భగత్‌సింగ్ గ్రామంలో పండుగ వాతావరణం హాజరైన కేజ్రీవాల్ తదితర నేతలు
n ఓటేయని వారూ మావారే… అందరివాడిని
n కేజ్రీవాల్ ఇతర నేతలు హాజరు
ఖట్కార్ కలాన్ (పంజాబ్) : కాంగ్రెస్‌ను ఓడించి పంజాబ్‌లో ఆమ్ ఆద్మీపార్టీ అధికారం సాధించుకుంది. ఆప్ నేత భగవంత్ మాన్ బుధవారం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అపూర్వ రీతిలో ఈసారి రాజ్‌భవన్‌లో కాకుండా స్వాతంత్య్ర సమరయోధుడు భగత్ సింగ్ స్వగ్రామం ఖట్కార్ కలాన్‌లో సిఎం బాధ్యతలు తీసుకోవడం కీలక పరిణామం అయింది. రాష్ట్ర గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ ఆయనతో ప్రమాణం చేయించారు. కార్యక్రమానికి ఢిల్లీ సిఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ , ఇతర సీనియర్ నాయకులు హాజరయ్యారు. నేతలు తలలపై పసుపుపచ్చ తలపాగాలు ధరించి అక్కడికి చేరారు. బసంతియుత వాతావరణం అక్కడ నెలకొంది. ఇది హోలీకి ముందు వచ్చిన నిజమైన హోలీ అని మాన్ ఈ నేపథ్యంలో చెప్పారు. పురోగామ పంజాబ్ (బడ్‌తా పంజాబ్) ఆగమనానికి ఇది నాందీ అన్నారు. చరిత్రలో ఇదో సువర్ణాధ్యాయం అని. ఇప్పటి వరకూ ఉన్న ఉడ్తా పంజాబ్ ఇకపై బడ్‌తా పంజాబ్ అవుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.
పంజాబ్‌లో మాదకద్రవ్యాల జోరును తీసుకుని వచ్చిన 2016 నాటి బ్లాక్‌బస్టర్ సినిమా ఉడ్తా పంజాబ్‌ను ఈ క్రమంలో మాన్ ప్రస్తావించారు. గతంలో కమెడియన్ అయిన మాన్ ఈ కోణంలోనే తన చిత్రానుబంధాన్ని పంచుకుని మాట్లాడారు. తాను అందరి సిఎంనని మాన్ తెలిపారు. ఎవరిని తక్కువ చేసి చూసేది లేదని, పార్టీకి ఓటేయని వారికి కూడా తాను సిఎంనే అని వినయంగా ప్రకటించారు. భగత్ సింగ్ గ్రామంఅంతా కూడా ఈ ప్రమాణస్వీకారం దశలో ఆప్ సూచకంగా పసుపుపచ్చదనంతో కళకళలాడింది. ఇక్కడికి వచ్చేవారంతా పసుపు రంగు తలపాగాలు ధరించి రావాలని ముందుగానే మాన్ కోరారు. కొత్తగా ఎన్నికైన తమ పార్టీ నేతలను ఉద్ధేశించి మాన్ అంతకు ముందు మాట్లాడారు. అధికారంలోకి వచ్చామని అతిశయం పనికిరాదని, మనకు ఓటేయని వారిని కూడా మనం గౌరవించాల్సి ఉంటుందని పిలుపు నిచ్చారు. భగత్ సింగ్ ఎప్పుడూ పసుపు రంగు తలపాగా ధరిస్తూ ఉండేవారు. ఇందుకు అనుగుణంగానే మాన్ కూడా తరచూ ఇదే వస్త్రధారణలో ఉండటం జరుగుతోంది. భగత్ సింగ్ మాటలను మాన్ ప్రస్తావించారు.
ప్రేమించడం మన జన్మహక్కు. మనమెందుకు మన ప్రేమను మాతృభూమికి అంకితం చేయకూడదని ప్రశ్నించారు. పంజాబ్‌లోని 112 స్థానాల అసెంబ్లీలో తొలిసారిగా ఆప్ 117 స్థానాలను గెల్చుకుని అధికారంలోకి వచ్చిందిం. కాంగ్రెస్‌ను అధికారంలో నుంచి కూల్చింది. ఎనిమిదేళ్ల క్రితం నాటి పార్టీకి ఇది ఢిల్లీ తరువాత దక్కిన రెండో అధికారపు మజిలీ అయింది. ఇప్పటివరకూ రాజభవనాలలో ముఖ్యమంత్రుల ప్రమాణస్వీకారాలు జరుగుతూ వస్తున్నాయి. ఇవి సామాన్యుడికి అందుబాటులో లేని ఘట్టాలు. ఈ పద్ధతిని తాను మార్చాలనుకుంటున్నానని, తన మదిలో ఎప్పుడూ మెదిలే భగత్ సింగ్ గ్రామంలో ప్రమాణం ఉంటుందని గెలిచిన తరువాత తెలిపిన మాన్ ఈ విధంగానే అక్కడనే వేదిక ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటివరకూ ఎంపిగా ఉన్న మాన్ ఒక్కరోజు క్రితమే ఈ స్థానానికి రాజీనామా చేశారు. 48 సంవత్సరాల మాన్ 1970 తరువాత పంజాబ్‌కు అయిన తొలి యువ సిఎంగా నిలిచారు.
సిఎం మాన్‌కు ప్రధాని అభినందనలు
ఆప్ సిఎంగా భగవంత్ మాన్ ప్రమాణస్వీకారం నేపథ్యంలో బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ ఆయనకు విశేషరీతిలో అభినందనలు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ఇక పంజాబ్ పురోగతి, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం కలిసికట్టుగా పాటుపడుదాం అని పిలుపు నిచ్చారు. ఆయన పంజాబ్ సిఎం అయినందుకు అభినందనలు అన్నారు.