భారత తొమ్మిదవ ప్రధాని, దేశ రాజకీయాల్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గమనంలో కీలకమైన మలుపులు, మార్పుల వెనుక గల విశేష హస్తం, మేధావి, తెలంగాణ తల్లి ప్రియ పుత్రుడు పివి నరసింహారావుకు మరణానంతర భారత రత్న పురస్కారం లభించడం మొత్తం భారతీయులకు, విశేషించి తెలంగాణ గడ్డకు అత్యంత గర్వకారణం. పివికి భారత రత్న ఇవ్వాలన్న డిమాండ్ చిరకాలంగా వున్నది. ఇందుకోసం తెలంగాణ శాసన సభ ప్రత్యేక తీర్మానాన్ని కూడా ఆమోదించింది. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఐదేళ్ళూ విజయవంతంగా నడిపించిన గాంధీల కుటుంబేతర ప్రధానిగా పివికి విశిష్టమైన పేరు వుంది. సంపన్న భూస్వామ్య కుటుంబంలో పుట్టినా పేదల కోసం పరితపించిన ప్రజాహిత సమున్నత నాయకుడు ఆయన. ప్రధానిగా పివి నరసింహారావు గారి పదవీ కాలం దేశాన్ని ప్రపంచ మార్కెట్లకు తెరిచి సరికొత్త ఆర్థికాభివృద్ధి యుగాన్ని ఆవిష్కరించింది. దేశ సౌభాగ్య సాధనకు, సత్వరాభివృద్ధికి స్థిరమైన, బలమైన పునాదిని వేసింది అని భారత రత్నను ప్రకటిస్తూ ప్రధాని మోడీ ప్రశంసించారు. ఇందులో ఒక్క పొల్లు అక్షరం కూడా లేదు. పివి అనే రెండు అక్షరాలు దేశ చరిత్రను ఊహించని మలుపులు తిప్పాయి.
ఉత్తర తెలంగాణ కరీంనగర్ జిల్లా వంగర గ్రామానికి చెందిన ఈ మితభాషి, నిగర్వి, నిరాడంబరుడు దేశ ప్రజల జీవితాలతో, దేశ రాజకీయాలతో బాగా ముడిపడినవాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా భూసంస్కరణల బిల్లు ప్రవేశపెట్టి కాంగ్రెస్ పార్టీలోనే గల బలమైన వర్గం ఆగ్రహానికి గురై పదవిని కోల్పోయారు. స్వయంగా 500 ఎకరాల భూమిని ప్రభుత్వానికి అప్పగించి జనహితం కోసం విశేష త్యాగం చేసినవారు. లోక్‌సభ ఎన్నికలకు పోటీ చేయొద్దని నిర్ణయించుకొని దాదాపు రాజకీయ సన్యాసం పుచ్చుకోవాలనుకొన్న సమయంలో తనను వరించిన ప్రధాని పదవిని బాధ్యతతో నిర్వహించి దేశ ప్రజల మన్ననలు పొందారు. వెంట్రుక వాసి సంఖ్యాధిక్యతలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పూర్తి ఐదేళ్ళు నడిపించిన ప్రజ్ఞాశీలుడు. ఎంత ఎత్తుకు ఎదిగినా నేలను మరువని పాములపర్తి వెంకట నరసింహారావు స్వరాష్ట్రం పట్ల, సొంత ప్రాంతం ఎడల మక్కువను దాచుకోలేని బలహీనుడు. ప్రజా కవి కాళోజీ నారాయణరావు వంటి వారితో సాన్నిహిత్యాన్ని సంపదగా భావించినవారు. ప్రధానిగా వున్నప్పుడే తెలుగు భాషా సదస్సులు, కవి సమ్మేళనాలు, అవధానాలకు హాజరై భాషా సాహిత్యాల పట్ల తనకున్న గాఢమైన అనురక్తిని చాటుకొన్నారు. పదిహేడు భాషలు తెలిసిన కోవిదుడు.
కవి సామ్రాట్టు విశ్వనాథ సత్యనారాయణ వేయి పడగలు బృహన్నవలను సహస్ర ఫణ్‌గా హిందీలో అనువదించి సత్తా చాటుకొన్నారు. స్వయంగా కవి, రచయిత. 1947 లోనే తన దగ్గరి బంధువు పాములపర్తి సదాశివరావుతో కలిసి వరంగల్ నుంచి కాకతీయ పత్రికను నడిపారు. మేధావి ప్రధానిగా క్లిష్ట సమయాల్లో దేశాన్ని గట్టెక్కించిన ఘనతను పివి మూటగట్టుకొన్నారు. దేశం బొటాబొటీ విదేశీ మారక ద్రవ్య నిల్వలతో కాళ్ళు చేతులు ఆడని స్థితిలో ఉన్నప్పుడు ఆర్ధిక సంస్కరణలకు తెర లేపి అసాధారణ సాహసాన్ని ప్రదర్శించారు. దేశ ఆర్ధిక వ్యవస్థను దేదీప్యమానం చేశామని, అది ప్రపంచ అగ్రశ్రేణి ఆర్ధిక వ్యవస్థగా మారిందని ఇప్పటి పాలకులు చెప్పుకొంటున్నారంటే అందుకు మూలంలో ఉన్న వారు పివి నరసింహారావే. బిజెపి లోక్‌సభలో రెండు స్థానాల బలం నుంచి ఇప్పటి ఎదురులేని స్థితికి ఎదిగిన పరిణామక్రమంలో పివి పరోక్ష తోడ్పాటు లేదని అనలేము. అందుచేత దేశ గమనాన్ని పివి విశేషంగా ప్రభావితం చేశారు. అనేక మలుపుల్లో ఆయన పాత్ర కనిపిస్తుంది. కీలకమైన 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రధాని మోడీ ప్రభుత్వం వరుసగా ఐదుగురు ప్రముఖులకు దేశ అత్యుత్తమ పురస్కారం భారత రత్నను ప్రకటించడం విశేషం.
కాంగ్రెస్ పార్టీ పివిని ప్రధానిగా చేసినప్పటికీ బహుశా ఆ తర్వాత సంభవించిన పరిణామాల వల్ల ఆయనకు గౌరవభంగం కలిగించిందనే ప్రచారం వుంది. తాము ఆయనకు భారత రత్న పురస్కారం ఇవ్వడం ద్వారా తెలంగాణలో రాజకీయంగా ప్రయోజనం పొందవచ్చుననే వ్యూహం బిజెపి వారికి వుండి వుండవచ్చు. అయినప్పటికీ ఈ పురస్కారం ఆయనను వరించడం ద్వారా తనను తాను గౌరవించుకొన్నది. ఈ ఏడాది భారత రత్న వరించిన ఐదుగురిలో లాల్ కృష్ణ అద్వానీని మినహాయిస్తే మిగిలిన నలుగురు రత్నాలకు మరణానంతరం ఈ పురస్కారాన్ని ఇచ్చారు. ఈ ఐదుగురిలో ఇద్దరు దక్షిణాదికి చెందినవారు కావడం హర్షించవలసిన విషయం. మాజీ ప్రధాని చరణ్ సింగ్‌కు, హరిత విప్లవం ద్వారా వ్యవసాయ రంగాన్ని వర్ధిల్ల జేసిన ఎంఎస్ స్వామినాథన్‌కు భారత రత్న ప్రకటించడం మంచి నిర్ణయం. పివికి సముచిత గౌరవాన్ని ఇచ్చినందుకు తెలంగాణ ప్రజల తరపున ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాము.