Monday, December 23, 2024

జోడో యాత్ర కలిసొచ్చేనా?

- Advertisement -
- Advertisement -

Bharat jodo yatra schedule

ఎన్నాళ్ళ నుంచో కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకుంటున్న రాహుల్ గాంధీ జోడో యాత్ర మొదలైంది. రాహుల్ పాదయాత్ర నూట యాభై రోజుల పాటు పన్నెండు రాష్ట్రాలను కవర్ చేస్తూ 3500 కిలోమీటర్ల దూరం సాగుతుంది. అయితే ఈ 3500 కిలోమీటర్లు అనేది గతంలో కొందరు నాయకులు చేసిన పాదయాత్రలతో పోల్చినప్పుడు తక్కువ దూరమే అని చెప్పాలి. ఎప్పుడో నలభై ఏళ్ళ క్రితం మాజీ ప్రధాని చంద్రశేఖర్ సుమారు నాలుగు వేల కిలోమీటర్ల దూరం కాలినడకన భారతదేశయాత్ర చేశారు. ఆ తరువాత ఊహించని విధంగా ఆయనకు ప్రధాన మంత్రి పదవి దక్కింది.

అయితే ఆయన పాదయాత్రకు, ప్రధాని పదవి దక్కడానికి ఎలాంటి సంబంధం లేదనుకోండి. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సుమారు 1460 కిలోమీటర్ల పాదయాత్రను చేశారు. ఆయనకు ముఖ్యమంత్రి పదవి దక్కింది. వైఎస్‌కు ముఖ్యమంత్రి పదవి లభించడానికి ఆయన పాదయాత్ర దోహదపడింది అనే విషయంలో ఎవ్వరికీ అనుమానాలు లేవు. ఆ తరువాత చంద్రబాబు అంతకు రెట్టింపు దూరం పాదయాత్ర చేశారు. ఆయనకు కూడా ముఖ్యమంత్రి పదవి దక్కినప్పటికీ అది రాష్ట్రము విడిపోయాక మాత్రమే సాధ్యమయింది. జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల కూడా పాదయాత్ర చేశారు. కానీ ఆమెకు మాత్రం ఫలితం దక్కలేదు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డిని చెరసాలలో నిర్బంధించిన కారణంగా పార్టీ బలహీనపడకుండా షర్మిల పాదయాత్ర చేశారని చెప్పుకుంటారు. ఆమె కూడా పదవిని ఆశించలేదు.

ఇక ఆంధ్రప్రదేశ్ విడిపోయాక తొలి పాదయాత్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డిది. ఆయన పాదయాత్ర పదహారు నెలల సుదీర్ఘ కాలం కొనసాగింది. దాదాపు రాష్ట్రం మొత్తాన్ని చుట్టేశారు ఆయన. ఎండా వానలకు ఏమాత్రం చలించకుండా జగన్మోహన్ రెడ్డి చేసిన పాదయాత్ర సుమారు 3650 కిలోమీటర్ల దూరం కొనసాగడం ఒక రికార్డు. ఇడుపులపాయలో మొదలైన పాదయాత్ర ఇచ్చాపురం దాకా మహా కోలాహలంగా సాగింది. వందలాది బహిరంగ సభల్లో ఉపన్యసించారు. ఒక యజ్ఞం లాగా సాగిన జగన్ పాదయాత్రతో అనుకున్న యాగఫలాన్ని పొందగలిగారు. ప్రస్తుతం తెలంగాణలో వైఎస్ షర్మిల పాదయాత్ర చేస్తున్నారు. అలాగే రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కూడా పాదయాత్ర చేస్తున్నారు. ఎవరు ఎన్ని యాత్రలు చేసినా ఎన్నికల్లో సత్ఫలితాల కోసమే అని చెప్పుకోడానికి మొహమాటపడాల్సిన పనిలేదు. అందులో తప్పు పట్టాల్సిన పని కూడా లేదు.

ఇక రాహుల్ పాదయాత్ర విషయానికి వస్తే ఒక చిన్న రాష్ట్రంలో జగన్ చేసిన పాదయాత్రతో పోల్చినపుడు చాలా చిన్నయాత్రగానే భావించాలి. పైగా దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు, ఎనిమిది కేంద్ర పాలిత ప్రాంతాలు ఉండగా రాహుల్ యాత్ర కేవలం పన్నెండు రాష్ట్రాల్లో మాత్రమే జరిగితే ఒనగూరే ప్రయోజనం ఏమిటో ఆయన యాత్రకు రూట్ మాప్ తయారు చేసిన వారికే తెలియాలి. గత పదిహేనేళ్లుగా రాహుల్ ఒక విఫల నాయకుడుగా అనేక సందర్భాల్లో రుజువు చేసుకున్నారు. జ్యోతిరాదిత్య సింధియా, జితేంద్ర ప్రసాద, కపిల్ సిబాల్, హార్దిక్ పటేల్, గులాం నబీ ఆజాద్ లాంటి కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాహుల్ వైఖరితో విసుగెత్తి రాజీనామా చేసి వెళ్లిపోయారు. రాహుల్ గాంధీని నాయకుడుగా తయారు చెయ్యాలని ప్రయత్నాలు చేసి విఫలం అయ్యామని గులాం నబీ ఆజాద్ చెప్పడం కాంగ్రెస్ పార్టీని చిన్నబుచ్చేదే.

ఎందుకో తెలియదు కానీ రాహుల్ గాంధీని మొదటి నుంచి అసమర్ధుడుగా ముద్ర వేయడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. బిజెపి అధికారంలోకి వచ్చిన గత ఎనిమిదేళ్లలో బిజెపి సోషల్ మీడియా రాహుల్ గాంధీని ఒక అసమర్దుడిగా, పప్పుగా ప్రజలముందు ప్రాజెక్ట్ చెయ్యడంలో చాలా వరకు విజయాన్ని సాధించాయి. దానికి తగ్గట్లే రాహుల్ గాంధీ ప్రచారం చేసిన ప్రతి చోటా కాంగ్రెస్ పార్టీ ఘోరంగా పరాజయం పాలైంది. ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కేవలం రెండు అసెంబ్లీ సీట్లను మాత్రమే గెలుచుకోగలిగిందంటే ఆ వైఫల్యంలో రాహుల్ గాంధీ కూడా వాటా స్వీకరించక తప్పదు. ఆయన సమర్ధత ఏమిటో గత పదిహేనేళ్లలో ఒక్క అంశంలోనూ రుజువు కాలేదు. చెట్టుకు పండ్లు కాస్తుంటేనే దానిమీద పక్షులు వాలుతాయి. ఎండిపోయిన చెట్టుమీద కాకులు కూడా వాలవు. రాజకీయ పార్టీల విషయం కూడా అంతే. కాస్తో కూస్తో ఫలితాలు సాధిస్తూ పదిమందికి పదవులు పంచగలిగితేనే ఎవరైనా పార్టీలో చేరుతారు. పదేళ్ల పాటు తిరుగులేని అధికారాన్ని చెలాయించి గత ఎనిమిదేళ్లలో చెప్పుకోదగిన ఒక్క విజయాన్ని కూడా నమోదు చెయ్యని కాంగ్రెస్ పార్టీ ఎంత సీనియర్ అయినప్పటికీ ఆదరణ పొందలేదు.

రాహుల్ గాంధీ తీసుకున్న అనేక నిర్ణయాలు ఆయన రాజకీయ అపరిపక్వతను చాటి చెబుతాయి. అధ్యక్ష పదవిని తీసుకోమని ఎందరు బతిమాలుతున్నా నిరాకరించడం, వేరే నాయకులను తీసుకోమని చెప్పడం త్యాగం అనిపించుకోదు. ప్రస్తుత రాజకీయపరిస్థితుల్లో చిన్న పదవి కోసం కూడా వందల మంది పోటీ పడుతున్న నేపథ్యంలో అఖిల భారత స్థాయిలో అధ్యక్ష పదవిని తీసుకోవడానికి ఇచ్చగించకపోవడం అనేది రాజకీయ లెక్కల్లో అసమర్ధత కిందకే వస్తుంది. యుపిఎ రెండో టర్మ్‌లోనే ఆయన కేంద్ర మంత్రి పదవి లేదా ప్రధాని పదవి తీసుకుని ఉన్నట్లయితే ఆయన స్థాయి అంతర్జాతీయంగా కూడా ఎంతో ఉన్నతస్థాయిలో ఉండేది. ఆ హోదాలో ఆయనకు దక్కే ప్రోటోకాల్, భద్రత ఉచ్ఛస్థితిలో ఉండేది. రాజకీయ ప్రవేశం జరిగిన ఇన్నేళ్ల తరువాత కూడా ఆయన ఒక ఎంపిగానే పిలిపించుకుంటున్నారంటే ఆయన తీసుకున్న తప్పుడు నిర్ణయాలే కారణం. పాదయాత్రతో ప్రధాని పదవి దక్కుతుందో లేదో తెలియదు కానీ ఆయన చిత్తశుద్ధితో చేస్తే మాత్రం లోకానుభవం వస్తుంది. వివిధ రాష్ట్రాల్లో బలమైన నేతలను గుర్తించి పార్టీలో వారికి సముచిత స్థానాన్ని కల్పించి అధికారం దక్కిన తరువాత గొప్ప పదవులు ఇస్తామని ఒప్పించగలగాలి. అసంతృప్తితో ఉన్న నాయకులను, కాంగ్రెస్ మీద అభిమానంతో వేరే పార్టీలకు వెళ్లలేని నాయకులు అనేక మంది తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. వారి సేవలను సమర్ధవంతంగా వినియోగించుకోవాలి.

అలాగే వివిధ రాష్ట్రాల్లో బలమైన ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. వీటిలో అనేక పార్టీలు అధికారంలో ఉన్నాయి. వారు అంత తేలికగా కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయడానికి అంగీకరించరు. ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి, కెసిఆర్ లాంటి నాయకులు కాంగ్రెస్‌తో కలవరు. ఈ ఇద్దరు నాయకులు కనీసం ముప్ఫయి ఐదుకు పైగా ఎంపిలను సాధించే స్థితిలో ఉన్నారు. అలాగే స్టాలిన్, మమతా బెనర్జీ, కుమారస్వామి, తేజస్వి యాదవ్, అఖిలేష్ యాదవ్ లాంటి ప్రజాకర్షణ కలిగిన నాయకులు రాహుల్ గాంధీతో కలిసి పని చెయ్యడం సాధ్యమేనా? ఇంతమందిని కాదని కాంగ్రెస్ పార్టీ యాభై సీట్లను కూడా సాధించడం అసాధ్యం. దేశంలో బిజెపి మీద వ్యతిరేకత పొటమరిస్తున్నది.మోడీ ప్రజావ్యతిరేక విధానాలతో జనం విసుగెత్తి ఉన్నారు. ఈ పరిస్థితుల్లో బలమైన ప్రత్యామ్నాయం కోసం దేశం ఎదురు చూస్తున్నది. ప్రజలను ఆకర్షించే నినాదాలు, హామీలు ఇవ్వగలగాలి.

ఏమైనప్పటికీ రాహుల్ గాంధీకి సీనియర్ నాయకుల సలహాలు అవసరం. ఆయన మంచి వక్త కాదు. ఆయన భాషాజ్ఞానం కూడా పెద్ద చెప్పుకోదగినది కాదు. మోడీ మాదిరిగానే ఆయన కూడా ఆంగ్లంలో ప్రసంగించరు. ప్రజలను ఉత్తేజితులను చేసే విధంగా ఆయన ప్రసంగించలేరు. రాహుల్ గాంధీ తిరుమల మెట్లు గంటన్నరలో ఎక్కారు… సముద్రంలో దూకారు.. విమానంలోనించి గెంతారు… రెండు మైళ్ళు పరిగెత్తారు.. ఆయన మహా సమర్థుడు అంటూ సోషల్ మీడియాలో కొన్ని హాస్యాస్పదమైన వ్యాసాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల్లో గెలవడానికి తిరుమల మెట్లు ఎక్కడం సమర్ధతకు సూచిక కాదు. విజయాలు సాధించిపెట్టడం ఒక్కటే నాయకుడి నైపుణ్యానికి గీటురాయి.

ఇలపావులూరి
మురళీ మోహన రావు
8143318849

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News