రాహుల్ గాంధీ ఆశాభావం
కన్యాకుమారి(తమిళనాడు): ప్రతిపక్షాల మధ్య ఐక్యతను తీసుకురావడానికి భారత్ జోడో యాత్ర తోడ్పడుతుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆశాభావం వ్యక్తం చేశారు. కన్యాకుమారి నుంచి గురువారం భారత్ జోడో యాత్ర ప్రారంభం కాగా శుక్రవారం రెండవరోజు యాత్రను కొనసాగించిన రాహుల్ విలేకరులతో మాట్లాడుతూ అది వేరే ప్రక్రియ అయినప్పటికీ ప్రతిపక్షాల మధ్య ఐక్యతను తీసుకురావడానికి ఈ యాత్ర తోడ్పడుతుందని చెప్పారు. ప్రజలను నేరుగా కలవడం, వారు చెప్పింది వినడం, వారి కష్టాలు తెలుసుకోవడం, వారికి తన సందేశాన్ని అందచేయడమే తన యాత్ర లక్షమని రాహుల్ తెలిపారు. భారత్ మారిపోయిందని, దేశ వ్యవస్థాగత స్వరూపం స్వాధీనం కాబడిందని ప్రజలకు చెప్పడమే తన యాత్ర ఆశయమని ఆయన చెప్పారు. ఈ దేశంపై ఒక దార్శనికతను రుద్దడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఆ దార్శనికతకు బహురూపాలని ఆయన వ్యాఖ్యానించారు. సమైక్యంగా ఉండాల్సిన బాధ్యత ప్రతిపక్షాలపై ఉందని ఆయన నొక్కిచెప్పారు. ఇందులో కేవలం కాంగ్రెస్ పార్టీ ఒక్కదానికే ఆ బాధ్యత లేదని, అన్ని పార్టీలకు ఆ బాధ్యత ఉందని ఆయన అన్నారు. దీనిపై చర్చలు జరుగుతున్నాయని ఆయన అన్నారు.