చండీగఢ్ : చర్చ సమయంలో శాసనసభ లోపల ప్రతిపక్ష సభ్యులను అట్టిపెట్టడానికి పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ స్పీకర్‌కు ఒక తాళం, తాళం చెవి ఇచ్చిన తరువాత సభలో గందరగోళం నెలకొన్నది. తాళం వల్ల ప్రతిపక్ష సభ్యులు ‘పారి పోకుండా’ చూడవచ్చునని మాన్ సూచించారు. తాము పారిపోబోమని ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ సభ్యుడు ప్రతాప్ సింగ్ బజ్వా ముఖ్యమంత్రితో చెప్పిన వెంటనే రభస నెలకొన్నది.
ఉభయ నేతల మధ్య ఆగ్రహావేశాలతో కూడిన వాదనలు చోటు చేసుకున్నాయి. బజ్వాను భగవంత్ మాన్ ఆక్షేపిస్తూ, ‘రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఎవరితో కూర్చుంటారు. నాతోనే. మీరు ఎన్నడైనా వారితో కలసి కూర్చున్నారా? ఒక వైపు మీరు (సీట్ల పంపకంపై) నాతో వాదనలు చేస్తుంటారు. వెళ్లి, కురుక్షేత్ర, ఢిల్లీ, గుజరాత్ (లోక్‌సభ) సీట్లను మాకు ఇవ్వవద్దని వారి (సోనియా, రాహుల్)తో చెప్పండి’ అని అన్నారు. సభలో రభసను నియంత్రించడానికి స్పీకర్ కుల్తార్ సింగ్ సంధ్వాన్ ప్రయత్నిస్తూ, సభలో చర్చ జరిగేలా చూసేందుకు ప్రతీకగానే తాళంఇచ్చారని చెప్పారు. ఆ తరువాత సభను పావుగంట సేపు వాయిదా వేశారు.