ప్రభుత్వ ఏర్పాటుపై లేఖ అందజేత
చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేయనున్న భగవంత్ మాన్ శనివారం రాష్ట్ర గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్‌ను ఇక్కడ కలుసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యాబలం తమకు ఉన్నదని తెలియచేశారు. సమావేశం అనంతరం రాజ్‌భవన్ వెలుపల మాన్ విలేకరులతో మాట్లాడుతూ తమ పార్టీ ఎమ్మెల్యేల మద్దతుతో కూడిన లేఖను గవర్నర్‌కు అందచేశానని, ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడానికి అవకాశం ఇవ్వాలని కోరానని చెప్పారు. అందుకు గవర్నర్ సమ్మతించారని ఆయన తెలిపారు. శుక్రవారం మొహాలిలో జరిగిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) శాసనసభాపక్ష సమావేశంలో నాయకుడిగా 48 ఏళ్ల మాన్ ఎన్నికయ్యారు.
స్వాతంత్య్ర సమరయోధుడు భగత్ సింగ్ స్వగ్రామం నవాన్‌షాహీ జిల్లాలోని ఖట్కర్ కలాన్ గ్రామంలో ఈ నెల 16వ తేదీన మధ్యాహ్నం 12.30 గంటలకు తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు మాన్ వెల్లడించారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రతి పంజాబ్ ప్రజలందరినీ ఆహ్వానిస్తున్నామని, పంజాబ్ ప్రగతి కోసం ఎటువంటి త్యాగానికైనా సిద్ధమని రాష్ట్ర ప్రజలందరూ ఆ రోజు ప్రతిజ్ఞ చేస్తారని ఆయన చెప్పారు. భగత్ సింగ్‌కు నివాళులర్పిస్తామని ఆయన తెలిపారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ఆప్ కన్వీనర్, ఢిల్లా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హాజరవుతారని ఆయన తెలిపారు.