Friday, December 20, 2024

రాజస్థాన్ ముఖ్యమంత్రిగా భజన్ లాల్ శర్మ ప్రమాణం

- Advertisement -
- Advertisement -

జైపూర్: రాజస్థాన్ ముఖ్యమంత్రిగా మొదటిసారి ఎమ్మెల్యే భజన్ లాల్ శర్మ శుక్రవారం పదవీ స్వీకార ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపికి చెందిన ఇతర అగ్రనాయకులు పాల్గొన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించి బిజెపి అధికారంలోకి వచ్చింది. బిజెపి రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న శర్మ తన 57వ పుట్టినరోజు నాడే ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టడం విశేషం. ఆయనతోపాటు ఉప ముఖ్యమంత్రులుగా దియా కుమారి, ప్రేమ్ చంద్ బైర్వ ప్రమాణం చేశారు. రాష్ట్ర గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా వీరి చేత ప్రమాణం చేయించారు. చారిత్రాత్మక ఆల్బర్ట్ హాల్ ఎదుట జరిగిన ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కూడా హాజరయ్యారు.

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) మద్దతు ఉన్న భజన్ లాల్ శర్మ బిజెపి శాసనసభా పక్ష నాయకునిగా డిసెంబర్ 12న నియమితులయ్యారు. ప్రధాని మోడీతోపాటు బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, జల శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, పలువురు ఇతర బిజెపి నాయకులు ఈ కార్యకార్యక్రమానికి హాజరయ్యారు. కొత్తగా నియమితులైన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ ధామి, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, గోవా ముఖ్యమంత్రి ప్రమాద్ సావంత్, ఉత్తర్ ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య కూడా హాజరైన వారిలో ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News