Thursday, November 21, 2024

నాలుగోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్న భట్టి విక్రమార్క, పోదెం వీరయ్యలు

- Advertisement -
- Advertisement -

మొదటి జాబితాలో ఉమ్మడి ఖమ్మం జిల్లా సిట్టింగ్‌లకు మరోసారి అవకాశం కల్పించిన అధిష్టానం

మనతెలంగాణ/హైదరాబాద్: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని రెండు సిట్టింగ్ స్థానాలకు కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థులను వెల్లడించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది స్థానాలు ఉండగా అందులో మధిర నుంచి భట్టి విక్రమార్క, భద్రాచలం నుంచి పొదెం వీరయ్యను అభ్యర్ధులుగా అధిష్టానం ప్రకటించింది. భట్టి విక్రమార్క నాలుగో సారి గెలవడానికి ఎన్నికల బరిలో దిగనుండగా, పొదెం వీరయ్య కూడా నాలుగోసారి గెలుపులో భాగంగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. గతంలో భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎంఎల్‌సిగా గెలుపొందారు. ఆ తరువాత మధిర నుంచి 2008, 2014, 2018లలో పోటీ చేసి భట్టి గెలుపొందాడు. భట్టి విక్రమార్క మధిర నుంచి మూడు సార్లు వరుసగా గెలిచి హ్యాట్రిక్ సాధించాడు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో భట్టి విక్రమార్క డిప్యూటీ స్పీకర్ గా కూడా పనిచేశారు. అయితే 2018లో ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత సిఎల్పీ నేతగా ఎన్నికయ్యారు.
1999, 2004, 2018లో వీరయ్య విజయం
ఇకపోతే భద్రాచలం నుంచి పోటీ చేయనున్న పొదెం వీరయ్య ఇప్పటికి మూడు సార్లు ఎంఎల్‌ఎగా గెలిచారు. ములుగు ఎంఎల్‌ఎగా ఆయన ప్రస్తానం ప్రారంభం అయ్యింది. ములుగులో 1997లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన ఆయన ఓటమి పాలయ్యారు. ఆతరువాత 1999, 2004 కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ తరువాత మళ్లీ 2009 సంవత్సరంలో కాంగ్రెస్ నుంచి పోటీచేయగా అప్పట్లో టిడిపి నుంచి సీతక్క గెలుపొందింది. ఇక 2014లో కాంగ్రెస్ నుంచి పోటీచేసిన పొదెం వీరయ్య మరో సారి ఓటమి పాలయ్యారు. కాగా ములుగులో సీతక్కకు అవకాశం కల్పించడంలో భాగంగా 2018 లో భద్రాచలం నుంచి పొదెం వీరయ్య కాంగ్రెస్ సీటు ఇచ్చింది. స్థానికేతరుడు అయినప్పటికి భద్రాచలం నుంచి ఆయన పోటీచేసి గెలుపొందారు.
సిపిఎం ఒత్తిడి చేసినా భద్రాచలం సీటు పోదెం వీరయ్యకే…
భద్రాద్రి జిల్లాలో అయిదు స్థానాలు ఉండగా అయిదు స్థానాల్లో కూడా 2018 సంవత్సరంలో కాంగ్రెస్, టిడిపి పొత్తులో భాగంగా అన్ని స్థానాలను ఈ రెండు పార్టీలు గెలుచుకున్నాయి. అందులో నలుగురు పార్టీ మారి బిఆర్‌ఎస్ లోచేరినప్పటికి పొదెం వీరయ్య మాత్రం పార్టీ మారకుండా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఎటువంటి ఆరోపణలు లేని వ్యక్తిగా పోదెం వీరయ్యకు పేరు ఉంది. దీంతోఅధిష్టానం పొదెం వీరయ్య మరోసారి ప్రాధాన్యత ఇచ్చింది. సిపిఎం పార్టీ జాతీయ స్థాయిలో భద్రాచలం సీటు ఇవ్వాలని కాంగ్రెస్‌పై ఒత్తిడి చేసినప్పటికి పొదెం వీరయ్యకే ఈ సీటును కేటాయిస్తామని ఖరాకండిగా సిపిఎంతో పేర్కొనడంతో పాటు మొదటి జాబితాలో పోదెం వీరయ్య పేరును ప్రకటించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News