Monday, December 23, 2024

భగీరథ జలం ఆరోగ్య ఫలం

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్ : భగీరథ జలం ఆరోగ్య ఫలమని, ముఖ్యమంత్రి కెసిఆర్ విజన్‌తో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందని, దశాబ్దాల నీటి గోసను మిషన్ భగీరథ పథకం తీర్చిందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. ఆదివారం దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గౌరిదేవిపల్లి 77 ఎంఎల్‌డి మిషన్ భగీరథ ప్లాంటు వద్ద ఏర్పాటు చేసిన మంచినీళ్ల పండుగ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసాధ్యం అనుకున్న మంచినీటి సరఫరా పథకాన్ని రెండు లక్షల కిలోమీటర్ల పైప్‌లైన్ ద్వారా మంచినీరు అందించిన ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కుతుందని అన్నారు.

భగీరథుడు సిఎం కెసిఆర్ మానసపుత్రిక మిషన్ భగీరథ పథకం దశాబ్దాల నీటి గోసను తీర్చిందని, ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీటిని అందించాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన పథకం నేడు గౌరిదేవిపల్లిలో సత్ఫలితాలనిస్తూ కొండలు, కోనలు గుట్టలు దాటి వేల కిలోమీటర్లు ప్రయాణించి నట్టింట సాక్షాత్కరిస్తుందని అన్నారు. తాగునీరు ఇంటి ఆవరణలో గలగల పారుతుంటే గిరిజనులు చిరునవ్వులు చిందిస్తూ తమ అవసరాలు తీర్చుకుంటూ ప్రభుత్వ పథకాలతో సంతోషంగా ఉన్నారని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఒక విజన్‌తో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధ్ది పథంలోకి తీసుకెళ్తున్నారని అన్నారు. తెలంగాణలో రానున్న రోజుల్లో డాక్టర్లకు కొదవ లేకుండా ప్రజా ఆరోగ్యం మరింత పకడ్బందీగా కొనసాగుతుందని, అందుకు నిదర్శనం నాగర్‌కర్నూల్ జిల్లాకు మెడికల్ కళాశాల ప్రారంభం కావడమేనని ఆయన అన్నారు. తెలంగాణ దశాబ్ద కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే ఎన్నో పథకాలను రూప కల్పన చేసిందన్నారు.

దశాబ్ది ఉత్సవాలను ప్రజాధనంతో నిర్వహిస్తున్నామని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని, కానీ భారత స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నామని, ప్రభుత్వ ధనంతో ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రజాధనాన్ని వినియోగించుకునేలా వెసులు బాటు రాజ్యాంగం కల్పించిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ తప్పనిసరిగా రుణమాఫీని చేసి తీరుతాడని అన్నారు. డాక్టర్లు, యువత రాజకీయాల్లోకి రావాలని ఆయన సూచించారు. రైతు బీమా, రైతు బంధు పథకాలతో ప్రజల చిరునవ్వులను ఆకాంక్షిస్తున్న ప్రభుత్వం మాదని అన్నారు.

మిషన్ భగీరథ ఈఈ సుధాకర్ సింగ్ మాట్లాడుతూ గౌరిదేవిపల్లి మిషన్ భగీరథ పంప్ హౌస్ నుంచి నాగర్‌కర్నూల్, అచ్చంపేట నియోజకవర్గంలోని 412 గ్రామాలకు తాగునీటి సరఫరాను అందించడం జరుగుతుందని అన్నారు. 8500 కిలో లీటర్ల నీటిని ప్రతి రోజు మిషన్ భగీరథ ద్వారా శుద్ధి చేసి అందజేయడం జరుగుతుందని, మిషన్ భగీరథ ద్వారా శుద్ధి జలాలను అందించేందుకు నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, వికారాబాద్ జిల్లాలకు తాగునీరు అందిస్తున్నామన్నారు.

మంచినీళ్ల పండుగ కార్యక్రమాన్ని రెండు నియోజకవర్గాల గ్రామ సర్పంచులు, నాగర్‌కర్నూల్ మోడికల్ కళాశాల విద్యార్థులు హాజరై శుద్ధి నీటి వివరాలను తెలుసుకున్నారు. మెడికల్ కళాశాల విద్యార్థులు అరుణ, పవన్ కళ్యాణ్‌ల ప్రసంగాలు, పాటలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో అచ్చంపేట మున్సిపల్ చైర్మన్ నరసింహా గౌడ్, మిషన్ భగీరథ ఈఈ సుధాకర్ సింగ్, డిఈ హేమలత, సర్పంచ్ తిరుపతయ్య, పదర జెడ్పిటిసి రాంబాబు, మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ భరత్ రెడ్డి, లుక్యా నాయక్, ఏఈలు, పలు గ్రామాల సర్పంచులు, ప్రజలు, ప్రజా ప్రతినిధులు, పాత్రికేయులు, మెడికల్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News