Monday, January 20, 2025

దళిత జనబాంధవుడు

- Advertisement -
- Advertisement -

అంటరానితనంపై ఆయన అలుపెరుగని పోరాటం చేశారు. బాబా సాహెబ్ అంబేడ్కర్‌తో కలసి ఉద్యమాల్లో పాల్గొన్నారు. జాతిపిత మహాత్మునిచే గౌరవింపబడినారు. తాను నమ్మిన సత్యాలను అందరికీ తెలిపి సమాజంలో చైతన్యం తేవడానికి నిస్వార్థసేవ చేశారు. దళిత స్త్రీల స్థాయిని దిగజార్చి దేవాలయాల్లో దేవతలకు అంకితమైన అవివాహిత మహిళలు దేవదాసీలుగా, జోగినులుగా, పార్వతులుగా, జీవితాలను అంకితంచేసే జోగినీ వ్యవస్థ రద్దు, బాల్య వివాహాల వ్యతిరేకత, దళితులలో విద్యావ్యాప్తి, అసమానతలేని సమాజం కోసం అవిశ్రాంత కృషి చేశారు. మేము పంచములం కాదు.. ఈ దేశ మూలవాసులం.. ఆది హిందువులం’అని గర్వంగా చాటారు. అంటరానివారుగా దూరంగా ఉంచబడిన వారిని ‘ఆది హిందువులు’గా భారత దేశంలో తొట్టతొలుత నివసించిన సంతతిగా ఆయన నొక్కి చెప్పారు. నిజాం పాలిత హైదరాబాద్ రాజ్యంలో దళితోద్యమానికి బాటలు వేసిన ఆ మహానేతనే భాగ్యరెడ్డి వర్మ. హరిజన పదం తెలంగాణ ప్రాంతంలో వ్యాప్తిలో లేని కాలం లో ఆది హిందువులుగా, ఆది ఆంధ్రులుగా, ఆది భారతీయులుగా నిమ్నవర్గ ప్రజలు తమను తాము ప్రకటించుకోవాలని కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు,

మాడపాటి హనుమంతరావుల సహకారంతో భాగ్యరెడ్డి వర్మ ప్రచారం చేశారు. భాగ్యరెడ్డి వర్మ సేవలు హైదరాబాద్ సంస్థానానికే పరిమితం కాక, తెలుగు నేలపై పలు ప్రాంతాలకూ విస్తరించారు. లక్నో, అలహాబాద్, కలకత్తా తదితర ప్రాంతాల్లో జరిగిన దళిత చైతన్య మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దళిత వైతాళికుడుగా ప్రసిద్ధి చెందిన భాగ్యరెడ్డి వర్మ (మే 22, 1888 – ఫిబ్రవరి 18, 1939) సంఘ సంస్క ర్త, ఆది ఆంధ్ర సభ స్థాపకులు. హైదరాబాదు సంస్థానంలో 26 దళిత బాలికల పాఠశాలలను స్థాపించి, వారి అభ్యున్నతికి గట్టి పునాదులు వేశారు. జగన్మిత్ర మండలి, మన్యసంఘం, సంఘ సంస్కార నాటక మండలి, అహింసా సమాజంలను స్థాపించి హైదరాబాదు ప్రాంతంలో సంఘ సంస్కరణలకై కృషి చేశారు. మాదరి వెంకయ్య, రంగమాంబ దంపతులకు 1888 సంవత్సరం, మే 22వ తేదీన జన్మించిన భాగయ్యకు, 1888 నవంబరులో వారి కుటుంబ గురువు భాగయ్యకు బదులు భాగ్యరెడ్డి అని నామకరణం చేశారు.

ఆర్యులు హిందూ దేశానికి వలస రాకముందు అస్పృశ్యులుగా సమాజం ముద్రవేయబడిన ఆది హిందువులే పాలకులని గురువు వాదం. ‘రెడ్డి’ అన్నది పాలకుడనే అర్థం గల ‘రేడు’ అనే పదం నుంచి ఉద్భవించిందని, అందుచేతనే మాదిరి వెంకయ్య భాగ్యయ్యకు రెడ్డిని జత చేశానని ఆయన చెప్పారు.ఆ తర్వాత 1913లో మాదిరి భాగ్యరెడ్డి హిందూ సమాజానికి చేసిన అపూర్వ సేవలకు గుర్తింపుగా ఆర్య సమాజ్ ‘వర్మ’ అనే బిరుదు ప్రదానం చేశారు. ఆనాటి నుండి బాగయ్య భాగ్యరెడ్డిగా మారి, మాదిరి భాగ్యరెడ్డి వర్మగా, ఎం.వి. భాగ్యరెడ్డి వర్మగా ప్రసిద్ధికెక్కారు. 1913లో ‘ఆర్య సమాజ్’ ఆయన సమాజానికి చేసిన సేవలకు గుర్తింపుగా ‘వర్మ’ అన్న బిరుదును ప్రదానం చేశారు. దాంతో ఆయన భాగ్యరెడ్డి వర్మగా గుర్తింపు పొందారు. భాగ్యరెడ్డి 1906లో షెడ్యూల్డు కులాల బాల బాలికల విద్య కోసం హైదరాబాదులోని ఈసామియా బజారులో జగన్మిత్ర మండలిని స్థాపించారు.హరిజనులలో విద్యావశ్యకతను గుర్తించి 1910లో జగన్మిత్ర మండలి ఆధ్వర్యంలో మొదటి ప్రాథమిక పాఠశాలను ప్రారంభించారు.

భాగ్యరెడ్డి వర్మ అంటరాని కులాల ఉద్ధరణకై 1911లో మన్య సంఘాన్ని ఏర్పాటు చేసి, జగన్మిత్ర మండలి కార్యకలాపాలు మన్యసంఘం ద్వారా కొనసాగించారు. మన్య సంఘం అంటరాని కులాల ప్రజల్లో చైతన్యం తీసుకు రావటానికి ప్రయత్నించింది. కొంత మంది ఉన్నత కులాల హిందువులు కూడా ఈ భజన మండళ్లను ప్రోత్సహించారు. మన్యసంఘం ఆధ్వర్యంలో ఈ భజన మండళ్లు రీడింగ్ రూములు ఏర్పరచి అందులో ఆంధ్రపత్రిక, దీనబంధు మొదలైన పత్రికలను అందుబాటులో ఉంచాయి. ప్రధానంగా దళిత మహిళను, ఆ తర్వాత వెనకబడిన తరగతులకు చెందిన యువతులను ప్రత్యేకంగా దేవునికి అంకితమిచ్చే కార్యక్రమాలు నైజాం రాజ్యంలోని తెలంగాణ, మరట్వాడా, కన్నడ ప్రాంతా ల్లో పురోహితులనబడే జంగాలు నిర్వహించేవారు. ఈ దురాచారాన్ని రూపుమాపడానికి భాగ్యరెడ్డి వర్మ దూరదృష్టితో కార్యాచరణ చేపట్టారు. ఆయన కృషి వల్ల నిజాం దేవదాసీ వ్యవస్థను నిర్మూలించారు.

భాగ్యరెడ్డి వర్మకు హిందూ మతంపై విశ్వాసం లేక మొదట్లో ఆర్య సమాజం, బ్రహ్మ సమాజం బోధనలను పాటించేవారు. తర్వాత బౌద్ధం పట్ల ఆకర్షితులయ్యారు. గౌతమ బుద్ధుడు ప్రవచించిన సమానత్వం, సౌభ్రాతృత్వం, స్వేచ్ఛ మొదలైన అంశాల పట్ల ఆకర్షితులయ్యారు. 1913 నుండి ప్రతి వైశాఖ పూర్ణిమ రోజున బుద్ధ జయంతిని జరుపుకొనేవారు. తన ఏకైక కుమారునికి గౌతమ్ అని పేరు పెట్టుకున్నారు. 1917 డిసెంబర్ 15 వ తేదీన కలకత్తాలో మహాత్మా గాంధీ పాల్గొన్న ‘అఖిల భారత హిందూ సంస్కరణ మహాసభ’లో భాగ్యరెడ్డి వర్మ కూడా పాల్గొని, అనర్గళంగా, అర్థవంతంగా, ఆలోచనాత్మకంగా చేసిన ప్రసంగం గాంధీజీని సైతం ఆకర్షించింది. భాగ్యరెడ్డి వర్మ దళితులనుద్దేశించి ‘దళితులే ఈ దేశపు మూలవాసులు. అవిద్య, అజ్ఞానం వల్ల మాత్రమే దళితులు వెనకబడి ఉన్నారు’ అని ఆయన బోధించే వారట. దక్కన్‌లో భాగ్యరెడ్డి వర్మ నిర్మించిన ఆదిజన ఉద్యమం దేశవ్యాప్తంగా నడిచిన ఆది జన మూలవాసీ ఉద్యమానికి అనుసంధాన కర్తగా పని చేసింది.

భాగ్యరెడ్డి వర్మ స్థాపించిన భాగ్యనగర్ అనే పత్రికలో సాహిత్యంలో తొలిసారిగా తాను రాసిన నవల వెట్టి మాదిగ సాహిత్యాన్ని తానే తొలిసారి ప్రచురించారు. అస్పృశ్యతా నివారణకు భాగ్యరెడ్డి వర్మ చేసిన కృషికి, గుర్తింపుగా హైదరాబాద్‌లోని ఇసామియా బజార్ ప్రధాన రోడ్‌కు ‘భాగ్యరెడ్డి వర్మ మార్గ్’ అని నగర పాలక సంస్థ దేశ స్వాతంత్య్రాని కంటే ముందే నామకరణం చేయడం విశేషం. భాగ్య రెడ్డి వర్మ 1939 ఫిబ్రవరి 18న క్షయ వ్యాధితో హైదరాబాదులో మరణించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News