ఖమ్మం : సిఎల్‌పి నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర తెలంగాణ కోసమేనని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. సిఎల్‌పి నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర శుక్రవారం నాటికి 107వ రోజుకు చేరుకుంది. శుక్రవారం మధ్యాహ్నం తల్లంపాడు చేరుకున్న పాదయాత్రలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్, మాజీ ఎంపీ మల్లు రవి తదితరులు పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర కాంగ్రెస్ పార్టీ కోసం చేసింది కాదనీ, తెలంగాణ ప్రజల ప్రయోజనం కోసం చేసిందన్నారు.
కెసిఆర్ చేసిన అభివృద్ధిని ఈస్ట్ మన్ కలర్ లో చూపిస్తున్నారని, ఆ భ్రమలన్నీ ఈ పాదయాత్రతో తొలగిపోయాయన్నారు. ఈ పాదయాత్రలో ప్రజలు తమ సమస్యలను భట్టి విక్రమార్కకు విన్నవించుకున్నారన్నారు. ఆయా గ్రామాలలో చోటు చేసుకున్న తప్పిదాలు, నష్టాలను ఏకరవు పెట్టినట్టు చెప్పారు. కేసీఆర్ చేతిలో మోసపోయిన బాధితులను భట్టి విక్రమార్క కలుసుకొని వారికి భరోసా కల్పించారని తెలిపారు. కేసీఆర్ చేసిన మోసాలను భట్టి విక్రమార్క ప్రజలకు వివరించుకుంటూ ముందుకు సాగారని చెప్పారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్ర తెలంగాణ ప్రజల సమస్యలకు ఒక జవాబును వెతుకుతుందని అన్నారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో చూసిన సమస్యలు, వాటి పరిష్కారమే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోగా ఉంటుందని రేవంత్ రెడ్డి వెల్లడించారు. భట్టి విక్రమార్క పాదయాత్ర కాంగ్రెస్ పార్టీకే కాక, తెలంగాణ సమాజం కోసం ఉపయోగపడుతుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోందన్నారు.
ఈ పాదయాత్ర వల్ల పేదల జీవితాల్లో మార్పు కోసం అవసరమైన ఆలోచన చేసేందుకు, నిర్ణయాలు తీసుకునేందుకు ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి రాష్ట్ర నాయకులు రాయల నాగేశ్వరరావు, నాయకులు రామ్ రెడ్డి చరణ్ రెడ్డి, తల్లంపాడు సర్పంచ్ శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.