న్యూఢిల్లీ: కొవాగ్జిన్ టీకా అత్యవసర వినియోగపు అనుమతికి భారత్ బయోటెక్ సంస్థ(బిబిఐఎల్) ప్రపంచ ఆరోగ్య సంస్థకు దరఖాస్తు చేసుకుంది. అనుమతికి అన్ని ప్రయత్నాలు ఆరంభించింది. దీనికి సంబంధించి ఇప్పటికే 90 శాతం సంబంధిత డాక్యుమెంట్లను సంస్థకు సమర్పించినట్లు వెల్లడైంది. ప్రపంచ దేశాలలో కరోనా టీకా వాడకానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిధిలోని ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్(ఇయూఎల్)లో పేరు చేరడం కీలకం. దీనికి సంబంధించి తాము ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఇప్పటికే అవసరం అయిన అన్ని డాక్యుమెంట్లు అందించినట్లు సంస్థ అధికారులు కేంద్ర ప్రభుత్వానికి తెలిపారు. మిగిలినవి ఏమైనా ఉంటే జూన్ నాటికే అందిస్తామని ఈ కంపెనీ వివరించిందని తెలిసింది. ఇక భారత్ బయోటెక్ టీకాకు అనుమతి వచ్చేలా ప్రపంచ దేశాల మద్దతు సమీకరణకు దౌత్యస్థాయి ప్రయత్నాలు జరుగుతాయని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్థన్ సోమవారం తెలిపారు. ప్రపంచంలో ఇకపై వీసాతో పాటు వ్యాక్సిన్ డాక్యుమెంట్ కూడా అత్యవసరం అవుతుంది. వ్యాక్సిన్ ప్రామాణికత ప్రాతిపదికన ఈ వ్యాక్సిన్ వేసుకునే వారికి ప్రయాణ అనుమతిని కల్పించేందుకు వీలేర్పడుతుందని అధికార వర్గాలు తెలిపాయి.
Bharat Biotech application to WHO for Covaxin