Tuesday, January 21, 2025

మళ్లీ పొంగిన మున్నేరు వాగు

- Advertisement -
- Advertisement -

ఖమ్మంకు మరోసారి ముంపు భయం
రెండురోజులుగా పరీవాహక ప్రాంతంలో భారీ వర్షాలతో ఉప్పొంగిన మున్నేరు
తిరిగి పునరావాస కేంద్రాలకు బాధితులు
వరద ప్రభావిత ప్రాంతాల్లో డిప్యూటీ సిఎం భట్టి, మంత్రి పొంగులేటి పర్యటన

మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో: ఖమ్మం నగర ప్రజలకు మళ్ళీ వరద ముప్పు ఏర్పడింది. ఈనెల 1న వచ్చిన భారీ వరద గాయాల నుంచి ఇంకా తేరుకోకముందే మళ్లీ వరద పంజా విసిరింది. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం వరకు మున్నేరు పరివాహక ప్రాంతమైన ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలతో ఖమ్మం నగరంలో మున్నేరు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో వరద బాధితులంతా మళ్లీ పునరావాస కేంద్రాలకు తరలివెళ్ళారు.

గంట గంటకు పెరుగుతున్న వరదతో మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువైంది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమై మున్నేరు పరివాహక ప్రాంత ప్రజలను ఇళ్ళ నుంచి ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కేవలం వారం రోజుల వ్యవధిలోనే రెండుసార్లు వరద తాకడికి గురికావడంతో బాధితులంతా భయాందోళన చెందుతున్నారు. వందేళ్ళ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఈనెల 1న వచ్చిన భారీ వరదలతో సర్వం కోల్పోయి బురదమమైన ఇళ్ళను శుభ్రం చేసుకొని ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్న సమయంలో మళ్ళీ వరదలు రావడంతో బాధిత కుటుంబాలకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. మున్నేరు క్యాచ్ మెంట్ ఏరియాలో శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం రాత్రి వరకు కుండపోతగా వర్షం కురుస్తోంది. దీంతో ఖమ్మం నగరంలో మున్నేరు వద్ద వరద ఉధృతి తీవ్రమైంది.

శనివారం అర్ధరాత్రి 12 గంటలకు 14 అడుగులకు వరద చేరుకుంది. గంట గంటకు వరద ఉధృతి పెరుగుతూ ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు 15.20 అడుగులు, ఉదయం 7 గంటలకు 15.75 అడుగులకు చేరుకుంది. 16 అడుగులకు చేరుకుంటే మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. 16 అడుగులకు చేరువలో ఉండటంతో అర్ధరాత్రి నుంచే అధికారులు మున్నేరు పరివాహక ప్రాంతంలో నివాసితులందరినీ ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించారు. ఈ విషయం తెలిసి డిప్యూటీ సిఎం హుటాహుటిన హైదరాబాద్ నుంచి ఖమ్మం నగరానికి వచ్చి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితుల పునరావాస కేంద్రాన్ని తనిఖీ చేశారు.

రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా హుటాహుటిన ఖమ్మం నగరానికి చేరుకొని అధికారులను అ ప్రమత్తం చేశారు. ఆదివారం ఉదయం ఏడున్న ర గంటల తరువాత మున్నేరు కొంత శాంతించడం ప్రారంభించడంతో అధికార యంత్రాంగం కాస్తా ఊపిరి పీల్చుకుంది. ఉదయం ఏడున్నర గంటల నుంచి గంట గంటకు తగ్గుతూ రాత్రి 8 గంటలకు 13.10 అడుగులకు చేరుకుంది. మున్నేరు పరివాహక ప్రాంత ప్రజలను మైకులో అనౌన్స్‌మెంట్ చేయించి సమీపంలోని పునరావాస కేంద్రాలకు తరలించారు. ఈనెల 1వ తేదీన ఖమ్మం నగరంతోపాటు ఖమ్మం రూరల్ మండలంలో దాదాపు 7 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించగా ఆదివారం 8270 మందిని అయిదు పునరావాస కేం ద్రాలకు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News