Monday, December 23, 2024

భారత రత్నం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ భీష్మ పితామహుడు, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీని భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న వరించింది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా శనివారం ప్రకటించారు. బిజెపి దిగ్గజ నాయకుడు అద్వానీకి భారత రత్న ప్రకటిస్తున్న ఈ క్షణం తనకు ఎంతో ఉద్వేగభరితమైనవని ప్ర ధాని వర్ణించారు. మన కాలంలో ఎంతో గౌరవాన్ని పొందిన రాజనీతిజ్ఞులలో అద్వానీ ఒకరని మో డీ అభివర్ణించారు. భారతదేశ అభివద్ధికి ఆయన అందచేసిన సేవలు చిరస్మరణీయమని ఆయన కొనియాడారు. కింది స్థాయి నుంచి మొదలైన అద్వానీ రాజకీయ జీవితం ఉప ప్రధాన మంత్రిగా దేశానికి సేవలందచేసే స్థాయికి ఎదిగిందని ప్రధాని పేర్కొన్నారు. ప్రజా జీవితంలో దశాబ్దాల పాటు ఆయన అందచేసిన సేవలు, పారదర్శకత, నిజాయితీ పట్ల ఆయన చిత్తశుద్ధి రాజకీయ నైతికతలో ఉన్నతమైన ప్రమాణాలను ఆదర్శంగా నిలిపాయని ప్రధాని కొనియాడారు. జాతీయ సమైక్యత, సాంస్కృతిక పునరుజ్జీవనం పట్ల అద్వానీ అసమాన కృషి చేశారని ప్రధాని మోడీ పేర్కొన్నారు. అద్వానీకి భారత రత్నను ప్రకటించడం తనను ఎంతో భావోద్వేగానికి గురిచేస్తోందని, ఆయనతో సుదీర్ఘంగా ఎన్నెన్నో సందర్భాలు పంచుకునే అవకాశం లభించడం, ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవడం తనకు దక్కిన మహద్భాగ్యంగా ప్రధాని అభివర్ణించారు. బిజెపికి సుదీర్ఘకాలం పాటు అధ్యక్షుడిగా పనిచేసి 90వ దశకంలో పార్టీ నిర్మాణంలో కీలకంగా వ్యవహరించి అటల్ బిహారీ వాజపేయితో కలసి పార్టీని మొట్టమొదటిసారి మిత్రపక్షాలతో కలసి అధికారంలోకి తీసుకురావడంలో ప్రధానమైన పాత్రను పోషించారు. అద్వానీతో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని ఆయనకు భారత రత్న లభించినందుకు శుభాకాంక్షలు తెలిపారు. పార్లమెంట్‌లో అద్వానీ చేసిన ప్రసంగాలు ఎంతో ఆదర్శనీయమైనవని, గొప్ప విషయ పరిజ్ఞానమున్నవని ప్రధాని కొనియాడారు. కాగా..ప్రధాని ప్రకటన వెలువడిన కొద్ది సేపటికే అద్వానీకి భారత రత్న అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రకటించినట్లు రాష్ట్రపతి భవన్ నుంచి ప్రకటన వెలువడింది.
అద్వానీ జీవితం దేశానికి అంకితం : ప్రతిభా అద్వానీ
భారత రత్న ప్రకటన వెలువడిన తర్వాత అద్వానీ నివాసానికి పెద్ద సంఖ్యలో మీడియా ప్రతినిధులు చేరుకోగా దూరం నుంచే 96 సంవత్సరాల కురువృద్ధ నాయకుడు చేతులు ఊపి అభివాదం చేశారు. దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని తనకు ప్రకటించడం పట్ల తన తండ్రి ఎంతో సంతోషంగా ఉన్నారని అద్వానీ కుమార్తె ప్రతిభా అద్వానీ మీడియాకు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీకి, దేశ ప్రజలకు అద్వానీ ధన్యవాదాలు తెలిపినట్లు ఆమె చెప్పారు. తన తండ్రి తన యావజ్జీవితాన్ని దేశానికి అంకితం చేశారని ఆమె అన్నారు. కాగా.. గత నెలలోనే కేంద్ర ప్రభుత్వం సోషలిస్టు నాయకుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్‌కు భారత రత్నను ఆయన మరనానంతరం ప్రకటించింది. 1988లో మరణించిన కర్పూరీ ఠాకూర్‌కు ఇన్నేళ్ల తర్వాత భారత రత్నను ప్రకటించడం ఆర్థికంగా వెనుకబడిన తరగతులలో(ఇబిసి) తన బలాన్ని పెంచుకోవడానికి బిజెపి చేసిన ప్రయత్నంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే.. బిజెపి ప్రధాన సిద్ధాంతాన్ని తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించిన అద్వానీకి ఇప్పుడు భారత రత్న ప్రకటించడం మాత్రం పార్టీకి ఆయన అందచేసిన సేవలను గుర్తించడంగానే భావించాలని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. 1990లో తన రామ జన్మభూమి రథయాత్ర ద్వారా బిజెపిని ప్రజలలలోకి చొచ్చుకు వెళ్లేలా చేయడంలో అద్వానీ నిర్వహించిన పాత్ర అసమానమైనదని బిజెపి సీనియర్ నాయకులు తెలిపారు. ఆనాడు అద్వానీ మొదలు పెట్టిన రథయాత్ర ఇప్పడు అయోధ్య రామాలయం ప్రాణ ప్రతిష్టతో సుఖాంతమైందని, గత పదేళ్లుగా బిజెపి అధికారంలోకి కొనసాగడం వెనుక ఆనాటి రథయాత్ర ప్రభావం ఎంతో ఉందని వారు అభిప్రాయపడ్డారు.
బిజెపి సీనియర్ల హర్షం
బిజెపి కురువృద్ధ నాయకుడు ఎల్‌కె అద్వానీకి భారత రత్నను ప్రకటించడం పట్ల ఆ పార్టీ సీనియర్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. దేశానికి అద్వానీ అందచేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. తన యావజ్జీవితాన్ని అద్వానీ దేశానికి, ప్రజలకు అంకితం చేశారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. దేశానికి, సంస్కృతికి, ప్రజలకు సంబంధించిన సమస్యలపై అద్వానీ నిస్వార్థంతో అలుపెరుగని పోరాటం చేశారని ఆయన కొనియాడారు. పార్టీకి, దాని సిద్ధాంతాలకు ఆయన అందచేసిన కృషి మాటలకు అందనిదని అమిత్ షా అన్నారు. అద్వానీకి భారత రత్న ప్రకటించడంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆనందం వ్యక్తం చేశారు. రాజకీయాలలో నిజాయితీకి, అంకితభావానికి, దృఢ చిత్తానికి అద్వానీ ప్రతీకగా ఆయన అభివర్ణించారు. దేశాభివృద్ధి కోసం వివిధ హోదాలలో అద్వానీ అందచేసిన సేవలు చిస్మరణీయం, స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు. అద్వానీ తన శక్తిసామర్ధాలతో దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేశారని, ఆయన భారత రత్న పురస్కారాన్ని ప్రకటించడం దేశంలోని ప్రతి పౌరుడికి ఆనందదాయకమని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.

Bharata Ratna

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News