఎక్కడున్నది? అని బాబాసాహెబ్ అంబేడ్కరో లేక మహాత్మ జ్యోతిరావు ఫూలేనో అన్న మాటలు కావివి. బ్రిటీష్ వాడి గుండెల్లో బాంబులు పేల్చి, దేశ దాస్యశృంఖలాలను ఛేదించేందుకు ప్రాణాలను తృణ ప్రాయంగా త్యజించిన విప్లవ వీరుడు షహీద్ భగత్ సింగ్ రాసిన మాటలివి.

మన మెరిగిన భగత్ సింగ్‌లోని అంతగా వెలుగు చూడని తాత్విక కోణమిది. అంటరానితనం దుష్ట స్వరూపాన్ని, దానిని అమలు చేస్తున్న హిందూమత వ్యవస్థ డొల్లతనాన్ని అందు లో ఆయన తూర్పారబట్టారు. అప్పటికే సమాజాన్ని, ప్రపంచ పరిణామాలను అధ్యయనం చేయడం మొదలుపెట్టాడు. భగత్‌సింగ్ తాత అర్జున్ సింగ్ హిందూ మత సంస్కర్తల్లో ఒకరైన ఆర్య సమాజ్ స్థాపకుడు దయానంద్ సరస్వతి అనుచరునిగా ఉండేవారు. ఆయన తండ్రి కిషన్‌సింగ్, మామలైన అజిత్ సింగ్, స్వరణ్ సింగ్‌లు గదర్ పార్టీలో సభ్యులుగా పని చేశారు.

భగత్ సింగ్ 1907 సెప్టెంబర్ 27న అవిభక్త పంజాబ్‌లోని నేటి ఫైసలాబాద్ జిల్లాలోని బంగా గ్రామంలో జన్మించారు. పసి వయసులోనే భగత్ సింగ్ మదిలో దేశభక్తి భావాన్ని నాటిన అర్జున్ సింగ్, మనవడిని దేశానికి అంకితం చేస్తానని ప్రకటించారు. ఖల్సా హైస్కూల్లోనే పిల్లలను చదివించడం సిక్కుల ఆనవాయితీ. అయినా అది బ్రిటీష్‌వారి కనుసన్నల్లో నడుస్తుందన్న కారణంగా కిషన్ సింగ్ తన కొడుకు భగత్‌ను లాహోర్‌లోని ఆర్యసమాజ్‌కు చెందిన దయానంద్ ఆంగ్లో- వేదిక్ స్కూల్‌లో చేర్పించాడు. మెట్రిక్యులేషన్ ముగిశాక నేషనల్ కళాశాలలో చేరాడు. విద్యార్థిగా ఉండగానే భగత్ సింగ్‌కు దేశభక్తి, రాజకీయాలతో పాటు, మార్క్సిజం, లెనినిజం సిద్ధాంతాలను, ప్రపంచ ఉద్యమాలను అధ్యయనం చేసే అవకాశం లభించింది.

పద్నాలుగేళ్లకే జాతీయ విప్లవకారులతో సంబంధాలేర్పడ్డ భగత్ సింగ్‌కు, అతని తాతమ్మ కోరిక మేరకు పెళ్ళి నిశ్చయించారు. భగత్ సింగ్ అందుకు నిరాకరించి, నేను విప్లవోద్యమంలో పూర్తి కాలం పని చేయాలనుకుంటున్నాను. నీవు ఒక తల్లి కోరిక మేరకు నా పెళ్ళి చేయాలనుకుంటున్నావు. కానీ కోట్లాది మంది భారతీయుల తల్లి భరత మాత చెర విడిపించడం, ఆ తల్లి కోరిక తీర్చడం నా కర్తవ్యం అంటూ తండ్రికి ఉత్తరం రాసి ఇంటి నుంచి వెళ్ళిపోయాడు.

విప్లవకారులతో కలిసి నౌజవాన్ భారత్ సభను స్థాపించారు. ఆ తర్వాత చంద్రశేఖర్ ఆజాద్ తదితరుల నేతృత్వంలో నడుస్తున్న హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్‌లో చేరారు. 1919 నాటి జలియన్‌వాలాబాగ్ మారణకాండ, 1928 నాటి లాలా లజపతి రాయ్ మరణం భగత్ సింగ్‌ను బాగా ప్రభావితం చేసిన రెండు ఘటనలు. జలియన్‌వాలా బాగ్ నరమేధం జరిగిన మరుసటి రోజే ఆ స్థలానికి వెళ్ళి నెత్తురింకిన మట్టిని తీసుకొని భగత్ సింగ్ పోరాట ప్రతిజ్ఞ చేశారు. సైమన్ కమిషన్ రాకను నిరసిస్తూ జరిగిన ప్రదర్శనపై పోలీసుల లాఠీ చార్జీలో గాయపడిన లాలా లజపతి రాయ్ ఆ తరువాత మరణించారు. ఆ లాఠీ చార్జీకి కారణమైన స్కాట్‌ను కాల్చి చంపాలని వెళ్ళిన భగత్ సింగ్ బందం కాల్పుల్లో మరొక అధికారి సాండర్స్ మరణించాడు. జాతీయోద్యమ పోరాటాల అణచివేతకు బ్రిటీష్ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న పబ్లిక్ సేఫ్టీ బిల్లు, కార్మిక వివాదాల బిల్లులను నిరసిస్తూ 1929 ఏప్రిల్ 8న భగత్ సింగ్, భటుకేశ్వర్ దత్‌లు సెంట్రల్ అసెంబ్లీలో రెండు బాంబులను ఎవరూ లేని నిరపాయకరమైన చోటు చూసి విసిరారు.

కేవలం హెచ్చరికగానే తాము బాంబులను వేశామని ఆ తర్వాత వారు ప్రకటించారు. బాంబులు వేసి వారు పారిపోక, స్వచ్ఛందంగా అరెస్టయ్యారు. కేసు విచారణనే వేదిగా చేసుకుని తమ హిందుస్థాన్ సోషలిస్టు రిపబ్లికన్ అసోసియేషన్ (హెచ్‌ఎస్‌ఆర్‌ఎ) లక్ష్యాలను దేశానికి చాటాలని వారు ముందే నిర్ణయించుకున్నారు, కేసు విచారణ తదుపరి 1929 జూన్ 12న భగత్‌సింగ్. భటుకేశ్వర్ దత్‌లకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ, అండమాన్ జైలుకు పంపాలని కోర్టు తీర్పు చెప్పింది.

అయితే సాండర్స్ హత్య కేసులో భగత్ సింగ్ నిందితుడంటూ పోలీసులు ఆ కేసును తిరగదోడారు. ఈ కేసులో భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖదేవ్‌లకు 1930లో ఉరిశిక్ష విధించారు. కిశోరిలాల్, మహావీర్‌సింగ్, విజయ్‌కుమార్ సిన్హా, శివవర్మ తదితరులకు జీవిత ఖైదు విధించి అండమాన్ జైల్లో బంధించారు. వారి ఉరి శిక్షలకు వ్యతిరేకంగా దేశమంతా నిరసన వెల్లువెత్తింది. అయినా బ్రిటీష్ ప్రభుత్వం విప్లవ వీరుల్ని 1931, మార్చి 23న ఉరితీసింది. యువ విప్లవ కిశోరం ఇంక్విలాబ్ జిందాబాద్! నినాదంగా భారత ప్రజల గుండెల్లో నిత్యమూ ప్రతిధ్వనిస్తూనే ఉన్నాడు.

నాదెండ్ల శ్రీనివాస్
9676407140

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News