న్యూఢిల్లీ : కొవిడ్ నివారణకు భారత్ బయోటెక్ తయారు చేసిన నాసికా టీకా “ ఇన్‌కొవాక్” ను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ వ్యాక్సిన్‌ను రిపబ్లిక్ డే సందర్భంగా గురువారం అధికారికంగా విడుదల చేశారు. ముక్కు ద్వారా వేసే ఈ చుక్కల మందు ఇంకోవాక్ వ్యాక్సిన్‌ను హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ కంపెనీ తయారు చేసింది. కరోనాకు ఇది ప్రపంచం లోనే తొలి నాసికా టీకా. గతవారం కంపెనీ ఛైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ ఎల్లా రిపబ్లిక్ డే సందర్భంగా వ్యాక్సిన్‌ను విడుదల చేస్తామని ప్రకటించారు.
గత ఏడాది డిసెంబర్‌లో బూస్టర్ డోస్‌గా వేసేందుకు డీజీఐసీ అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. టీకాను ప్రభుత్వానికి రూ.325( జిఎస్‌టి అదనం), ప్రైవేట్ వ్యాక్సిన్ కేంద్రాలకు రూ. 800 ( జిఎస్‌టి అదనం)కు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. భారత్ బయోటెక్ ఈ వ్యాక్సిన్‌ను వాషింగ్టన్ యూనివర్శిటీ సెయింట్ లూయిస్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసింది. 18 ఏళ్లు దాటిన వారికి దీన్ని రెండు ప్రాథమిక డోసులుగా , బూస్టర్ డోసు గానూ వినియోగించ వచ్చు. ఈ కార్యక్రమంలో భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్ల, సంస్థ జాయింట్ ఎండీ సుచిత్ర ఎల్ల తదితరులు పాల్గొన్నారు.
ఇన్‌కొవాక్ ఇప్పటికే కొవిన్ పోర్టల్‌లో అందుబాటు లోకి వచ్చింది. ఈ వారం నుంచే ఈ టీకా మార్కెట్లోకి అందుబాటు లోకి వస్తుందని సంస్థ తెలిపింది. ఇన్‌కొవాక్ వల్ల టీకా ఇవ్వడం, రవాణా, నిల్వ, ఎంతో సులువవుతుంది. ఈ టీకాను అధికంగా ఉత్పత్తి చేసే అవకాశమూ ఉంటుంది. తద్వారా మహమ్మారిపై పోరాటానికి మరో పదునైన అస్త్రం లభించినట్టయిందని డాక్టర్ కృష్ణ ఎల్ల గతవారం వెల్లడించిన సంగతి తెలిసిందే.