Sunday, December 22, 2024

ఆకలి బతుకు నుంచి అమెరికాలో శాస్తవేత్త వరకు

- Advertisement -
- Advertisement -

 

నాగ్‌పూర్ : తినడానికి తిండి లేక ఆకలితో అలమటించే మారుమూల గ్రామంలోని పిల్లవాడు అమెరికా లోని ఓ ప్రఖ్యాత సంస్థలో సీనియర్ శాస్త్రవేత్త స్థాయికి ఎదిగాడంటే ఆయన జీవితం ఎంతో స్ఫూర్తిదాయకమే. కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చని ఆయన జీవితం నిరూపిస్తుంది. గడ్చిరోలి జిల్లా కుర్ఖేడా తెహసీల్ లోని చిర్చాడీ గ్రామానికి చెందిన భాస్కర్ ఇప్పుడు అమెరికా లోని ప్రపంచ ప్రఖ్యాత బయోఫార్మా కంపెనీ సిర్నావోమిక్స్‌లో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. ఈ సంస్థ ప్రధానంగా జన్యుపరమైన ఔషధాలపై పరిశోధనలు చేస్తుంటుంది. ఇందులో భాస్కర్ ఆర్‌ఎన్‌ఎ ఉత్పత్తికి సంబంధించిన కార్యకలాపాల్ని పర్యవేక్షిస్తున్నారు. చిర్చాడీ గ్రామంలో సైన్స్‌డిగ్రీ పూర్తి చేసిన మొదటి వ్యక్తేకాదు, మాస్టర్స్, పీహెచ్‌డి చేసిన మొట్టమొదటి వ్యక్తీ కూడా భాస్కరే. ఒక్కపూటైనా తిండికి నోచుకోని కుటుంబం భాస్కర్‌ది.

వర్షాకాలంలో తమకున్న చిన్న పొలంలో పంటలు వేయడానికి కూడా వీలుండేది కాదు. కొన్ని నెలల పాటు పని దొరికేది కాదు. ఇప్పపూలను వండుకుని తినేవాళ్లమని చిన్ననాటి రోజుల్ని భాస్కర్ గుర్తు చేసుకున్నారు. బియ్యం పిండితో అంబలి కాచుకుని ఆకలి తీర్చుకునే వారు. ఆ గ్రామంలో 90 శాతం మంది బతుకులు ఇలాంటివే. ఏడో తరగతి వరకు చదువుకున్న తన తండ్రికి చిన్న ఉద్యోగం వచ్చిన తరువాత పరిస్థితులు కాస్త మెరుగుపడ్డాయని భాస్కర్ తెలిపారు. వంద కిలో మీటర్ల దూరంలో ఉన ఓ స్కూలులో తన తండ్రికి వంట చేసే పని దొరికింది. అక్కడకు వెళ్లడానికి సరైన ప్రయాణ వసతులు ఉండేవి కావు. ఇంటి నుంచి వెళ్లాక అక్కడికి చేరుకున్నారా లేదా అని తెలిసేది కాదు. కొన్నాళ్లకు ఆ స్కూల్ ఉన్న కసనూర్‌కు కుటుంబం మొత్తం తరలివెళ్లింది. భాస్కర్ ఒకటి నుంచి నాలుగో తరగతి వరకు కసనూర్ లోనే చదువుకున్నారు.

తర్వాత స్కాలర్‌షిప్‌పై యవత్మల్‌లోని ప్రభుత్వ విద్యానికేతన్‌లో పదో తరగతి పూర్తి చేసి గడ్చిరోలి లోని కాలేజీలో బీఎస్సీలో డిగ్రీ పూర్తి చేశారు. తర్వాత నాగపూర్‌లో కెమిస్ట్రీలో మాస్టర్స్ పట్టా పుచ్చుకున్నారు. 2003 లో ప్రఖ్యాత లక్ష్మీనారాయణ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అసెస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరారు. మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో పాసైన తరువాత పిహెచ్‌డి కోసం అమెరికా వెళ్లి డీఎన్‌ఎ , ఆర్‌ఎన్‌ఎలో పరిశోధనలు చేశారు. మిషిగన్ టెక్నాలజికల్ యూనివర్శిటీ నుంచి పీహెచ్‌డీ పూర్తి చేశారు.

ప్రస్తుతం సిర్సావోమిక్స్‌లో పనిచేస్తున్న తనకు తమ సంస్థల్లో చేరాలని కోరుతూ ప్రతివారం ఓ అరడజను కంపెనీల నుంచి ఇ మెయిల్స్ వస్తుంటాయని ఆయనే స్వయంగా తెలిపారు. ఇదంతా తన తల్లిదండ్రుల ప్రోత్సాహమే అని భాస్కర్ అంటుంటారు. తల్లిదండ్రుల కోసం చిర్చాడీలో ఇల్లు నిర్మించారు. కొన్నేళ్ల క్రితం తండ్రి చనిపోయారు. ఇటీవల మహారాష్ట్ర గిరిజన అభివృద్ధి విభాగం అదనపు కమిషనర్ ఠాక్రే గడ్చిరోలిలో భాస్కర్‌ను సత్కరించారు. “ట్రైబల్ సెలబ్రిటీతో చాయ్‌” అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ఆయన తోనే ప్రారంభించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News