Tuesday, January 21, 2025

నిధులు ఇప్పించండి

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలోని పది ప్రాజెక్టులకు సహకరించండి
ఆర్థిక సహాయం, అనుమతులు ఇప్పించండి
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని కోరిన డిప్యూటీ సిఎం భట్టి

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం, అనుమతులు ఇప్పించేందుకు సహకరించాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డిని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు కోరారు. ఒడిస్సా రాష్ట్రం కోణార్క్‌లో జరుగుతున్న మూడవ జాతీయ మైనింగ్ మంత్రుల సమావేశంలో భాగంగా రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టుల ఆర్థిక అంచనాలు, అనుమతులతో కూడిన లేఖను కిషన్ రెడ్డికి కోణార్క్ లో డిప్యూటీ సీఎం సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అభివృద్ధి ప్రాజెక్టులను మీ పరిశీలనకు, అవసరమైన చర్యలు తీసుకోవడానికి మీకు తెలియజేయాలని కోరుకుంటున్నానని ఆలేఖలో డిప్యూటీ సీఎం కోరారు. ప్రాంతీయ రింగ్ రోడ్ ప్రాజెక్టు ను 2016లో కేంద్ర రహదారుల మంత్రిత్వ శాఖ సూత్రప్రాయంగా ఆమోదించింది. 2022 జూలై 3న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజయ సంకల్ప సభలో 350 కిలోమీటర్ల ప్రాంతీయ రింగ్ రోడ్ నిర్మాణాన్ని ప్రస్తావించార ని గుర్తు చేశారు. ప్రాజెక్టు వ్యయం రూ.34,367.62 కోట్లు అవుతుందని అంచనా వేశారని తెలిపారు. ఉత్తర, దక్షిణ కారిడార్లకు కేంద్రం ఆర్థిక ఆ మోదం ఇప్పటికీ ఇవ్వలేదని, భూ సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం ఖ ర్చును భరించడానికి సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.

మరో ప్రాజెక్టు రేడియల్ రోడ్ల అభివృద్ధి గురించి వివరిస్తూ హైదరాబాద్ మెట్రో కారిడార్లోని 10 కొత్త గ్రీన్ఫీల్ రేడియల్ రోడ్ల అభివృద్ధి ద్వారా నగర విస్తరణకు ప్రణాళిక రూపొందించినట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.45,000 కోట్లుగా తెలిపారు. మూడవది మెట్రో రైల్ ఫేజ్- 2కి కేంద్రం సహకారం అందించాలని కోరారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు సంబంధించి మొత్తం 76.4 కి.మీ మేర కొత్త కారిడార్లను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించామని, దీని అంచనా వ్యయం రూ.24,269 కోట్లు అని స్పష్టం చేశారు. ఇక నాలుగో ప్రాజెక్టు మూసీ నది తీరాభివృద్ధి గురించి వివరిస్తూ మూసీ నదికి పునరుజ్జీవన ప్రాజెక్టు, బాపు ఘాట్ వద్ద గాంధీ సరోవర్ అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.14,100 కోట్లుగా తెలిపారు.

గోదావరి, -మూసీ నదుల అనుసంధానం
ఐదవ అంశంగా గోదావరి -మూసీ నదుల అనుసంధానమని తెలిపారు. గోదావరి నుంచి 5 టీఎంసీ నీటిని మళ్లించి మూసీ నదిని శుద్ధి చేయడం కోసం చేపట్టే ఈ ప్రాజెక్టు వ్యయం రూ.7,440 కోట్లుగా భట్టి స్పష్టం చేశారు. అలాగే హైదరాబాద్ నగరానికి సీవరేజ్ మాస్టర్ ప్లాన్ కోసం హైదరాబాద్ నగరానికి 7,444 కి.మీ పొడవునా సీవరేజ్ మాస్టర్ ప్లాన్ రూపొందించబడిందని వెల్లడించారు. ఈప్రాజెక్టు వ్యయం రూ.17,212.69 కోట్లుగా తెలిపారు. వరంగల్ భూగర్భ డ్రైనేజీ ప్రణాళికలో భాగంగా రూ.4,170 కోట్లు వ్యయంతో చేపట్టే ప్రణాళిక అమలు కోసం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. బందర్ పోర్ట్ నుండి హైదరాబాదు డ్రై పోర్టుకు గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణాన్ని

రూ.17,000 కోట్లుతో చేపట్టే ప్రాజెక్టును అమలు చేయాలని కోరారు. సింగరేణి బొగ్గు బ్లాక్ కేటాయింపులో భాగంగా తెలంగాణలోని గోదావరి వ్యాలీ బొగ్గు బ్లాక్‌ను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌కు కేటాయించాల్సిందిగా అభ్యర్థించారు. ఇక చివరిగా సెమీకండక్టర్ మిషన్ కార్యక్రమంలో భాగంగా మొత్తం వ్యయం రూ.1,63,559.31 కోట్లతో సెమీకండక్టర్ తయారీ కోసం హైదరాబాదు అనుకూలమైన కేంద్రంగా అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టాలని కోరారు. ఈ పది ప్రాజెక్టులపైనా కేంద్రమంత్రిగా, తెలంగాణ వాసిగా కేంద్రం నుంచి తగిన సహాయం, సహకారం అందించాలని భట్టి విక్రమార్క కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News