Wednesday, January 22, 2025

జైలుకు భాస్కర్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపి అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డికి సి బిఐ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఆ యనను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. వివేకా కేసులో ఆదివారం ఉదయం పులివెందులలో భాస్కర్‌రెడ్డిని అరెస్ట్ చేసిన సిబిఐ అధికారులు హైదరాబాద్‌కు తరలించారు. అనంతరం ఆయనను సిబి ఐ జడ్జి ఎదుట హాజరుపరచగా భాస్కర్ రెడ్డికి న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. కాగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైసిపి ఎంపి అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని ఆదివారం సిబిఐ అదుపులోకి తీసుకుంది. ఇప్పటికే వివేకా హత్య కేసు విచారణను వేగవంతం చేసిన సిబిఐ అరెస్టులను ప్రారంభించడం అవినాష్, భాస్కర్ రెడ్డి అరెస్ట్ ఖాయమంటూ ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే వైఎస్సార్ కడప జిల్లా పులివెందులోని వైసిపి ఎంపి అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ఇళ్లకు సిబిఐ అధికారులు చేరుకోవడంతో అలజడి మొదలయ్యింది.

అవినాష్ రెడ్డి ముఖ్య అనుచరుడు ఉదయ్ కుమార్ రెడ్డి అరెస్ట్ తర్వాత జరుగుతున్న పరిణామాలు కలకలం రేపుతుండగా తాజాగా సిబిఐ అధికారులు అవినాష్ ఇంటికి చేరుకోవడంతో ఏదో జరగబోతోందని అందరూ భావించారు. చివరకు అవినాష్ తండ్రి భాస్కర్ రెడ్డిని సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కుటుంబంతో వ్యక్తిగతంగానే కాదు రాజకీయంగా విబేధాల నేపథ్యంలో సొంత బాబాయ్ వివేక్ ను అవినాష్ రెడ్డి హత్య చేయించాడని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో సానుభూతి కోసం ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ కూడా వివేకా హత్యకు సహకరించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇలా అధికార పార్టీకి చెందిన కీలక నాయకుల ప్రమేయం వున్నట్లు అనుమానాల నేపథ్యంలో వివేకా కూతురు సిబిఐ విచారణను కోరారు. దీంతో ఎపి పోలీసుల చేతి నుండి ఈ కేసు సిబిఐ చేతికి వెళ్లడంతో ఎపిలో అలజడి మొదలయ్యింది.

Also Read:  శ్వాసనాళంలో భారీ కణితి.. కాపాడిన వైద్యులు

రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు ప్రస్తావించిన సిబిఐ
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డిని తమ కస్టడీకి అప్పగించాల్సిందిగా సిబిఐ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలను సిబిఐ ప్రస్తావించింది. తప్పనిసరి పరిస్థితుల్లోనే తాము భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించింది. అరెస్ట్ చేయకుంటే ఆయన అందుబాటులో వుండటం లేదని పేర్కొంది. 10 రోజులు కస్టడీకి ఇస్తే మరిన్ని విషయాలను రాబడతామని న్యాయస్థానాన్ని కోరింది. గతంలో సిబిఐ విచారణకు హాజరైనా ఆయన సహకరించలేదని పేర్కొంది. వైఎస్ భాస్కర్ రెడ్డి సాక్షులను ప్రభావితం చేయగల వ్యక్తని సిబిఐ అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పిటిషన్‌ను స్వీకరించిన సిబిఐ న్యాయస్థానం సోమవారం వాదనలను వింటామని తెలిపింది.
అవినాష్ రెడ్డికి మరోసారి నోటీసులు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సిబిఐ దూకుడు పెంచింది. ఇప్పటికే ఆదివారం ఉదయం వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన సిబిఐ అధికారులు తాజాగా ఆయన కుమారుడు, కడప ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డికి మరోసారి నోటీసులు ఇచ్చింది. సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని సిబిఐ కార్యాలయం ఎదుట విచారణకు హాజరవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో రేపు ఏం జరుగుతోందోనని వైఎస్ కుటుంబ సభ్యులు, వైసిపి శ్రేణులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.
వాస్తవాల ఆధారంగా సిబిఐ విచారణ జరగాలి: ఎంపి అవినాష్ రెడ్డి
మాజీ మంత్రి వివేకానందరెడ్డి మృతి కేసులో వాస్తవాల ఆధారంగా సిబిఐ విచారణ జరగాలని కడప ఎంపి వైఎస్ అవినాష్‌రెడ్డి అన్నారు. ఆదివారం అవినాష్ మీడియాతో మాట్లాడుతూ సిబిఐ విచారణ సరిగా జరగటం లేదన్నారు. విచారణలో కీలక విషయాలను వదిలేశారని ఆరోపించారు. సమాచారం ఇచ్చిన తననే దోషిగా చూస్తున్నారని ఆరోపించారు. తను చెప్పిన విషయాలను సిబిఐ పరిగణలోకి తీసుకోవడం లేదన్నారు. రెండవ భార్యకు ఆస్తి రాయాలని వివేకా అనుకున్నారని తెలిపారు. హత్య విషయం వివేకా అల్లుడు రాజశేఖర్‌కు తనకంటే గంట ముందుగానే తెలుసన్నారు. వైఎస్ భాస్కర్‌రెడ్డిని ఊహించని విధంగా అరెస్టు చేశారని ,దీనిపై స్పందించేందుకు మాటలు రావటం లేదన్నారు. అయినప్పటికే ధైర్యం కోల్పోమని , నిజాయితీని నిరూపించుకుంటామని ఎంపి అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News