Saturday, December 21, 2024

యాదాద్రిలో భక్తజన సందోహం

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి: తెలంగాణ ప్రసిద్ధి క్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం భక్తులతో పోటెత్తింది. వేసవి సెలవులు ముగుస్తుండడంతో కుటుంబ సభ్యులు, పిల్లాపాపలతో కలిసి స్వామివారి దర్శనార్ధం అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. రెండు రోజులు వరుస సెలవులు కావడంతో శనివారం వివిధ ప్రాంతాల నుండి భక్తులు శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనార్ధం పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఉదయం నుండే భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ఆలయ పరిసర ప్రాంతాలు భక్తజన సందోహంగా మారాయి. తెల్లవారుజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాత సేవతో పూజా కైంకర్యాల ప్రారంభించారు.

ఉదయం అష్టోత్తరం, అభిషేకం, నిత్యకల్యాణం, సువర్ణపుష్పార్చనతో పాటు ఆలయంలో జరిగినటువంటి శ్రీసత్యనారాయణ వ్రత పూజలలో సాయంత్రం నిర్వహించినటువంటి వెండి జోడి మొక్కు సేవలలో భక్తులు పాల్గొని మొక్కుబడులు చెల్లించుకొని శ్రీలక్ష్మీనరసింహుని దర్శించుకున్నారు. ఆలయ పరిసర ప్రాంతాలతో పాటు దర్శనం క్యూలైన్లు, ప్రసాద క్యూలైన్లు, నిత్యకల్యాణం, కల్యాణకట్టలో భక్తుల రద్దీ నెలకొంది. స్వామివారి దర్శనానికి తరలివచ్చిన భక్తులకు సుమారు 3 గంటల నుంచి 4 గంటల సమయం పట్టింది. శ్రీలక్ష్మీనరసింహుడిని దర్శించుకున్న భక్తులు కొండపైన కొలువైన శ్రీపర్వతవర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి వారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. యాదాద్రి అనుబంధ క్షేత్రమైన శ్రీపాతలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయాన్ని కూడా భక్తులు సందర్శించి దర్శించుకున్నారు.

ఆలయ నిత్యరాబడి..
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ నిత్యరాబడిలో భాగంగా శనివారం రూ.54,98,645 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆలయ పరిధిలోని ప్రసాద విక్రయం ద్వారా రూ.15,55,650, ప్రధాన బుకింగ్ ద్వారా రూ.5,45,850, వీఐపీ దర్శనం ద్వారా రూ.2,40,000 లక్షలు, బ్రేక్ దర్శనం ద్వారా రూ.3,33,900, కొండపైకి వాహనాల అనుమతి ద్వారా రూ.6,00,000 లక్షలతో పాటు వివిధ శాఖల నుంచి ఆలయానికి నిత్యరాబడి సమకూరినట్టు అధికారులు తెలిపారు.

భక్తులకు తప్పని ఇక్కట్లు..
స్వామివారి దర్శనార్ధం అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో సరైన సౌకర్యాలు లేక భక్తులకు ఇక్కట్లు తప్పలేదు. బస్సులో వచ్చిన భక్తులకు కొండపైకి ఎలా వెళ్లాలో తెలియక ఉచిత బస్సులు సరిపోను లేకపోవడంతో గంటల తరబడి భక్తులు కొండకిందే అయోమయ స్థితిలో ఉండవలసి వస్తుందని భక్తులు వాపోతున్నారు. వాహనదారులు కూడా కొండపైకి రావడం, పోవడం రూ.500 పార్కింగ్‌తో ఇబ్బందులు పడుతున్నారు. పిల్లాపాలను తీసుకొని కొండపైకి వెళ్లిన భక్తులు చాలీచాలని సౌకర్యాలు, మండే ఎండలో నిలువ నీడ లేక ఇబ్బందులు పడ్డారు. సాయంత్రం భారీ వర్షం కురవడంతో కూడా భక్తులు కుటుంబ సభ్యులతో ఇబ్బందులు పడ్డారు. దర్శనం అనంతరం తిరిగి వెళ్లే భక్తులకు సరిపడా బస్సులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు..
శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని శనివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఐఏఎస్ విజయేంద్రజోషి, సీఐడీ ఎస్పీ బి.గంగారామ్ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. విజయేంద్రజోషి, గంగారామ్‌కు అర్చకులు ఆశీర్వచనం అందజేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News