ఎపి అక్రమంగా నిర్మిస్తున్న
రాయలసీమనూ సవాల్ చేస్తాం
ఈ రెండు ప్రాజెక్టులతో తెలంగాణ
సాగు,తాగునీటికి తీవ్ర ఇబ్బందులు
తప్పవు జిఆర్‌ఎంబి, కెఆర్‌ఎంబి
ఎపెక్స్ కౌన్సిల్ అనుమతులు
లేకుండానే ప్రాజెక్టుల నిర్మాణానికి
సిద్ధమవుతున్న ఎపి : మంత్రి ఉత్తమ్
మన తెలంగాణ / హైదరాబాద్ : కృష్ణా, గోదావరి నదులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన రాయల సీమ ఎత్తిపోతల పథకంతో పాటు బనకచర్ల ఎత్తిపోతల పధకం నిర్మాణాల పై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు రాష్ట్ర నీ టిపారుదల, పౌరసరఫరాల శాఖమంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. నిబంధనలకు భిన్నంగా ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్మించతల పెట్టిన ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణాలతో తెలంగాణా సాగునీటి ప్రా జెక్టులతో పాటు తెలంగాణ జిల్లాల్లో తాగు నీ టికి ఇబ్బందులు ఏర్పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపి ప్రభుత్వం అక్ర మ సాగునీటి ప్రాజెక్టులపై త్వరలో సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ప్రభుత్వం నిర్ణయించిన ట్లు మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. శుక్రవారం నీ టిపారుదల శాఖా ప్రధాన కార్యాలయం జలసౌధలో నీటిపారుదల శాఖాధికారులతో మం త్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. నీటిపారుదల శాఖ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు అదిత్యానాథ్‌దాస్ , ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఆర్ అండ్ ఆర్ కమిషనర్ విన య్ కృష్ణారెడ్డి, ఇంజినీరింగ్ చీఫ్‌లు అనిల్ కు మార్, విజయ్ భాస్కర్ రెడ్డి చీఫ్ ఇంజినీర్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు సమీక్షకు హాజరయ్యా రు. నీటిపారుదలస్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు, అడ్వకేట్ జనరల్ తో త్వరలోనే ప్రత్యేక సమావేశం నిర్వహించి గోదావరి, కృష్ణా నదులలో తెలంగాణకు న్యాయబద్ధంగా రావాల్సిన వాటాను కాపాడేందుకు సుప్రీంకోర్టులో కేసు వేయడానికి సన్నద్దం అవుతున్నట్లు మంత్రి తెలిపారు.
ఏపి రూట్ మ్యాప్ అడ్డుకుంటాం
ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరిపై నిర్మించ తలపెట్టిన బనకచర్ల ఎత్తిపోతల పథకం రూ.80,112 కోట్లు అని, ఈ ప్రాజెక్టు ద్వారా పోలవరం వద్ద 200 టియంసిల గోదావరి నీటిని బొల్లపల్లి రిజర్వాయర్, బనకచర్ల హెడ్ రెగ్యులేటట్ ద్వారా రాయలసీమకు మళ్లించనున్నారని మంత్రి వెల్లడించారు. తద్వారా గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేసేందుకు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం రూట్ మ్యాప్ రూపొందించుకుందన్నారు. ఏపి రూట్ మ్యాప్‌ను అడ్డుకుంటామని మంత్రి వెల్లడించారు.
ఇది విభజన చట్టాల ఉల్లంఘన
1980 లో జి.డబ్ల్యూ.డి.టి ట్రిబ్యునల్ ఉత్తర్వులు, 2014 ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థ్థీకరణ చట్టాలను ఏపి ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని మంత్రి ఉత్తమ్ ఆరోపించారు. కేంద్ర జల వనరుల సంఘం, జీ.ఆర్.యం.బి, కే.ఆర్.యం.బి, ఎపెక్స్ కౌన్సిల్ నుంచి అనుమతులు పొంద కుండానే ఏపి ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణాలకు పూనుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థ్థీకరణ చట్టంలోని 46(2), 46(3) ఆధారంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసమే కేంద్రం నుంచి నిధులు పొందేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్దమని మంత్రి చెప్పారు.
తొలుత నుంచే అభ్యంతరం
ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నది జలాశయాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేసిన విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తుచేశారు. తెలంగాణ లేవనెత్తిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని కేంద్ర పర్యావరణ ,అటవీ, పర్యావరణ శాఖలకు చెందిన నిపుణుల కమిటి ఫిబ్రవరి నెలలో రాయలసీమ ప్రాజెక్టును అంతకు ముందున్న స్థితికి తీసుకు రావాలని ఏపి ప్రభుత్వాన్ని ఆదేశించారని మంత్రి ఉత్తమ్ వివరించారు.
పర్యావరణ నిబంధనలకు విరుద్దం
పర్యావరణ నిబంధనలను ఏపి ప్రభుత్వం ఉల్లంఘనలకు పాల్పడుతుందని కమిటి స్పష్టం చేసిందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంతో పాటు జాతీయ హరిత ట్రిబ్యునల్, సుప్రీంకోర్టు, సంబంధిత మంత్రిత్వ శాఖలు చేసిన విజ్ఞప్తుల ఫలితమే ఆ ప్రాజెక్టును పూర్వ స్థితిలో ఉంచాలని నిర్ణయం తీసుకుందన్నారు.ఇంత జరిగిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరోక్ష మార్గాల ద్వారా ప్రాజెక్టు నిర్మాణాన్ని కొనసాగిస్తుందని మంత్రి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఈ పరిణామాలను చూస్తూ ఊరుకోబోదని, తెలంగాణకు జరుగుతున్న ఇబ్బందులను సుప్రీంకోర్టు ముందుంచడంతో పాటు ఏపి ప్రభుత్వం నిబంధనల ఉల్లంఘన పై వాదనలు వినిపించి ఏపి సర్కార్ అక్రమంగా నీటి తరలింపును అడ్డుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
ప్రమాదంలో భద్రాచలం
రాయలసీమకు గోదావరి వరద నీటిని మళ్ళింపు అంటూ జరిగితే భద్రాచలం వంటి ప్రాశస్త్యం కలిగిన దేవాలయం ప్రమాదపుటంచున పడే ప్రమాదం ఉందని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. పదేళ్ళుగా బిఆర్‌ఎస్ ప్రభుత్వం చూపించిన ఉదాసీనతతోనే ఏపి ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడిందని విమర్శించారు. అక్రమంగా నీటిని ఆంధ్రప్రదేశ్ తరలించుకుంటూ పోతుంటే ఆనాడు కేసిఆర్ ప్రభుత్వం చోద్యంలా చూసింది మినహా అడ్డుకోలేక పోయారని ఆరోపించారు.
పూడిక తీత పనులకు త్వరలోనే టెండర్లు
రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ప్రాజెక్టుల పూడిక తీతపనులకు త్వరలోనే టెండర్లు పిలువ నున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. చెరువులలో రిజర్వాయర్లలో నీటి సామర్ధ్యం పెంపొందించేందుకు పూడిక తీత పనులు చేపట్టామని తెలిపారు.