Monday, December 23, 2024

భారీ భద్రత మధ్య జమ్ములో భారత్ జోడో యాత్ర పునః ప్రారంభం

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్ : అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను ఆదివారం తిరిగి ప్రారంభించారు. శనివారం ఈ యాత్రకు ఒక్క రోజు విరామం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆదివారం ఉదయం ఏడు గంటలకు జమ్ము డివిజన్ లోని కతువా జిల్లా లోని హిరనగర్ నుంచి యాత్ర మొదలైంది.

దీనిలో జమ్ముకశ్మీర్ పార్టీ అధ్యక్షుడు వికార్ రసూల్ వని, వర్కింగ్ ప్రెసిడెంట్ రమణ్ భల్లా , వందల కొద్దీ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఉదయం 8 గంటలకు యాత్ర సాంబ జిల్లా లోకి చేరుకొంది. ఆదివారం దాదాపు 25 కిలో మీటర్లు ప్రయాణించిన తరువాత చక్ నానక్ వద్ద యాత్రకు విరామం ఇవ్వనున్నారు. సోమవారం ఉదయం తిరిగి యాత్రను ప్రారంభిస్తారు.

నిన్న అర్థరాత్రి మూడో పేలుడు
ఈ యాత్ర జరుగుతున్న ప్రదేశం పాక్ సరిహద్దులకు అత్యంత సమీపంలో ఉండటంతో పోలీసులు, జమ్ముపఠాన్‌కోట్ హైవేను మూసివేశారు. మరోవైపు శనివారం జమ్ము లోని నర్వాల్ పారిశ్రామిక ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ బాంబు పేలుళ్లలో తొమ్మిది మంది గాయపడినట్టు పోలీసులు వెల్లడించారు. సమీప గ్యారేజీలో ఆపిన ఎస్‌యూవీ , ఆ పక్కనే ట్రాన్స్‌పోర్ట్ నగరలో ఆపిన మరో వాహనం ద్వారా ఈ పేలుళ్లకు మందు పాతరలు వాడినట్టు అనుమానిస్తున్నారు.

అప్రమత్తమైన బలగాలు భద్రతను కట్టుదిట్టం చేశాయి. శనివారం అర్ధరాత్రి దాటాక జమ్ము లోని బజల్తా వద్ద మూడో పేలుగు చోటు చేసుకుంది. ఈ ఘటనలో పోలీస్ ఒకరు గాయపడ్డారు. మరోవైపు జనవరి 30 నాటికి భారత్ జోడో యాత్రను పూర్తి చేయాలన్నది కాంగ్రెస్ వర్గాల ప్రణాళిక. భద్రతాపరమైన కారణాల రీత్యా ఏ మార్గంలో యాత్ర నిర్వహించాలనే నిర్ణయాన్ని కాంగ్రెస్ శ్రేణులు అధికారులకే వదిలేశాయి. ఈ మేరకు రెండు రూట్లను ఎంపిక చేసి అధికారులకు ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News