బడ్జెట్‌లో కేటాయింపులు
ఘనం.. ఖర్చులు స్వల్పం
భట్టి వాస్తవాలు చెబితే సిఎం
బురిడీ కొట్టిస్తున్నారు
అసెంబ్లీలో బిఆర్‌ఎస్
ఎంఎల్‌ఎ హరీశ్‌రావు
మనతెలంగాణ/హైదరాబాద్: బిఆర్‌ఎస్ హయాంలో అప్పు ఏటా 42 వేల కోట్లు మాత్రమే అని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏ డాదిలో చేసిన అప్పు 1 లక్షా 48 వేల కోట్లు అని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీశ్‌రావు వెల్లడించారు. అసెంబ్లీలో గురువా రం రాత్రి ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడారు. రైతు భరోసాకు 15 వేల కోట్లు పెట్టారని, కేవలం 4500 కోట్లు ఖర్చు పెట్టారని చెప్పారు. అంటే 11వేల కోట్లు రైతు భరోసాలో కోత పెట్టారని ఆరోపించారు. రుణమాఫీకి బడ్జెట్‌లో 31 వేల కోట్లు ఇస్తామని చెప్పి, 20 వేల కోట్లు మాత్రమే ఇచ్చారని తెలిపారు. రుణమాఫీలో కూ డా ప్రభుత్వం రూ.11 వేల కోత పెట్టిందని పేర్కొన్నారు. ఫ సల్ భీమాకు 1300 కోట్లు పెట్టామని బడ్జెట్‌లో చెప్పారని, కానీ ఒక్క రూపాయి ఇవ్వలేదని అన్నారు. రైతులకే గత బడ్జెటట్‌లో 23 వేల కోట్లు కోతపెట్టి, రైతుల ఉసురు పోసుకున్నారని మండపడ్డారు. ఐదేండ్లలో లక్ష కోట్లకు కోత పెడతారని పేర్కొన్నారు.
నియోజకవర్గానికి 3500 ఇండ్ల చొప్పున 4 లక్షల 50 వేల ఇండ్లు కడుతామని గత బడ్జెట్‌లో చెప్పారని, 22500 కోట్లలో ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదని ఆరోపించారు. దీన్ని బట్టి చూస్తే ఎస్‌సి, ఎస్‌టి, బిసిలకు 22,500 కోట్లు నష్టం చేశారని వ్యాఖ్యానించారు. మైనారిటీలకు 3000 కోట్ల బడ్జెట్ పెట్టారని, ఇచ్చింది 1100 కోట్లు మాత్రమే అని, 1900 కోట్లు కోత పెట్టారని అన్నారు. ఎస్‌సి,ఎస్‌టి సబ్ ప్లాన్‌లో కూడా 60 శాతానికి మించి ఖర్చు పెట్టలేదని పేర్కొన్నారు. వానకాలం ఇవ్వాల్సిన రైతుబంధు 8 వేల కోట్లు ఎగ్గొట్టారని, యాసంగిలో 8వేల కోట్లు ఇవ్వాల్సి ఉంటే 3500 కోట్లు ఇచ్చి, 4500 కోట్లు ఎగ్గొట్టారని చెప్పారు. అంటే 8+4 = 12 వేల కోట్ల రూపాయలు రైతుభరోసా ఎగ్గొట్టారని, అవే డబ్బులు రుణమాఫీలో కలిపారని ఆరోపించారు. 20 వేల కోట్లలో 12 వేల కోట్లు తీసేస్తే, ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీ కేవలం 8 వేల కోట్లు మాత్రమే అని, చెప్పింది 31 వేల కోట్లు.. చేసింది 8 వేల కోట్లు అని పేర్కొన్నారు.
సిఎం చెప్పింది తప్పు అని చెప్పినందుకు భట్టికి ధన్యవాదాలు
16 నెలల కాంగ్రెస్ పాలనా కాలంలో అప్పులు కట్టడానికి 88,564 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని మంత్రి భట్టి విక్రమార్క 7 గంటల 44 నిమిషాలకు చెప్పారని, సిఎం రేవంత్‌రెడ్డి ఇదే విషయమై 3.58 నిమిషాలు అసెంబ్లీలో ఏం చెప్పారని తెలిపారు. తాము 1,53,359 కోట్లు అప్పులు, మిత్తీల కింద చెల్లించామని చెప్పారని, అంటే నాలుగు గంటల్లోనే ఎంత మారిపోయిందో చూడాలని కోరారు. భట్టి విక్రమార్క ఆర్థిక శాఖ మంత్రిగా వాస్తవం చెప్పారని, సిఎం బురిడీ కొట్టించి కార్పొరేషన్ అప్పులు కూడా కలిపి చెప్పారని విమర్శించారు.అసెంబ్లీలో పెట్టిన కాగ్ రిపోర్టు 12వ పేజీలో కూడా అదే చెప్పారని వివరించారు. మొత్తానికి సిఎం చెప్పింది తప్పు అని భట్టి విక్రమార్క చెప్పినందుకు హరీష్‌రావు ధన్యవాదాలు తెలిపారు. ఫామ్ బీ -5 ప్రకారం, కాగ్ రిపోర్టు ప్రకారంగా బిఆర్‌ఎస్ హయాంలో చేసిన అప్పు 5 లక్షల 17 వేల కోట్లు అని తేలిందని, అందులో ప్రభుత్వం కట్టని కార్పొరేషన్ అప్పులు, గత ప్రభుత్వ అప్పులు తీసేస్తే 4 లక్షల 18 వేల 284 కోట్లు మాత్రమే (ఎప్‌ఆర్బీఎం, కాళేశ్వరం, మిషన్ భగీరథ కలిపి) అని తెలిపారు. మంత్రి భట్టి విక్రమార్క పెట్టిన బడ్జెట్ ప్రకారం చూసినా అప్పు 4,22,674 కోట్లు మాత్రమే తెలిపారు.