ఇండోర్: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఓ షాపుకు బాంబు బెదిరింపు అందింది. ఒకవేళ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొన్న వారు నవంబర్ 28న స్థానిక స్టేడియంలో రాత్రి బస చేస్తే బాంబు పేలుళ్లకు పాల్పడతామని ఆ లేఖలో హెచ్చరించారు. దాంతో పోలీసులు దర్యాప్తు మొదలెట్టారు. పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు కూడా చేసుకున్నారు. బహుశా అది ఉత్తుత్తి బెదిరింపు కావొచ్చని కూడా అధికారి తెలిపారు.
ఇండోర్ పోలీస్ కమిషనర్ హెచ్‌సి. మిశ్రా దీనిపై మాట్లాడుతూ “ జునీ ప్రాంతంలోని ఓ మిఠాయి దుకాణానికి గురువారం సాయంత్రం ఓ లేఖ అందింది. ఒకవేళ రాహుల్ గాంధీ యాత్రలో పాల్గొన్నవారు ఖాల్సా స్టేడియంలో బస చేస్తే నగరంలో బాంబు పేలుళ్లు చేపడతాం” అని అందులో హెచ్చరించారని పేర్కొన్నారు. ఊరు పేరులేని ఆ లేఖలో రాహుల్ గాంధీ మీద బాంబు దాడి జరుపుతామని ఎక్కడా పేర్కొనలేదని కూడా ఆయన చెప్పారు. దీనిపై సెక్షన్ 507 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామన్నారు. “బహుశా ఇది ఆకతాయి పని అయి ఉంటుంది’ అని మిశ్రా తెలిపారు. అయితే కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి నీలభ్ శుక్లా దీనిపై దర్యాప్తు చేయాలని, భద్రతా ఏర్పాట్లు పెంచాలని డిమాండ్ చేశారు.
ఇదిలావుండగా ప్రస్తుతం రాహుల్ గాంధీ యాత్ర మహారాష్ట్రలో కొనసాగుతోంది. ఇందులో మహాతా్మగాంధీ ముని మనుమడు తుషార్ గాంధీ కూడా రాహుల్ గాంధీతో కలిసి నడిచారు. తుషార్ గాంధీ రచయిత, సంఘకార్యకర్త కూడా. గాంధీ, నెహ్రూ మనుమళ్లయిన వారి యాత్ర అందరి దృష్టిని ఆకట్టుకుంది.