సంఘ్ పరివార్ దానిని విడనాడుతుందా?
కేరళ సిఎం విజయన్
మలప్పురం (కేరళ) : ‘భారత్ మాతా కీ జై’, ‘జై హింద్’ నినాదాలను ముందుగా చేసింది ఇద్దరు ముస్లింలు అని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సోమవారం వెల్లడించారు. వాటిని సంఘ్ పరివార్ విడనాడుతుందా అని విజయన్ ప్రశ్నించారు. ముస్లింల ఆధిపత్యం ఉన్న ఈ ఉత్తర కేరళ జిల్లాలో మైనారిటీ వర్గానికి వెటరన్ సిపిఐ (ఎం) నేత విజయన్ మద్దతు ప్రకటిస్తూ, ముస్లిం పాలకులు, సాంస్కృతిక ప్రముఖులు, అధికారులు దేశ చరిత్ర, స్వాతంత్య్రోద్యమంలో గణనీయమైన పాత్ర పోషించారని తెలియజేశారు.
విజయన్ తన వాదనకు మద్దతుగా చరిత్ర నుంచి ఉదాహరణలు ఉటంకిస్తూ, అజీముల్లా ఖాన్ అనే ముస్లిం ‘భారత్ మాతా కీ జై’ నినాదాన్ని తొలిసారి వాడారని తెలిపారు. ‘ఇక్కడికి వచ్చిన సంఘ్ పరివార్ నేతలు కొందరు తమ ముందు కూర్చున్నవారిని ‘భారత్ మాతా కీ జై’ అని నినదించవలసిందని అడిగారు. ఆ నినాదాన్ని ఎవరు సృష్టించారు ? సదరు వ్యక్తి పేరు అజీముల్లా ఖాన్ అని సంఘ్ పరివార్‌కు తెలుసో లేదో నాకు తెలియదు’ అని సిఎం చెప్పారు. ఆ నినాదం సృష్టికర్త ఒక ముస్లిం అయినందున వారు దానిని వాడడం మానివేస్తారో లేదో తనకు తెలియదని విజయన్ చెప్పారు. వివాదాస్పద పౌరసత్వ (సవరణ) చట్టం (సిఎఎ)కు వ్యతిరేకంగా కేరళలో సిపిఐ (ఎం) వరుసగా నిర్వహించిన నాలుగవ ర్యాలీలో విజయన్ మాట్లాడారు.
అబీద్ హసన్ అనే పాత దౌత్యవేత్త‘జై హింద్’ నినాదాన్ని మొదట చేశారని ఆయన తెలిపారు. మొఘల్ చక్రవర్తి షాజహాన్ కుమారుడు దారా షికోహ్ సంస్కృతంలో నుంచి పర్షియన్‌లోకి 50కి పైగా ఉపనిషత్తులను తర్జుమా చేయడం వల్ల భారతీయ గ్రంథాలు ప్రపంచం అంతటికీ అందాయని విజయన్ తెలియజేశారు. భారత్ నుంచి పాకిస్తాన్‌కు ముస్లింల తరలింపును ప్రవచిస్తున్న సంఘ్ పరివార్ నేతలు, కార్యకర్తలు ఈ చారిత్రక నేపథ్యాన్ని అవగాహన చేసుకోవలసిన అవసరం ఉందని విజయన్ అన్నారు. ముస్లింలు కూడా దేశ స్వాతంత్య్రోద్యమంలో కీలక పాత్ర పోషించారని ఆయన గుర్తు చేశారు.