పార్టీలకు మూడు రోజులు గడువు
ఖాట్మండ్ : నేపాల్‌లో గురువారం నాటికి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా అధ్యక్షురాలు బిడ్యాదేవీ భండారీ వివిధ పార్టీలకు పిలుపునిచ్చారు. ప్రధాని కెపి శర్మ ప్రతినిధుల సభ విశ్వాసాన్ని కోల్పోయిన తరువాత ఆయన వివిధ పార్టీలకు ప్రభుత్వం ఏర్పాటుకు మూడు రోజులు గడువు ఇచ్చారు. గురువారం ఉదయం 9 గంటలకు తమ వాదనలు వినిపించాలని పార్టీలకు సూచించారు. నేపాల్ అధ్యక్షుని కార్యాలయం ఈమేరకు ఒక ప్రకటన చేసింది. నేపాల్ రాజ్యాంగం లోని ఆర్టికల్ 76(2) ప్రకారం మెజార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి పార్టీలకు అవకాశం ఇవ్వడానికి అధ్యక్షులు భండారీ నిర్ణయించారని పేర్కొంది. నేపాల్‌లో సోమవారం జరిగిన విశ్వాస పరీక్షలో హాజరైన 232 మంది సభ్యుల్లో ప్రధాని ఓలికి మద్దతుగా 93 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 124ఓట్లు రావడంతో ప్రధాని కెపీ శర్మ ఓలి విశ్వాసాన్ని కోల్పోయారు. ఆ తరువాత నేపాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్, సిపిఎస్ ఛైర్మన్ ప్రచండ, జనతా సమాజ్ వాదీ ఛైర్మన్ ఉపేంద్ర యాదవ్ కలసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు ముందుకొచ్చారు. ప్రభుత్వం ఏర్పాటుకు తమకు అవకాశం ఇవ్వాలని అధ్యక్షురాలిని కోరారు.