Thursday, January 16, 2025

మంత్రుల గురుకుల బాట

- Advertisement -
- Advertisement -

జిల్లాల్లో విద్యార్థులతో కలిసి భోజనాలు
ఖమ్మం జిల్లా బోనకల్‌లో కామన్‌డైట్
ప్రారంభించిన డిప్యూటీ సిఎం భట్టి

మన తెలంగాణ / హైదరాబాద్: ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితోపాటు రాష్ట్ర మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు హాస్టళ్ల బాట పట్టారు. రాష్ట్రంలోని అన్ని సంక్షేమ హాస్టల్లో ఒకే విధమైన డైట్ ప్లాన్ ను శనివారం ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో సహా రాష్ట్ర మంత్రులు, సీనియర్ ఐఏఎస్ , ఐపీఎస్ అధికారులు, జిల్లా కలెక్టర్లు ప్రారంభించారు. రాష్ట్రంలో గత పదేళ్లలో మొదటిసారిగా, సంక్షేమ హాస్టళ్ల చరిత్రలో మరెన్నడూ లేని విధంగాడైట్ చార్జీలను 40 శాతం, కాస్మోటిక్ చార్జీలు 200శాతం పెంచుతూ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ పెంచిన డైట్ ఛార్జీల్లో భాగంగా రాష్ట్రంలోని ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ హాస్టల్లో శనివారం ఒకే సారి కామన్ డైట్ విధానాన్ని ప్రజా ప్రతినిధులు, సీనియర్ అధికారుల సమక్షంలో ప్రారంభించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రితో సహా రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో పాటు సీనియర్ ఐఏఎస్,ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారులు, ఇతర ప్రజా ప్రతినిధులు గురుకుల, రెసిడెన్షియల్ హాస్టళ్లను శనివారం వ్యక్తిగతంగా సందర్శించి అక్కడే విద్యార్ధులతో కలసి సహపంక్తి భోజనం చేసి పరిస్థితులను స్వయంగా అంచనా వేశారు.

రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకుల హాస్టళ్లలోని దాదాపు 8 లక్షల మంది విద్యార్థులకు గతంలో మరెన్నడూ లేని విధంగా డైట్ చార్జీలు 40శాతం, కాస్మోటిక్ చార్జీలు 200శాతం పెంచుతూ రాష్ట్రప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు రాష్ట్రంలోని పాఠశాలలో 667.25 కోట్లతో మౌలిక సదుపాయాలను కూడా ప్రభుత్వం కల్పించింది. హాస్టళ్ల పనితీరును నిరంతరం పర్యేవేక్షించేందుకు ఆకునూరి మురళి అధ్యక్షతన స్టేట్ ఎడ్యుకేషన్ కమిషన్ కూడా ఏర్పాటు చేయడంతోపాటు, రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ హాస్టల్ నిర్మాణానికి కూడా శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ, మైనారిటీ హాస్టళ్లలో మరింత ప్రామాణికమైన ఆహారాన్ని అందించే కార్యక్రమంతో పాటు మెరుగైన విద్య బోధనా అవకాశాలను పెంపొందించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో శనివారం రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మొత్తం రాష్ట్రంలోని అన్ని గురుకుల సంక్షేమ హాస్టళ్లలో పర్యటించి పరిస్థితులను స్వయంగా సమీక్షించారు.

చిలుకూరులో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్‌లో సీఎం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరులోని టీజీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్‌లో కామన్ డైట్ ప్లాన్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఖమ్మం జిల్లాలోని బోనకల్ మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో కామన్ డైట్ మెనూను ప్రారంభించారు. మంత్రులు దామోదర రాజనరసింహ, శ్రీధర్ బాబు భూపాలపల్లి జిల్లాలోని ఘనపురం మండలం మైలారం లోని బాలికల మహాత్మ జ్యోతిబాపూలే హాస్టల్ లో, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం జిల్లాలోని మాదిరిపురం, తిరుమలాయపాలెం లోని గురుకుల పాఠశాల (బాలికలు), రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ షేక్‌పేట్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల (బాలురు)లో కామన్ డైట్‌ను ప్రారంభించారు.

కొండా సురేఖ సంగారెడ్డి జిల్లా హతనూరలోనూ, డి అనసూయ సీతక్క ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ ఆశ్రమ ఉన్నత పాఠశాల (బాలికలు)లో, తుమ్మల నాగేశ్వరరావు భద్రాద్రి కొత్తగూడం లోని దమ్మపేట మండలం గండుగులపల్లి ఏకలవ్య మోడల్ స్కూల్‌లో, జూపల్లి కృష్ణారావు నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ గురుకుల పాఠశాలలో (బాలికలు) ప్రారంభించారు. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఆహారం కల్తీ కావడంతో 42 మంది విద్యార్థులు చనిపోవడమే కాక చాలా మంది ఆసుపత్రుల పాలయ్యారు. ఆ పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం విద్యార్థుల కోసం ఒక కొత్త మెనూను ప్రభుత్వం ప్రారంభించింది.

విద్యార్థులతో ముచ్చటిస్తూ భోజనం చేసిన భట్టి విక్రమార్క

గత పది సంవత్సరాలు అధికారంలో ఉండి గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ హాస్టల్స్ విద్యార్థుల వసతులు పట్టించుకోకుండా, డైట్ చార్జీలు పెంచకుండా, పెండింగ్‌లో ఉన్న బిల్లులు నెలలు తరబడి చెల్లించకుండా గత బిఆర్‌ఎస్ పాలకులు చేసిన నిర్లక్ష్యం వల్లనే విద్యార్థుల ఆరోగ్యాలు దెబ్బతిన్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. గత పది సంవత్సరాలుగా గురుకుల, హాస్టల్ విద్యార్థుల సంక్షేమం గురించి పట్టించుకోని గత బిఆర్‌ఎస్ పాలకులు ఇప్పుడు హాస్టల్స్ బాగాలేవని, భోజనం సరిగా లేదని మాట్లాడటానికి సిగ్గుండాలని విమర్శించారు. శనివారం మధిర నియోజకవర్గం బోనకల్ మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా అమలు చేస్తున్న డైట్ మెనూ ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.

విద్యార్థులకు మరింత నాణ్యమైన ఆహారం: మంత్రి పొన్నం 
పెరిగిన డైట్ చార్జీలు నేటి నుండి అమలు అవుతుండడంతో ఇక నుండి విద్యార్థులకు మరింత నాణ్యమైన ఆహారం అందనుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మెనూ అనుభవం ఉన్న వైద్యుల సలహా సూచనల మేరకు రూపొందించబడిందన్నారు. ప్రభుత్వం విద్యకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తుందని నేటి విద్యార్థులు రేపటి మన భవిష్యత్ ఆస్తి అని దానిని మరింత మెరుగుపరుచుకోవడానికి అందరూ కృషి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. షేక్‌పేట్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల (బాలురు)లో వసతులను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. సంక్షేమ పాఠశాలలో లైబ్రరీ , కంప్యూటర్ ల్యాబ్ , డిజిటల్ క్లాస్ రూం ద్వారా విద్యార్థులకు అందే ప్రత్యేక కోర్సులను మంత్రి పొన్నం ప్రభాకర్ అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురశెట్టి ,ఇతర అధికారులు పాల్గొన్నారు.

పదేళ్లలో చేయలేని పనులు ఏడాదిలోనే చేశాం: శ్రీధర్ బాబు
రాష్ట్రంలోని పేద పిల్లలకు మెరుగైన విద్య అందించబోతున్నామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మంత్రి శ్రీధర్ బాబు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించారు. వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు గత ప్రభుత్వం లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఒక్క ఎకరాకు సాగు నీరు ఇవ్వలేదని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ పదేళ్లలో చేయలేని పనులు మేం ఏడాదిలోనే చేశామని అన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కు పెద్ద ఎత్తున నిధులు కేటాయించామని తెలిపారు. భూపాలపల్లి జిల్లాలో పారిశ్రామిక పార్క్‌కు శంకుస్థాపన చేశామన్నారు. భూపాలపల్లిలో 4 లైన్స్ రోడ్డు నిర్మాణం చేస్తామని చెప్పారు. మహిళలను కోటీశ్వరులను చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి శ్రీధర్ బాబు వివరించారు.

రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులకు పౌష్టికాహారం: మంత్రి ఉత్తమ్ 
ప్రభుత్వ వసతి గృహాలతో పాటు సాంఘీక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యానభ్యసిస్తున్న విద్యార్థినీ, విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 470 కోట్లు కేటాయించిందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3,943 విద్యా సంస్థలలో విద్య నభ్యసిస్తున్న 8 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుందని ఆయన తెలిపారు. ఇందులో 1,025 రెసిడెన్షియల్ పాఠశాలలు ఉండగా 313 ఆశ్రమ పాఠశాలలు ,495 కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు( కే. జి.బి.బి.ఎస్) 2,100 సాంఘిక సంక్షేమ వసతి గృహాలు ఉన్నట్లు ఆయన వివరించారు. సికింద్రాబాద్ ఈస్ట్ మారేడుపల్లి లోని మహేంద్రహిల్స్‌లో ఉన్న ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాల, జూనియర్ కళాశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొత్త మెనూను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు గణేష్ నారాయణ సాంఘిక సంక్షేమ శాఖాదికారిణి శారద, ప్రిన్సిపాల్ సునీత, ఇందిరతో పాటు ఆయా పాఠశాల, జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

డైట్ మెనూ ప్రారంభించిన స్పీకర్ : రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా అమలు చేస్తున్న డైట్ మెనూను ఎన్నపల్లి చౌరస్తాలోని మైనారిటీ పాఠశాల, జూనియర్ కళాశాల (బాలికల) లో తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్‌పీ నారాయణ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్, ఆర్‌డిఓ వాసు చంద్ర, కళాశాల ప్రిన్సిపాల్ మహబూబ్ ఫాతిమా, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ శంషాద్ బేగం, కౌన్సిలర్లు , ప్రజాప్రతినిధులు , విద్యార్థులు, తల్లి తండ్రులు పాల్గొన్నారు. అనంతరం స్పీకర్ ప్రసాద్ కుమార్ స్టోర్ రూం ను సందర్శించి, సన్నబియ్యం, సరుకుల నాణ్యతను తనిఖీ చేశారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.

విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యం: మంత్రి జూపల్లి 
ఎంతో ప్రాధాన్యతతో కూడుకున్న విద్యారంగాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తూ బలోపేతం చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకెళ్తున్నారని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం కొల్లాపూర్ లోని సాంఘీక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో కామన్ డైట్ మెనూ ప్రారంభ కార్యక్రమంలో మంత్రి జూపల్లి పాల్గొన్నారు. ప్రభుత్వం పెంచిన మెస్ ఛార్జీలకు అనుగుణంగా రూపొందించిన కొత్త డైట్ మెనూను మంత్రి ప్రారంభించారు. విద్యా వ్యవస్థను పటిష్టపర్చడం ద్వారా విద్యార్థులకు చక్కటి భవిష్యత్తును అందించాలనే కృత నిశ్చయంతో ప్రభుత్వం ఉందన్నారు.

ఐఐటి ప్రవేశాలే లక్ష్యంగా ప్రత్యేక కోచింగ్: ఎం దాన కిషోర్
ప్రతిభావంతులైన విద్యార్థినీలకు ఐఐటిలలో ప్రవేశాలు పొందేందుకు వీలుగా మహేశ్వరం లోని సోషల్ వెల్ఫేర్ గరల్స్ రెసిడెన్షియల్ స్కూల్ లో ఐఐటి కోచింగ్ ఇనిస్టిట్యూట్ పెట్టిస్తానని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎం దాన కిషోర్ అన్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం లోని సోషల్ వెల్ఫేర్ గర్ల్ రెసిడెన్షియల్ స్కూల్ లో న్యూ కామన్ డైట్ మెనూ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎం దాన కిషోర్ ముఖ్య అతిథిగా హాజరై గురుకులంలో కామన్ డైట్ మెనూను ప్రారంభించారు. గురుకులంలో తరగతి గదులను, వాష్ రూంలలో పారిశుధ్ధాన్ని ముఖ్య కార్యదర్శి పరిశీలించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News