Sunday, December 22, 2024

రైతులను కాపాడుకునేందుకే రైతు భరోసా: భట్టి విక్రమార్క

- Advertisement -
- Advertisement -

రైతులను కాపాడుకునేందుకే రైతు భరోసా
అన్నదాతల అభిప్రాయాల మేరకే నిర్ణయం
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
రాష్ట్ర అభివృద్ధి దిశగా ప్రజా రంజకంగా పాలన: మంత్రి తుమ్మల 
సముచిత ప్రణాళిక ద్వారా రైతు సంక్షేమానికి కృషి: పొంగులేటి 

మన తెలంగాణ / హైదరాబాద్: వ్యవసాయ రంగాన్ని, రైతులను కాపాడుకునేందుకే ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన వనరుల శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. అందరి అభిప్రాయాలు తెలుసుకునేందుకే రైతు భరోసా సదస్సులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ లో ఏర్పాటు చేసిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి సమావేశానికి రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి ధనసరి అనసూయ (సీతక్క), ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యులు గొడం నగేష్, కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల కలెక్టర్లు వెంకటేష్ ధోత్రే, రాజర్షి షా, కుమార్ దీపక్, అభిలాష అభినవ్, సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ-ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి ఖుష్బూ గుప్తా, అదనపు కలెక్టర్లు, శాసనమండలి సభ్యులు దండే విఠల్, ఆసిఫాబాద్, సిర్పూర్, మంచిర్యాల, చెన్నూర్, ఖానాపూర్ శాసనసభ్యులు కోవ లక్ష్మి, పాల్వాయి హరీష్ బాబు, కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వివేకానంద, వెడ్మ బొజ్జు లతో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన వనరుల శాఖ మంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్రంలోని రైతుల సంక్షేమం దృష్ట్యా రైతు భరోసా కార్యక్రమాన్ని నిర్దిష్టంగా అమలు చేయాలని లక్ష్యంతో అందరి అభిప్రాయం, సలహాలు, సూచనలు తీసుకొని అన్ని జిల్లాలను క్రోడీకరించి చట్టసభలలో ప్రస్తావనకు తీసుకువచ్చి ఈ అంశాలపై చర్చించడం జరుగుతుందని తెలిపారు.

రాష్ట్ర వనరులు, సంపదను ప్రజా సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి వినియోగిస్తామని, ప్రజలు, రైతులు ప్రత్యక్షంగా, పరోక్షంగా తమ కష్టార్జితం నుంచి చెల్లించిన పన్ను, వివిధ రంగాల ద్వారా ప్రభుత్వానికి సమకూర్చిన ఆదాయం ద్వారా ప్రజల కష్టానికి న్యాయం చేస్తామని అన్నారు. రైతు భరోసా పథకం ద్వారా రైతు సంక్షేమం కోసం స్పష్టమైన కార్యచరణతో ముందుకు వెళదామని అన్నారు. రైతు భరోసా పథకంలో రైతులకు లబ్ధి చేకూరే విధంగా రైతులు, శాస్త్రవేత్తలు, వివిధ రంగాలలో నిపుణులు, వివిధ వర్గాల వారి అందరి అభిప్రాయాలు, సూచనలు తీసుకొని రైతు సంక్షేమం దిశగా కృషి చేయడం జరుగుతుందని తెలిపారు.

రాష్ట్ర అభివృద్ధి దిశగా ప్రజా రంజకంగా పాలన: మంత్రి తుమ్మల 

రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ ప్రజల ఆలోచనను పరిగణలోకి తీసుకుని రాష్ట్ర అభివృద్ధి దిశగా ప్రజా రంజకంగా పాలన సాగించడం జరుగుతుందని, చిన్న, సన్నకారు రైతులకు ఉపయోగపడే విధంగా రైతు భరోసా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. వ్యవసాయ క్షేత్రంలో కష్టాలకు ఓర్చి, చెమటోడ్చి పంట పండించే రైతుకు ప్రాధాన్యత నివ్వడం జరుగుతుందని తెలిపారు.

గతంలోని లోపాలు, ఆర్థిక నష్టాలను అధిగమించి, తుమ్మిడి హెట్టి ప్రాజెక్టు ద్వారా ఆదిలాబాద్ జిల్లాకు నీటిని అందించాలనే ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా చర్యలు చేపడతామని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాతో కాంగ్రెస్ పార్టీకి, నాయకులకు ఎంతో అనుబంధం ఉందని, అధిక శాతం అటవీ ప్రాంతం కలిగి ఉన్న గిరిజన జిల్లాలో ఎన్నికలలో జిల్లా వాసులు అందించిన స్ఫూర్తితో అన్ని రంగాల అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. అర్హత గల ప్రతి రైతుకు రుణమాఫీ పథకాన్ని అమలు చేస్తామని, అసలైన, నిజమైన రైతుకు రైతు భరోసా అందిస్తామని అన్నారు.

సముచిత ప్రణాళిక ద్వారా రైతు సంక్షేమానికి కృషి: మంత్రి పొంగులేటి 

రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రైతు భరోసా అమలు చేయడంలో ప్రతి ఒక్కరి అభిప్రాయానికి ప్రాధాన్యత ఇస్తామని, అందరి అభిప్రాయాలను క్రోడీకరించి సముచిత ప్రణాళిక ద్వారా రైతు సంక్షేమానికి కృషి చేస్తామని తెలిపారు. ప్రభుత్వం నుండి ఏ కార్యక్రమం చేపట్టిన ప్రజా క్షేత్రంలో సూచనలు, సలహాలు తీసుకొని ప్రజల సమ్మతితో అమలు చేయడం జరుగుతుందని, ప్రజాధనాన్ని ప్రజలకు ప్రతినిధులుగా న్యాయబద్ధంగా అర్హత గల ప్రతి ఒక్కరికి అందే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

దాదాపు 96 శాతం ఉన్న సన్న, చిన్న కారు రైతుల అభివృద్ధి దిశగా ప్రభుత్వం పని చేస్తుందని, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సరైన పత్రాలు లేకుండా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న రైతుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. ప్రజలు అందించిన సలహాలు, సూచనలు, అభిప్రాయాలను అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష పార్టీల ప్రతినిధుల సమక్షంలో ప్రస్తావించి వారి అభిప్రాయాలను సైతం స్వీకరిస్తామని తెలిపారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి మాట్లాడుతూ ప్రజాధనాన్ని ప్రజల అవసరాలకు మాత్రమే వినియోగించేందుకు ప్రభుత్వం కార్యచరణ అమలు చేస్తుందని తెలిపారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో ఆయా నియోజకవర్గాలు, మున్సిపాలిటీల వారీగా పెండింగ్ లో ఉన్న సమస్యలు, ప్రాజెక్టులు, అటవీ ఇతర అన్ని సమస్యల పరిష్కారానికి తీసుకోవలసిన చర్యలపై విధివిధానాలు రూపొందించేందుకు చర్యలు తీసుకుంటామని, ఈ క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లాల బాట పట్టారని, ప్రజా క్షేత్రంలో ప్రజల సమస్యలను తెలుసుకొని వీలైనంతవరకు అక్కడికక్కడే పరిష్కరించే విధంగా ప్రణాళిక అమలు చేస్తామని తెలిపారు. పేదల జీవితాల ప్రమాణాలను మెరుగుపరిచే విధంగా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, అన్ని రంగాలకు సమ ప్రాధాన్యతనిస్తూ బడ్జెట్ లో కేటాయింపులు చేయడం జరుగుతుందని తెలిపారు.

వ్యవసాయ భూమిలో కాలు పెట్టి చెమటోడ్చి సాగు చేసే రైతులకు న్యాయం జరిగేలా విధివిధానాలు రూపొందిస్తామని, నిబంధనల ప్రకారం అర్హత కలిగిన సాగు రైతులకు పట్టాలు అందించడంపై ప్రభుత్వం ఆలోచిస్తుందని అన్నారు. రైతులందరికీ సమన్యాయం జరిగే విధంగా చూస్తామని, అభిప్రాయ సేకరణలో పలువురు సూచించిన 10 ఎకరాల పరిమితి, పట్టాదారుకు, కౌలు రైతుకు సమభాగంగా అందించడం వంటి పలు అంశాలను వెల్లడించడం జరిగిందని, అన్ని అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని అసెంబ్లీలో చర్చించి అందరి అభిప్రాయం మేరకు రైతుకు లబ్ధి చేకూరే విధంగా రైతు భరోసా అమలు చేస్తామని తెలిపారు. ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోని రైతులు, రైతు సంఘాల నాయకులు, శాస్త్రవేత్తలు, న్యాయవాదులు, వైద్యులు, జర్నలిస్టులు పలు రంగాలకు చెందినవారు తమ అభిప్రాయాలను వ్యక్తపరచడం జరిగింది.

వ్యవసాయ క్షేత్రంలో సాగు చేసే రైతుకు మాత్రమే రైతు భరోసా వర్తింపచేయాలని, చిన్న, సన్న కారు రైతులకు న్యాయం చేయాలని, ఏజెన్సీ ప్రాంతాలలో సాగు చేస్తున్న నిజమైన రైతులకు అమలు చేయాలని, 10 ఎకరాల వ్యవసాయ భూమికి పరిమితి విధించాలని, అన్ని పంటలకు బోనస్ అందించాలని, కౌలు రైతుల సంక్షేమంపై ఆలోచించాలని, పన్ను చెల్లింపుదారులను మినహాయించాలని ఇతరత్రా అనేక అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధికార యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు, రైతులు, రైతు సంఘాల నాయకులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News