Saturday, November 23, 2024

జిల్లాకు చేరుకున్న భట్టి పాదయాత్ర

- Advertisement -
- Advertisement -

ఖమ్మం : పీపుల్స్ మార్చ్ పేరుతో సిఎల్‌పి నేత మల్లు భట్టి విక్రమార్క ప్రారంభించిన పాదయాత్ర బుధవారం సాయంత్రం ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించింది. ఈ ఏడాది మార్చి 16న ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రారంభించిన ఈ యాత్ర 105వ రోజున సూర్యాపేట జిల్లా మీదుగా ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించింది. ఈ సందర్బంగా జిల్లా సరిహద్దులోని నాయకన్ గూడెం వద్ద డిసిసి అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గప్రసాద్,మాజీ ఎం ఎల్ సి పోట్ల నాగేశ్వర్ రావు,పాలేరు ఇంచార్జ్ రాయల నాగేశ్వరరావు, నగర అధ్యక్షుడు జావేద్, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు భట్టికి ఘన స్వాగతం పలికారు. 105 రోజుల తరువాత జిల్లాకు చేరుకున్న భట్టిని చూసేందుకు కార్యకర్తలు పెద్ద ఎత్తున్న తరలివచ్చారు.

బుధవారం ఉదయం 9గంటలకు సూర్యాపేట జిల్లా మోతే మండలంలో ప్రారంభమైన యాత్ర హుస్సేన్‌బాద్ మీదుగా మధ్యాహ్నం మోతే మండలం మామిళ్ళగూడెం వద్దకు చేరుకుంది. అక్కడి నుంచి నాయకన్ గూడెంకు చేరుకుంది. ఈ సందర్భంగా గిరిజన నృత్యాలు, మహిళా కోలాటాలు, డప్పు వాయిద్యాలతో భట్టికి స్వాగతం పలికారు. భట్టికి స్వాగతం పలకడానికి కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున్న జిల్లా సరిహద్దుకు తరలివచ్చారు. ఈ సందర్భంగా పాలేరు ఇంచార్జ్ రాయల నాగేశ్వరరావు భట్టిని గజమాలతో సత్కరించారు. నాయకన్ గూడెం తరువాత రాత్రి పాలేరు వద్ద బస చేశారు. గురువారం ఉదయం పాలేరు, కూసుమంచి చెగొమ్మ వరకు పాదయాత్ర ఉంటుంది. అనంతరం మధ్యాహ్న భోజన విరామం ఉంటుంది. తిరిగి సాయంత్రం కేశవపురం, జీళ్ళచెర్వు, గోపాలపేట, తల్లంపాడుకు చేరుకొని అక్కడ బస చేస్తారు.

శుక్రవారం ఉదయం తల్లంపాడు నుంచి బయలుదేరి అక్కడ నిర్మించిన పాదయాత్ర పైలాన్‌ను ఆవిష్కరించి అక్కడ జరిగే సభలో ప్రసంగిస్తారు. అనంతరం మద్దుల పల్లి మీదుగా కోదాడ క్రాస్ రోడ్డుకు చేరుకుంటారు. ఆ రోజు రాత్రి కోదాడ క్రాస్ రోడ్డులో బస చేస్తారు. శనివారం ఉదయం కోదాడ క్రాస్ రోడ్డును బయలుదేరి వరంగల్ క్రాస్ రోడ్డు, మున్నేరు బ్రిడ్జి, మయూరి సెంటర్ మీదుగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయంకు చేరుకుంటారు. అక్కడ మధ్యాహ్న భోజనం చేసిన తరువాత వైరా రోడ్డు, ఇల్లెందు క్రాస్ రోడ్డు మీదుగా బైపాస్ రోడ్డులో శ్రీశ్రీ సర్కిల్ వద్దకు చేరుకొని ఆ రోజు రాత్రి అక్కడే బస చేస్తారు. ఆదివారం ఉదయం (జూలై 2న) శ్రీశ్రీ సర్కిల్ నుంచి బయలుదేరి సభ స్థలి అయిన ఎస్‌ఆర్ గార్డెన్ వద్ద జరిగే ముగింపు బహిరంగ సభ వేధిక వద్దకు చేరుకొని అక్కడ తన పాదయాత్రను విరమిస్తారు ఖమ్మం జిల్లాలో ఐదు రోజుల పాటు దాదాపు 32 కిలో మీటర్లు పాటు పాదయాత్ర కొనసాగుతుంది.

  • భట్టితో ఠాక్రే భేటి

జిల్లా సరిహద్దులో నాయకన్ గూడెం సమీపంలో టోల్ ఫ్లాజా వద్ద ఏర్పాటు చేసిన శిబిరంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్య రావు ఠాక్రే, సీఎల్పీనేత భట్టి విక్రమార్క ఎఐసిసి జనరల్ సెక్రటరీ రోహిత్ చౌదరిలు పాదయాత్ర ముగింపు సందర్భంగా ఖమ్మంలో నిర్వహించే తెలంగాణ గర్జన సభ గురించి, తాజా రాజకీయ పరిస్థితులపై ప్రత్యేకంగా చర్చించారు. దాదాపు రెండు గంటల పాటు సుధీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా 1221 కిలో మీటర్లు పాదయాత్ర పూర్తి చేసుకున్న భట్టిని, రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్యరావు ఠాక్రేలను మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మదన్ మోహన్, ప్రేమ్ సాగర్ రావు, సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు చెవిటి వెంకన్న, ముదిరెడ్డి నిరంజన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News