2/3 ట్రయల్స్ అనుమతికి భారత్ బయోటెక్ దరఖాస్తు
న్యూఢిల్లీ : రెండు నుంచి పద్దెనిమిది ఏండ్లలోపు వారికి కొవాగ్జిన్ బూస్టర్ డోస్ ట్రయల్స్‌కు అనుమతికి భారత్ బయోటెక్ దరఖాస్తు చేసుకుంది. భారత ఔషధ నియంత్రణ సంస్థ ( డిసిజిఐ) ఈ బూస్టర్ డోస్ ఫేజ్ 2/3 స్టీడీకి వీలు కల్పించాలని సంస్థ అభ్యర్థించింది. ఇప్పుడు కొవాగ్జిన్ బూస్టర్‌ను 18 ఏండ్లు పైబడ్డ వారికి వేస్తున్నారు. అయితే అనేక రకాలుగా వేరియంట్లు ఉపజాతులుగా తలెత్తుతూ ఉండటంతో అన్ని వయస్కుల వారు ఇప్పటి ఈ కొవిడ్ ఆంక్షల ఎత్తివేతల దశలో బూస్టర్ డోస్‌లు తీసుకోవల్సిన అవసరం ఏర్పడింది. ఈ దిశలో హైదరాబాద్ కేంద్రంగా ఉన్న భారత్ బయోటెక్ సంస్థ బూస్టర్ డోస్‌పై మూడు ట్రయల్స్‌లో మొదటి ప్రయోగాలు పూర్తి చేసింది. ఇక రెండో ట్రయల్స్‌కు అనుమతిని ఇవ్వాలని గత నెల 29వ తేదీన సంస్థ కోరింది. దీనిపై డిసిజిఐ పూర్తి స్థాయి తుది నిర్ణయం తీసుకోవల్సి ఉంటుంది.
తక్కువ వయస్కులపై ఈ బూస్టర్ డోస్ ప్రభావం దీని సురక్షిత గురించి తాము పరిశీలించుకోవల్సి ఉందని, ఈ క్రమంలో అనుమతిని ఇవ్వాల్సి ఉందని భారత్ బయోటెక్ తెలియచేసుకుంది. రెండేళ్లు నుంచి 18 ఏండ్ల లోపు వారిని ఎంచుకుని స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వారిపై ఈ బూస్టర్ పరీక్షలు నిర్వహించేందుకు రంగం సిద్ధం అయింది. భద్రత, ప్రభావం, రోగనిరోధకత వంటి మూడు అంశాలను తాము నిర్థారించుకోవల్సి ఉందని, ఇందుకు మూడు ట్రయల్స్ అవసరం అని సంస్థ తెలిపింది. ఈ ట్రయల్స్ ఢిల్లీ పాట్నా కేంద్రాలుగా సాగుతాయి. ఇండియాలో ఇప్పుడు బూస్టర్ డోస్‌ల ప్రక్రియ పెద్ద ఎత్తున ఆరంభమయింది. కొవిడ్ వేరియంట్ల నుంచి పూర్తి స్థాయి భద్రత, ఇమ్యూనిటి పెంపుదల దిశలో అటు పుణేకు చెందిన సీరం ఇనిస్టూట్ ఇటు హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ సంస్థలు ముందుకు వెళ్లుతున్నాయి.