Monday, December 23, 2024

అత్యాచారానికి గురైన మహిళలకు, చిన్నారులకు రాష్ట్ర ప్రభుత్వం ‘భరోసా’

- Advertisement -
- Advertisement -

రాష్ట్రవ్యాప్తంగా 12 సెంటర్‌లతో చిన్నారులకు, మహిళలకు సత్వరన్యాయం
ఇప్పటివరకు 4 వేల పైచిలుకు చిన్నారులపై, 700ల మంది మహిళలపై అత్యాచారం
కేసులు నమోదు
బాధితులకు పరిహారంతో పాటు నిందితులకు శిక్షపడేలా ‘భరోసా’ సిబ్బంది నిరంతరం కృషి
మరిన్ని ఫాస్ట్‌కోర్టుల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళికలు

 

మనతెలంగాణ/హైదరాబాద్:  అత్యాచారానికి గురైన మహిళలకు, చిన్నారులకు రాష్ట్ర ప్రభుత్వం ‘భరోసా’ కల్పిస్తోంది. ఆ బాధితులకు ఆపన్నహస్తం ఇస్తూ వారికి మనోధైర్యాన్ని కలిగిస్తూ వారి జీవితానికి ప్రభుత్వం ‘భరోసా’ ఇస్తోంది. ఒక్క సెంటర్‌తో మొదలై ప్రస్తుతం 12 సెంటర్‌లకు విస్తరించిన ఈ ‘భరోసా’ సెంటర్‌లతో అత్యాచారానికి గురైన చిన్నారులు, రేప్‌కు గురైన మహిళలకు సత్వరన్యాయం అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు ఈ 12 సెంటర్‌లలో 4 వేల పైచిలుకు చిన్నారులకు, 700ల పైచిలుకు మహిళలపై అత్యాచారం జరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఎఫ్‌ఐఆర్ బుక్ అయినప్పటి నుంచి ఈ కేసులను త్వరితగతిన పరిష్కరించి నిందితులకు శిక్ష పడేలా, బాధితులకు పరిహారం అందేలా ఈ సెంటర్‌లో పనిచేసే ప్రతిఒక్కరూ కృషి చేస్తున్నారు. దీనికోసం ప్రత్యేకంగా ఫాస్ట్‌కోర్టులను మరిన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

11 సెంటర్‌లకు సొంత భవనాలు

2016లో మొదటి సెంటర్‌ను (నాంపల్లిలో) ప్రారంభించిన ప్రభుత్వం గృహహింస, అత్యాచార బాధితులకు న్యాయం అందించాలన్న కృతనిశ్చయంతో ముందుకెళుతోంది. ఇలాంటి అధికంగా కేసులు వస్తుండడంతో వికారాబాద్, వరంగల్, సంగారెడ్డి, సూర్యాపేట, నల్లగొండ, కరీంనగర్, యాదాద్రి భువనగిరి, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, శంషాబాద్‌లలో మరిన్ని సెంటర్‌లను ప్రభుత్వం ప్రారంభించింది. ప్రస్తుతం 11 సెంటర్‌లకు సొంత భవనాలను సిఎస్‌ఆర్ ఫండ్ కింద నిర్మిస్తున్నారు. త్వరలో అవి పూర్తయితే వాటిని ఆ భవనాల్లోకి మార్చనున్నారు. ఈ భరోసా సెంటర్‌లను నడపడానికి ప్రస్తుతం సంవత్సరానికి రూ.15.50 కోట్ల నిధులను స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కేటాయిస్తోంది. మొత్తం అన్ని సెంటర్‌లలో 90 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

116 కేసుల్లో శిక్షలు

ఇప్పటివరకు 116 కేసుల్లో నిందితులకు శిక్షలు పడ్డాయి.ఈ కేసులను త్వరితగతిన పరిష్కరించడానికి ఫాస్ట్‌కోర్టులు పనిచేస్తున్నాయి. ఇంకా చాలా కేసుల్లో నిందితులకు శిక్ష పడాల్సి ఉన్నా వివిధ కారణాల వల్ల ఆలస్యం అవుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. పైస్థాయి అధికారుల నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు ప్రతి కేసును భరోసా ఉద్యోగులు చాలెంజ్‌గా తీసుకుంటారు. ఫోరెనిక్స్ ఎక్స్‌ఫర్ట్, లీగల్ సిబ్బంది కూడా ఆయా కేసులకు సంబంధించి సాక్ష్యాధారాలను సేకరించి వాటిని కోర్టు ముందు ఉంచుతున్నారు. దీంతోపాటు ప్రతి భరోసా సెంటర్‌లో సిఐ, ఎస్‌ఐ లేడీ అధికారులు ఉన్నారు. ప్రతి జిల్లాలో ఈ సెంటర్‌లకు ఇన్‌చార్జీలుగా అడిషనల్ ఎస్పీ (డిసిపి) ర్యాంకు అధికారి మానిటరింగ్ చేస్తుంటారు. అత్యాచారానికి గురైన బాధితుల నుంచి మొదటగా సిఆర్‌పిసి 161 పోలీస్‌స్టేట్‌మెంట్ రికార్డు చేస్తారు. ఇప్పటివరకు 3,782 బాధితుల నుంచి ఈ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు.

908 బాధితులకు రూ.2 కోట్ల పైచిలుకు పరిహారం

అత్యాచార బాధితులకు కావాల్సిన సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తోంది. వారికి స్కూల్, కాలేజీ అడ్మిషన్స్‌తో పాటు వారికి పరిహారం కూడా అందేలా భరోసా ఉద్యోగులు కృషి చేస్తున్నారు. ఇప్పటివరకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 908 బాధితులకు రూ.2,87,97,500లు ఇప్పటివరకు పరిహారం అందించింది. అయితే ఎఫ్‌ఐఆర్ కాగానే రూ.25 వేలు, చార్జీషీట్ వేయగానే రూ.25 వేలు, జడ్జిమెంట్ రాగానే మరో రూ.50 వేలను ఈ శాఖ అందిస్తోంది. దీంతోపాటు ఎన్‌ఎండిసి బాధితులకు సాయం అందించేందుకు 2017 సంవత్సరంలో కోటి రూపాయాలను ఫిక్స్‌డ్ చేస్తోంది. ప్రస్తుతం దానిమీద వచ్చిన ఇంట్రెస్ట్‌తో 235 బాధితులకు రూ.2 కోట్ల 23 లక్షలను పరిహారం అందించింది. దీంతోపాటు ఈ బాధితులు ఒకవేళ అనారోగ్యానికి గురైతే తక్షణ సాయం కింద రూ.10 వేలను చెల్లిస్తోంది. భరోసా సెంటర్‌లకు సంబంధించి 3వేల అవగాహన సదస్సులను ఇప్పటివరకు నిర్వహించారు.

హైదరాబాద్‌లో 2119 ఫోక్సో కేసులు

హైదరాబాద్ భరోసా సెంటర్‌లో ఇప్పటివరకు 2119 (ఫోక్సో), 621 రేప్, 9440 డివి కేసులు నమోదయ్యాయి. వికారాబాద్ భరోసా సెంటర్‌లో ఇప్పటివరకు 361 (ఫోక్సో), 28 రేప్ కేసులు, వరంగల్ సెంటర్‌లో 159 (ఫోక్సో), 67 రేప్, కేసులు, సంగారెడ్డిలో 182 (ఫోక్సో), 15 రేప్, కేసులు, నల్లగొండలో 155 (ఫోక్సో), 38 రేప్ కేసులు నమోదయ్యాయి. వీటితో పాటు సూర్యాపేటలో 141 (ఫోక్సో), 36 రేప్ కేసులు, సిద్దిపేటలో 83 (ఫోక్సో), 24 రేప్ కేసులు, ఖమ్మంలో 65 (ఫోక్సో), 12 రేప్ కేసులు, మహబూబాబాద్‌లో 32 (ఫోక్సో), 08 రేప్ కేసులు, జోగులాంభ గద్వాల్‌లో 53 (ఫోక్సో), 06 రేప్ కేసులు, మేడ్చల్ మల్కాజిగిరిలో 45 (ఫోక్సో), 07 రేప్ కేసులు, మెదక్‌లో 31 (ఫోక్సో), 02 రేప్, కేసులు నమోదయ్యాయి

భరోసా టెక్నికల్ డైరెక్టర్ మమత

ఈ సెంటర్‌లకు కావాల్సిన టెక్నికల్ సపోర్టు ఇస్తున్నాం. వాటికి కావాల్సిన వనరులు, స్టాఫ్ సెలక్షన్, శిక్షణను సైతం తామే నిర్వహిస్తాం. కాలేజీలు, స్కూళ్లలో యువతకు మహిళలను ఎలా గౌరవించాలి, వారితో ఎలా ప్రవర్తించాలన్న విషయాలపై అవగాహన కల్పిస్తున్నాం. దీంతోపాటు బాధితులు మా సెంటర్‌లకు వస్తే వారి పట్ల ఎలా ప్రవర్తించాలి, వారికి కావాల్సిన బాగోగులపై ఎప్పటికప్పుడు మా ఉద్యోగులకు తెలియచెబుతున్నాం. గతంలో అత్యాచారం చేసిన 100 మంది నిందితుల్లో 2 శాతం మందికి మాత్రమే శిక్షలు పడేవి. ప్రస్తుతం భరోసా సెంటర్‌లతో అది 33.5 శాతానికి పెరిగింది. రానున్న రోజుల్లో నిందితులకు త్వరితగతిన శిక్ష పడేలా, వాటికి సంబంధించి సాక్ష్యాలను కోర్టుకు సమర్పించేలా చర్యలు చేపడుతున్నాం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News