గంటకు 10 వేల కేసులు, 60కి పైగా మరణాలు
రోజురోజుకూ విజృంభిస్తున్న కరోనా మహమ్మారి
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ధాటికి యావత్ దేశం మరోసారి విలవిలలాడిపోతోంది. మునుపటికన్నా రెట్టింపు వేగంతో విరుచుకుపడి వణికిస్తోంది. గత ఆరు రోజులుగా దేశంలో రోజూ 2 లక్షలకు పైగా కొత్త కేసులు బయటపడుతుండడం వైరస్ తీవ్రతకు అద్దం పడుతోంది. దేశంలో గత కొన్ని రోజులనుంచి సగటున గంటకు 10 వేలకు పైనే కొత్త కేసులు, 60కి పైగా మరణాలు నమోదవుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఏప్రిల్ 1న దేశవ్యాప్తంగా 72 వేలకు పైగా కొత్త కేసులు, 459 మరణాలు సంభవించాయి. అంటే ఆ రోజు గంటకు 3 వేలకు పైగా కేసులు, 19 మరణాలు సంభవించాయి. అయితే ఆదివారం నాటికి ఆ సంఖ్య మూడు రెట్లు పెరగడం గమనార్హం. గత ఆదివారం దేశంలో సగటున గంటకు 10,895 కొత్త కేసులు బైటపడగా, గంటకు 60 మందికి పైగా మృతి చెందినట్లు వైద్య, ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. కాగా సోమవారం ఉదయం 8 గంటలనుంచి మంగళవారం ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా 2,59,170 కొత్త కేసులు వెలుగు చూశాయి. అంటే సగటున గంటకు 10,798 కొత్త కేసులు వస్తున్నాయి. ఇక మరణాల సంఖ్య కూడా భారీగా పెరగడం కలవరపెడుతున్నాయి. గడచిన 24 గంటల్లో 1,761 మంది వైరస్ కారణంగా మృత్యువాత పడ్డారు. దీంతో దేశంలో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 1,80,530కి చేరుకుంది. దేశంలో గడచిన 41 రోజులుగా కేసులు పెరుగుతూనే వస్తున్నాయి. కొత్త కేసులు రికార్డు స్థాయిలో పెరగడంతో యాక్టివ్ కేసుల సంఖ్య 20,31,977కు చేరుకుంది. దేశంలో మొత్తం కరోనా పాజిటివ్‌ల సంఖ్య కోటీ 53 లక్షలను దాటగా వైరస్‌నుంచి కోలుకున్న వారి సంఖ్య కోటీ 31 లక్షలకు చేరుకుంది.
ఆ పది రాష్ట్రాల్లోనే అధికం
దేశవ్యాప్తంగా వైరస్ ప్రభావం ఉన్నప్పటికీ పది రాష్ట్రాల్లో మాత్రం అత్యధికంగా కేసులు నమోదవుతూ ఉండడం కలవర పెడుతోంది. మహారాష్ట్ర, ఢిల్లీ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్నాటక, కేరళ, తమిళనాడు, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో గడచిన 24 గంటల్లో 58,924 కొత్త కేసులు నమోదు కాగా 351 మంది వైరస్‌తో పోరాడుతూ మృత్యువాత పడ్డారు. దేశ రాజధాని ఢిల్లీలో 23,686మంది కొత్తా వైరస్ బారిన పడగా, 240 మంది ప్రాణాలు కోల్పోయారు. యుపిలో 28,211(167 మరణాలు), కర్నాటకలో 15,785(146), చత్తీస్‌గఢ్‌లో 13,834 (175), కేరళలో 13,644, గుజరాత్ 11,403 (117), మధ్యప్రదేశ్ లో 12,897 (79),రాజస్థాన్‌లో 11,967(53), తమిళనాడు 10,941(44) అత్యధిక కేసులు నమోదయ్యాయి.పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తదితర రాష్ట్రాల్లోను కేసులు, మరణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కాగా ఇప్పటివరకు 26.94 కోట్లకు పైగా శాంపిళ్లను పరీక్షించడం జరిగిందని, సోమవారం 15.19 లక్షలకు పైగా రోగనిర్ధారణ పరీక్షలు జరిపినట్లు కెసిఎంఆర్ తెలిపింది.
259170 New Corona Cases Reported in India