రైతులు, అణగారిన వర్గాల పట్ల ప్రభుత్వ అంకితభావం
హోమ్ మంత్రి అమిత్ షా ప్రశంస
న్యూఢిల్లీ : మాజీ ప్రధానులు పివి నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్, రెండు సార్లు బీహార్ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్‌లకు భారత రత్న పురస్కారాలు ప్రదానం చేయడం రైతులు, అణగారిన వర్గాలు, వెనుకబడిన తరగతుల పట్ల మోడీ ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా శనివారం పేర్కొన్నారు.
శనివారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో నరసింహారావు, చరణ్ సింగ్, స్వామినాథన్, కర్పూరీ ఠాకూర్‌లకు మరణానంతరం భారత రత్న పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు. దేశానికి చెందిన నలుగురు ప్రముఖులను భారత అత్యున్నత పౌర పురస్కారాలతో సత్కరించడం రైతులు, అణగారిన వర్గాలు, వెనుకబడిన తరగతుల వారి పట్ల నరేంద్ర మోడీ ప్రభుత్వ నిబద్ధతను సూచిస్తున్నదనిఅమిత్ షా హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ‘ఎక్స్’లో చేసిన పోస్టులలో పేర్కొన్నారు.