Monday, December 23, 2024

బిజెపిపై యుద్ధం రెండు నిమిషాల్లో ముగిసేది కాదు

- Advertisement -
- Advertisement -

Bharat Jodo Yatra: Rahul Gandhi Slams BJP

బిజెపిపై యుద్ధం రెండు నిమిషాల్లో ముగిసేది కాదు
2024 ఎన్నికలు.. విభజన శక్తులు, సంఘటిత శక్తులకు మధ్య జరిగే పోరాటం
బిజెపి విద్వేషాలు వ్యాప్తి చేస్తోంది.. హింసను ప్రేరేపిస్తోంది
టిఆర్‌ఎస్‌తో కాంగ్రెస్ పొత్తుపెట్టుకునే ప్రసక్తే లేదు
రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ
బిజెపి సిద్ధాంతాన్ని ఓడించగలిగేది కాంగ్రెస్ సిద్ధాంతం మాత్రమే: రాహుల్‌గాంధీ
మన తెలంగాణ/హైదరాబాద్: బిజెపిపై యుద్ధం రెండు నిమిషాల్లో ముగిసేది కాదని, వచ్చే పార్లమెంటు ఎన్నికలు రెండు సిద్ధాంతాల మధ్య జరిగే పోరాటమని కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ పార్లమెంట్ సభ్యులు రాహుల్‌గాంధీ అన్నారు. 2024లో విభజన శక్తులు, సంఘటిత శక్తులకు మధ్య జరిగే పోరాటంగా ఎన్నికలు ఉండబోతున్నాయంటూ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం కార్పొరేట్ పెద్దల కోసమే పనిచేస్తోందని ఆరోపించారు. బిజెపి, టిఆర్‌ఎస్‌లు ప్రజాధనాన్ని దోచుకుంటున్నాయని ఆరోపించారు. ఎన్నికలొచ్చినప్పుడు ఆ రెండు పార్టీలు వందల కోట్లు ఖర్చు చేస్తున్నాయని పేర్కొన్న ఆయన ఆ పార్టీలకు అన్ని వందల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. ప్రధాని మోడీ రాజ్యాంగబద్ధ సంస్థలన్నింటినీ గుప్పెట్లో పెట్టుకున్నారని, వ్యవస్థలన్నింటినీ నాశనం చేశారని విమర్శించారు. దేశవ్యాప్తంగా బిజెపి విద్వేషాలు వ్యాప్తి చేస్తోందని, హింసను ప్రేరేపిస్తోందని ఆరోపించారు. దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిందని, ఉద్యోగ కల్పన లేదని, తాము అధికారంలోకి వచ్చాక అన్నింటినీ ప్రక్షాళన చేస్తామన్నారు.

బిజెపి వ్యాపింపజేస్తున్న ద్వేషం, విద్వేషానికి వ్యతిరేకంగా పోరాడటమే భారత్ జోడో యాత్ర ఆలోచన అని చెప్పారు. భారత్ జోడో యాత్రకు దేశవ్యాప్తంగా భారీ మద్దతు లభిస్తోందన్నారు. తాము దేశవ్యాప్తంగా 3,500 కి.మీ నడిస్తూ ప్రజలను ఆహ్వానిస్తున్నామని, లక్షలాది మంది చేరుతున్నాన్నారు. భారతదేశం యొక్క నిజమైన భావాలు, విలువలను ప్రదర్శించడానికి ఇది ఒక శక్తివంతమైన మార్గం అని అన్నారు. చాలా మంద్రి కాంగ్రెస్ కార్యకర్తలు యాత్రలో పాల్గొంటున్నారని, కాంగ్రెస్ పార్టీకి చెందనివారు కూడా వస్తున్నారని చెప్పారు. ఇతర పార్టీల కార్యకర్తలు కూడా ఈ యాత్రలో చేరడానికి వస్తున్నారని తెలిపారు. వ్యవస్థీకృత దాడుల ద్వారా మన దేశ సంస్థాగత చట్రానికి చాలా నష్టం జరిగిందన్నారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు యాత్ర సాగుతుందని తెలిపారు. అన్ని రాష్ట్రాల నుంచి వెళ్లేలా పాదయాత్ర ప్రణాళిక చేశామని పేర్కొన్నారు. టిఆర్‌ఎస్‌తో పొత్తులు ఉండొద్దు అనేది రాష్ట్ర నాయకత్వ నిర్ణయమని, రాష్ట్ర నాయకత్వ నిర్ణయాన్ని సంపూర్ణంగా స్వాగతిస్తున్నామన్నారు. రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌తో ఎలాంటి అవగాహన కానీ, పొత్తులు కానీ ఉండవని స్పష్టం చేశారు. కాంగ్రెస్, టిఆర్‌ఎస్‌లు కలిసి ముందుకు సాగుతాయనేది కేవలం ఒక అపోహ మాత్రమేనన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని, ఏ పార్టీతోనూ పొత్తులు పెట్టుకోదన్నారు.

దేశంలో బిజెపిని ఓడించేది కాంగ్రెస్ పార్టీనే అని పునరుద్ఘాటించారు. టిఆర్‌ఎస్‌ను భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్)గా మార్చడంపై ఆయన మాట్లాడుతూ రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘కెసిఆర్ జాతీయ పార్టీని ఏర్పాటు చేయాలనుకుంటే, అది మంచిది. అతను గ్లోబల్ పార్టీని స్థాపించాలనుకుంటే, చైనాలో, యూకె ఎన్నికలలో పోటీ చేయాలనుకుంటే, అది కూడా మంచిది. కానీ వాస్తవమేమిటంటే, బిజెపి సిద్ధాంతాన్ని ఓడించగలిగేది కాంగ్రెస్ సిద్ధాంతం మాత్రమే’ అని అన్నారు. అలాగే, దేశంలో వివిధ సంస్థలపై వ్యవస్థీకృత దాడులు జరుగుతు న్నాయని, తమ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే, ఈ సంస్థలను ఆర్‌ఎస్‌ఎస్ పట్టు నుండి విముక్తి చేస్తామని కూడా అన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో దేశవ్యాప్త కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్ర కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మీదుగా తెలంగా ణలోకి ప్రవేశించింది. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలోని తిమ్మాపూరు మీదుగా యాత్ర కొనసాగు తోంది. ఈ క్రమంలోనే అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాహుల్ మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. ‘వివిధ సంస్థలపై వ్యవస్థీకృత దాడి జరిగింది. న్యాయవ్యవస్థ, బ్యూరోక్రసీ, మీడియాపై దాడి జరుగుతోంది. కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చినప్పుడు, ఈ సంస్థలను ఆర్‌ఎస్‌ఎస్ పట్టు నుండి విముక్తం చేసి, ఈ సంస్థల్లో స్వాతంత్య్రం కొనసాగేలా చూస్తాం’ అని అన్నారు. ‘మా పార్టీ ప్రజాస్వామ్య పార్టీ. మేము నియంతృత్వాన్ని నడపలేమని మా డిఎన్‌ఎలో ఉంది. ఇటీవల మా పార్టీ అధ్యక్షుడిని ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకున్నారు. ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి, టిఆర్‌ఎస్ సహా ఇతర రాజకీయ పార్టీలు ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తాయా అని నేను ఆశ్చర్యపోతున్నాన’ని రాహుల్ అన్నారు.
గుజరాత్‌లో మోర్బీ వంతెన కూలిన ఘటనను రాజకీయం చేయదల్చుకోలేదు
గుజరాత్‌లో మోర్బీ వంతెన కూలిన ఘటనపై స్పందించిన రాహుల్‌గాంధీ.. దానిని రాజకీయం చేయదలుచుకోలేదన్నారు. అక్కడ సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. వారి కుటుంబాలకు అండగా ఉంటామని పేర్కొన్నారు. ‘నేను ఈ సంఘటనను (మోర్బీ వంతెన కూలిన ఘటన) రాజకీయం చేయదలచుకోలేదు. అక్కడ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వారు ఇలా చేయడం అగౌరవం. కాబట్టి నేను అలా చేయబోవడంలేద’న్నారు.

Bharat Jodo Yatra: Rahul Gandhi Slams BJP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News