Saturday, November 23, 2024

నీట్ రగడ.. జులై 4న భారత్ బంద్

- Advertisement -
- Advertisement -

పేపర్ లీకులపై ప్రధాని స్పందించకపోవడం అప్రజాస్వామికం
నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా జులై 4న భారత్ బంద్
విద్యార్థి, యువజన సంఘాల ఐక్య కార్యాచరణ సమితి పిలుపు
మన తెలంగాణ / హైదరాబాద్: బిజెపి పాలిత రాష్ట్రాల్లో పేపర్ లీకులు జరుగుతున్నా ప్రధాని నరేంద్రమోడీ స్పందించపోవడం అప్రజాస్వామికమని ఎంఎల్‌సి, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ఆరోపించారు. గత పదేళ్ల మోడీ పాలనలో 70 పరీక్ష పేపర్లు లీక్ అయ్యాయని ఆరోపించారు. పేపర్ లీకుల కారణంగా దేశ ప్రతిష్ట మసకబారుతున్నదని అన్నారు. మంగళవారం నాంపల్లిలోని తెలంగాణ జనసమితి (టిజెఎస్) పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఐక్య విద్యార్థి, యువ జన సంఘాల మీడియా సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో బల్మూరి వెంకట్ మాట్లాడుతూ మోడీ పాలనలో పరీక్ష ప్రశ్న పత్రాల లీకేజీలు దేశంలో సాధారణం అయ్యాయని విమర్శించారు. పోటీ పరీక్షల నిర్వహణలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విఫలం అయ్యిందన్నారు. వీటిపై స్పందించాల్సిన ప్రధాని మౌనంగా ఉండడం కేవలం లీకేజీలు జరుగుతున్న రాష్ట్రాలన్ని బిజెపి పాలిత రాష్ట్రాలే కావడమని అన్నారు. పేపర్ లీకేజీలకు బిజెపి నేతలు కారణమనే అనుమానాలు ఉన్నాయన్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తప్పు చేసింది కాబట్టే ఎన్‌టిఎ డైరెక్టర్ జనరల్ సుబోధ్ కుమార్ ను తొలగించారని అన్నారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నీట్ లీకేజీపై నిర్లక్ష్య పూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.

అందుకే జూలై 4న భారత్ బంద్ కి పిలుపునిస్తున్నామన్నారు. యువజన సమితి రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ సలీమ్ పాష మాట్లాడుతూ నీట్ సమస్యపై సిబిఐ దర్యాప్తు సరిగ్గా జరగడం లేదని, సిబిఐ ప్రస్తుతం మోడీ చేతిలో కీలుబొమ్మగా మారిందని అందువల్ల సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జిచే న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 24లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని ప్రధాని మౌనం వీడాలని కోరారు. జూలై 4 న భారత్ బంద్‌కు విద్యాసంస్థలు, వ్యాపారవేత్తలు, ప్రజలు మద్దతు తెలియజేయాలని కోరారు. విద్యార్థి జన సమితి రాష్ట్ర అధ్యక్షులు మాసంపల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ నీట్ బాధిత విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

నీట్ పరీక్షను రద్దు చేసి, తిరిగి పరీక్ష నిర్వహించాలని, ఎన్‌టిఎను రద్దు చేయాలని, రాష్ట్రాలకే నీట్ పరీక్ష నిర్వహించుకునే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఐక్య విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో భవిష్యత్ ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పుట్ట లక్ష్మణ్ -(ఎఐఎస్‌ఎఫ్), రజనీకాంత్ (ఎస్‌ఎఫ్‌ఐ ), ప్రదీప్ (పివైఎల్), కోట రమేష్ (డివైఎఫ్‌ఐ), రామకృష్ణ(పిడిఎస్‌యు), కల్లూరు ధర్మేంద్ర (ఎఐవైఎఫ్), శ్రీకాంత్ (పిడిఎస్‌యు), సాగర్ (పివైఎల్ ), మమత (ఎస్‌ఎఫ్‌ఐ ), ఎర్ర వీరన్న, కొత్త రవి, పేరాల ప్రశాంత్, నకిరేకంటి నరేందర్ (వైజెఎస్) తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News